Home News అస‌లు చ‌ర్రిత‌ను బ‌య‌ట‌కు తీసుకోద్దాం – శ్రీ సునీల్ అంబేక‌ర్

అస‌లు చ‌ర్రిత‌ను బ‌య‌ట‌కు తీసుకోద్దాం – శ్రీ సునీల్ అంబేక‌ర్

0
SHARE
  • గోల్కొండ సాహితీ మ‌హోత్సవ ముగింపు సభ

హైద‌రాబాద్‌లోని నారాయ‌ణ‌గూడ కేశ‌వ‌మెమోరియ‌ల్ క‌ళ‌శాల‌లో రెండు రోజుల పాటు జ‌రిగిన గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వం విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్య‌క్ర‌మానికి జ‌స్టిస్ ఎల్‌. న‌ర్సింహారెడ్డి ముఖ్య అథితిగా, ప్ర‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత టి.హ‌నుమాన్ చౌద‌రి గారు విశిష్ట అథితి గా, డా. సి.సంజీవ్ కుమార్ శ‌ర్మ గారు మ‌రో విశిష్ట అథితిగా. ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ సునీల్ అంబేక‌ర్ గారు ప్ర‌ధాన వ‌క్త‌గా పాల్గొన్నారు. ఇతిహాస సంక‌ల‌న స‌మితికి చెందిన శ్రీ కిష‌న్ రావు గారు, ప్రొ. జి.వ‌ల్లీశ్వ‌ర్ గారు, సంస్కార భార‌తి అధ్య‌క్షులు కె.కె.వి శ‌ర్మ, స‌మాచార భార‌తి అధ్య‌క్షులు డా. గోపాల్ రెడ్డి, అచార్య క‌సిరెడ్డి వెంక‌ట‌రెడ్డి గారు కూడా హ‌జ‌ర‌య్యారు. పేరిణీ నాట్యంతో ప్రారంభ‌మైన కార్య‌క్ర‌మం ఆహూతుల‌ను ఎంత‌గానో అకట్టుకుంది. మొద‌ట‌గా వ‌ల్లీశ్వ‌ర్ గారు స్వాగ‌త వ‌చ‌నం చేశారు. రెండు రోజుల పాటు జ‌రిగిన సాహితీ మ‌హోత్స‌వ వివ‌రాల‌ను తెలిపారు. అనంత‌రం “చ‌రిత్ర ప‌రిశోధ‌న వ్యాసాలు”, “తెలంగాణ విముక్తి పోరాటంలో అజ్ఞాత వీరులు” అనే పుస్త‌కాల‌ను అతిథులు ఆవిష్క‌రించారు. అనంత‌రం ర‌చ‌యిత కంద‌కుర్తి యాద‌వ‌రావు దంప‌తుల‌ను స‌న్మానించారు.

అనంత‌రం టి.హ‌నుమాన్ చౌద‌రి గారు మాట్లాడుతూ ప్ర‌స్తుతం మేదావుల మ‌ధ్య అంత‌ర్యుద్దం జ‌రుగుతోంద‌ని అన్నారు. మెకాలే మానసపుత్రులు, వ‌సుదైక కుటుంబం అనే ఆశ‌య‌బ‌ద్ధులైన భారతీయులు మేధోప‌ర‌మైన యుద్ధానికి సిద్ధం అవుతున్నార‌ని అన్నారు. ఈ యుద్ధానికి సంసిద్ధం కావ‌డానికి గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వం వంటి కార్య‌క్ర‌మాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ఆయ‌న అన్నారు.

