Home Telugu Articles భాష తమిళం.. జాతీయతా గళం

భాష తమిళం.. జాతీయతా గళం

0
SHARE

-కల్హణ

ఈ స్వాతంత్య్ర కాంక్ష చల్లారేదెప్పుడు?
బానిసత్వం మీద మన ప్రేమకు అంతం ఎప్పుడు?
మన తల్లి సంకెళ్లు తెగిపడేదెప్పుడు?
మన కడగండ్లు ముగిసేదెన్నడు?

భారతదేశం (కవితలోని ‘తల్లి’) స్వాతంత్య్రోద్యమ దీక్షకు సన్నద్ధమవుతున్న  చారిత్రక సందర్భంలో ప్రశ్నల రూపంలో ప్రతిధ్వనించిన కవిత ఇది. అప్పుడప్పుడే అంకురిస్తున్న జాతీయభావాలకు దిశా నిర్దేశం చేసిన పంక్తులవి. సరైన సమయంలో అక్షర రూపం దాల్చిన ఆశయాలు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఏ పంథాలో పోరాడాలి? విన్నపాలూ వినతుల ద్వారానా? స్వాతంత్య్రాన్ని జన్మహక్కుగా నినదిస్తూనా? అన్న సందిగ్ధంలో   దేశ మేధోవర్గం కొట్టుమిట్టాడుతున్న వేళ ఈ ప్రశ్నలు వినిపించాయి.  స్వాతంత్య్ర సమరయోధుడు, ఆధునిక తమిళ కవిత్వానికి ఆద్యుడు సుబ్రహ్మణ్య భారతి రాసిన ఒక కవితలోని పంక్తులివి. దక్షిణ భారతదేశంలో అతి జాతీయవాదం వైపు అడుగులు వేసిన కొద్దిమందిలో సుబ్రహ్మణ్య భారతి (డిసెంబర్‌ 11,1882`సెప్టెంబర్‌ 11, 1921) ఒకరు. ఆయన మహాకవి. పత్రికా రచయిత. స్వాతంత్య్ర సమరయోధుడు. సంఘ సంస్కర్త. 20వ శతాబ్దం ఆరంభంలోనే మహిళల హక్కుల కోసం గళమెత్తిన దార్శనికుడు.

తమిళనాడులోని ఎట్టయాపురంలో భారతి జన్మించారు. తండ్రి చిన్నస్వామి సుబ్రహ్మణ్య అయ్యర్‌, తల్లి లక్ష్మి అమ్మాళ్‌. ఐదో ఏటనే అమ్మనీ, 16వ ఏట నాన్ననీ కోల్పోయారాయన. తిరునల్వేలిలోని ఎండిటి విద్యాసంస్థలో చదువుకున్నారు. చిన్నతనంలోనే సంగీతంలో మంచి ప్రవేశం లభించడంతో భారతి అన్న బిరుదు వరించింది. నిజానికి ఆయన అసలు పేరు సుబ్బయ్య. కొడుకు ఇంగ్లిష్‌, అర్ధమేటిక్‌ చదివి ఇంజనీర్‌ అయి, చక్కని జీవితం గడపాలని ఆయన తండ్రి కోరుకున్నారు. కానీ భారతి ఎప్పుడూ స్వప్న జగత్తులో ఉండేవారట. దీనితో ఆయనకు డిగ్రీలు తెచ్చే చదువు పెద్దగా అబ్బలేదు. ఆనాటి ఆచారం ప్రకారం భారతి 14వ ఏటనే చెల్లమ్మాళ్‌ అనే బాలికను తెచ్చి తండ్రి పెళ్లి చేశారు. పెళ్లి తరువాత ఆయనకు ఈ విశాల ప్రపంచం చూడాలని అనిపించింది. 1898లో వారణాసి వెళ్లారు. అలా నాలుగేళ్లు దేశాటన చేశారు. అప్పుడే ఈ దేశం ఎలాంటి దుస్థితిలో ఉందో గమనించే అవకాశం ప్రత్యక్షంగా వచ్చింది.

కాశీలో ఉండగానే ఆయనకు హిందూధర్మం, జాతీయవాదాలతో అనుబంధం ఏర్పడిరది. దానితో సంస్కృతం చదివారు. అప్పుడే హిందీ, ఇంగ్లిష్‌ కూడా నేర్చుకున్నారు. గడ్డం, తలపాగా అప్పటి నుంచే అలంకారాలయ్యాయి. దక్షిణభారతంలో ఆనాడు ఉన్న చాలా మూఢనమ్మకాలను ఆయన వ్యతిరేకించారు. 1905లో మొదటిసారి ఆయన కాశీలోనే భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరయ్యారు. అక్కడ నుంచి తిరిగి స్వగ్రామం వెళుతున్న సమయంలోనే సోదరి నివేదిత కలిశారు. ఆమెను కలుసుకోవడం మరొక చింతనకు దారి తీసింది. మహిళల స్థానాన్ని గుర్తించే సంస్కారం అలవడిరది. విముక్తికి ఉపకరించగల ఒక శక్తిని ఆయన ఆధునిక మహిళలో దర్శించడం ఆరంభించారు.