అనంత‌రం విశిష్ట అథితి సంజీవ‌కుమార్ శ‌ర్మ గారు మాట్లాడుతూ స్వ‌ధ‌ర్మం, స్వాభిమానం, స్వ‌రాజ్యం గురించి వివ‌రించారు. మ‌హాభార‌తంలోని ధ‌ర్మం గురించి వివ‌రించారు. పాల‌కులు లేకున్నా ధ‌ర్మాన్ని ఆచ‌రించాల‌ని, అదే స్వ‌ధ‌ర్మమ‌ని అన్నారు. మ‌న ద‌గ్గ‌ర ఉన్న మంచిని అంద‌రికీ పంచాల‌ని, వ‌సుదైవ కుటుంబ‌కం అంటే క‌రోనా స‌మ‌యంలో భార‌త్ ప్ర‌పంచానికి చాటిచెప్పింద‌ని గుర్తు చేశారు. సాంస్కృతిక ఐక‌మ‌త్యం మ‌న దేశాన్ని ఏకంచేస్తుంద‌ని అన్నారు. యువ సాహిత్య‌కారుల ఆలోచ‌న‌ల‌ను నాట‌కాల రూపంతో నిర్భ‌యంగా ప్ర‌క‌ట‌న చేశార‌ని ఆయ‌న అన్నారు.

అనంత‌రం ముఖ్య అథితి జ‌స్టిస్ ఎల్‌. న‌ర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ చ‌రిత్ర మనం ఇప్పుడు చెప్పుకుంటున్న‌ట్టుగా తేదీలు, యుద్ధాలు, రాజుల పేర్లు కాద‌ని చ‌రిత్ర అంటే చారిత్ర‌క స‌త్యాలని అన్నారు.

అనంత‌రం ప్ర‌ధాన వక్త ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ సునీల్ అంబేక‌ర్ గారు మాట్లాడుతూ
ఎన్నో ఆక్ర‌మ‌ణ‌లు, ఎంతో సుదీర్ఘ ప‌రిపాల‌న త‌ర్వాత కూడా తెలుగు సాహిత్యం ఉన్న‌తంగా నిల‌బ‌డిందని అన్నారు. మ‌న దేశంలోని అన్ని భాష‌లు అదేవిధంగా నిల‌బ‌డ్డాయ‌న్నారు. స్వ – లో స్వ‌భాష కూడా ఉంద‌న్నారు. భాష కూడా ఒక త‌రం నుంచి మ‌రో త‌రానికి అందుతోంద‌ని, “స్వ‌” భాషా ప్ర‌యోగం ఎంతో ఆనందాన్ని ఇస్తోంద‌న్నారు. ఆంగ్లేయుల‌ను దేశం నుంచి త‌ర‌మ‌డానికి మాత్ర‌మే మ‌నం సంఘ‌ర్ష‌ణ చేయ‌లేద‌ని, మ‌న స్వ‌ధ‌ర్మాన్ని, సంస్కృతిని కాపాడ‌టానికి కూడా సంఘ‌ర్ష‌ణ చేశామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. మ‌న స్వ‌ధ‌ర్మం ఒక్క రోజులో ఎవ‌రో రాస్తే వ‌చ్చిన‌ది కాద‌ని, ఇది మ‌న త‌ర‌త‌రాల సాధ‌న‌లో ప‌రిశుద్ధ‌మైన‌ద‌ని, మ‌న ఋషుల సాధ‌న‌లో, సాహితీ వేత్త‌ల కృషితో మ‌న‌కు అందింద‌ని తెలిపారు. వేదాలు , మ‌హాభార‌తం, రామాయ‌ణం కూడా సాహిత్యంలో భాగ‌మేని అవి అన్నారు. మ‌నం ఎలా జీవించాలి, ఎక్క‌డ విన‌మ్ర‌త‌, ఎక్క‌డ ధైర్య‌త ప్ర‌ద‌ర్శించాలో నేర్పింది మ‌న సాహిత్య‌మే అని అన్నారు. సావ‌ర్క‌ర్ రాసిన “స్వాధీన‌త సంగ్రామ్ 1857″లో యువ‌కుల ప‌రాక్ర‌మం, వీర‌త్వం గురించి వివ‌రించార‌ని తెలిపారు.

మ‌న సాహిత్యం విజ‌యాన్ని, సంఘ‌ర్ష‌ణ‌ను మ‌న‌కు నేర్పుతోంద‌న్నారు. నంద‌రాజు ప‌రిపాల‌న స‌క్ర‌మంగా లేక‌పోతే, ప్ర‌జ‌ల‌ సంఘ‌ర్ష‌ణ‌తో నూత‌న రాజును తీసుకున్న దేశం మ‌న‌ద‌ని, రాజుతోనే నాశ‌నమ‌య్యే దేశం కాద‌ని గుర్తు చేశారు. స్వాభిమానం, జాగృతం చేసే సాహిత్యం మ‌న‌కు ఎల్ల‌పుడూ అందుతూనే ఉంద‌న్నారు. సాహిత్యం పుస్త‌కాల‌లో మాత్ర‌మే కాదు, మ‌న ప్ర‌తీ క‌ణంలో ర‌గులుతూనే ఉంటుంది, మ‌ళ్లీ పుడుతూనే ఉంటుంద‌ని అందుకు ఉదాహ‌ర‌ణ‌ త‌క్ష‌శిల విశ్వ‌విద్యాల‌యం త‌గ‌ల‌బ‌డుతూ కూడా మ‌న సాహిత్యం నిత్య‌జీవ‌నంగా ఉంద‌ని గుర్తు చేశారు.

భార‌త ఇతిహాసం గౌర‌వ‌పూర్ణ‌మైన‌ది, ఆదర్శ‌నీయ‌మైన‌ద‌ని, మ‌న జీవ‌న సౌంద‌ర్యం, ఆయుర్వేదం మ‌న సాహిత్యంలో ఉంద‌ని తెలిపారు. ఋషుల ప‌రిశ్రమ‌, ప‌రిశోధ‌న మ‌న‌కు పుస్త‌కాల రూపంలో ఇంకా అందాల్సి ఉంద‌ని అన్నారు. కాళిదాసు కావ్యాల‌లో ఋతువులు, పువ్వులు, వ‌నాల సౌందర్యాన్ని ఎంతో అద్భుతంగా వివ‌రించార‌ని తెలిపారు. స్వాధీన‌త మ‌న‌కు వ‌చ్చింది… కానీ స్వాభిమానం ఇంకా రావాల్సి ఉంద‌ని.. ప్ర‌పంచానికి స్వాభిమానుల్ని అందించే దేశం భార‌త్ మాత్ర‌మే అని ఆయ‌న అన్నారు. అమ‌ర‌మైన ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు కూడా మ‌న సాహిత్యంలో భాగ‌మే న‌ని, అది ప్ర‌పంచానికి అందించే బాధ్య‌త మ‌న‌దేన‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ దేశాన్ని ఏ విధంగా మార్చుకోవాలో రాజ్యాంగ నిర్మాత‌లు మ‌న‌కు రాముని చిత్రంతో మ‌న‌కు సూచించార‌ని, దాని కోసం మ‌న భావితరం, యువ‌త‌రం కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. మ‌న విశ్వ‌విద్యాలయాల్లోని గ్రంథాల‌యాల‌లో ఎన్నో పుస్త‌కాలున్నాయ‌ని, ప‌రిశోధ‌కులు వాటిని తెర‌చి చూడాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని గుర్తు చేశారు. సాహిత్యానికి కొర‌త లేదు… చ‌దివే, చ‌దివించాల్సిన ప‌రిశ్ర‌మ మ‌న‌కు అవ‌స‌ర‌మ‌న్నారు. సాహిత్య రంగంలో మార్పు వ‌స్తున్న‌ద‌ని, దానికి మ‌నం ప్రోత్సాహం ఇవ్వాల‌ని, మ‌న సాహిత్య ప్ర‌వాహంలో కుహ‌నా చ‌రిత్ర కొట్టుకు పోవాల‌ని అన్నారు. యువ‌కుల ఆలోచ‌న‌ల‌లో విప్ల‌వం వ‌చ్చింద‌ని మ‌నం గ‌తంలో అందించిన త‌ప్పుడు చ‌రిత్ర‌ను మార్చాల‌ని వారు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వారిని ప్రోత్స‌హించాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని ఆయ‌న గుర్తు చేశారు. డా.అమర్ నాథ్ వందన సమర్పణతో ఉత్సవాలు ముగిశాయి.