దేశాటన ఆయనకు ఇచ్చిన మరొక కానుక, పత్రికా రచన ప్రాధాన్యాన్ని గుర్తించడం. పాశ్చాత్య దేశాలలో పత్రికా రంగం తెచ్చిన విప్లవం గురించి కూడా ఆయనకు బోధపడినది అప్పుడే. తమిళనాడు వచ్చిన తరువాత ‘స్వదేశీ మిత్రన్‌’ (1882-1985) పత్రికలో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా చేరారు. ఈ పత్రిక చరిత్రాత్మకమైనది. ది హిందూ పత్రికను స్థాపకులలో ఒకరైన జి. సుబ్రహ్మణ్య అయ్యర్‌ ఈ తమిళ పత్రికను ఆరంభించారు. ఆయన కూడా జాతీయవాదే. మద్రాస్‌ కేంద్రంగా భారతీయులు స్థాపించుకున్న తొలి తమిళ పత్రిక కూడా ఇదే. స్వదేశీ మిత్రన్‌ అంటే స్వయం పాలనకు మిత్రుడు అనే. భారత జాతీయ కాంగ్రెస్‌ తొలితరం నేతలలో ఒకరైన సుబ్రహ్మణ్య అయ్యర్‌ స్థాపించిన ఈ పత్రిక తమిళ ప్రాంతంలో జాతీయ భావాల వ్యాప్తికి ఎంతో ఉపకరించింది. ఇందులో నాడు సుబ్రహ్మణ్య భారతితో పాటు జాతీయవాదులు సుబ్రహ్మణ్య పిళ్లై, వీవీఎస్‌ అయ్యర్‌ కూడా పనిచేసేవారు. 1904 నుంచి 1907 వరకు స్వదేశీ మిత్రన్‌లో పనిచేసిన తరువాత ఎంపిటీ ఆచార్యతో కలసి భారతి ‘ఇండియా’ (తమిళం), ‘బాల భారతం’ (ఇంగ్లిష్‌) పత్రికలు ఆరంభించారు. ఎంపిటీ ఆచార్య ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన తీవ్ర జాతీయవాది. వివేకానందుడి భక్తుడు. లండన్‌లో ఇండియా హౌస్‌లో సావర్కర్‌తో కలసి పనిచేశారు. ప్రముఖ ఇండో`జర్మన్‌ కుట్ర కేసులో ఉన్నారు. తరువాత వామపక్షం వైపు వెళ్లారు.

ఆ రెండు పత్రికల ద్వారా భారతి తన ప్రతిభ, సృజనాత్మకతల విశ్వరూపం ప్రదర్శించారు. కవిత్వం, జాతీయవాదం, మనిషీ`దైవం నడుమ బంధం, రష్యా విప్లవం మీద, ఫ్రెంచ్‌ విప్లవం మీద గేయాలు` ఎన్నో అంశాలను ఆయన పాఠకులకు అందించేవారు. ఆ రోజులలోనే ఆయన బ్రిటిష్‌ దమననీతిని ఖండిరచడంతోపాటు, అట్టడుగు వర్గాల మీద కొందరు భారతీయులు ప్రదర్శిస్తున్న తీరును కూడా నిరసించేవారు.

1907 ఆయన రాజకీయ చింతనకు కొత్త దారి చూపింది. ఆ సంవత్సరం జరిగిన చరిత్రాత్మక సూరత్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు భారతి హాజరయ్యారు. ఆ వార్షిక సమావేశాలకు అరవిందుడు అధ్యక్షుడు. భారత జాతీయ కాంగ్రెస్‌ మితవాదులు, అతి జాతీయవాదులు అనే వర్గాలుగా విడిపోయింది. అతివాదులకు బాలగంగాధర తిలక్‌ నాయకుడు. భారతి తిలక్‌ వర్గం వైపే మొగ్గారు. అరవింద్‌ ఘోష్‌ కూడా ఈ వర్గాన్నే అనుసరించారు. వీఓ చిదంబరం పిళ్లై, కాంచి వరదాచార్య కూడా తమిళ ప్రాంతం నుంచి తిలక్‌ పంథాను అనుసరించినవారిలో ఉన్నారు. ఇందుకు చిదంబరం పిళ్లై పెద్ద మూల్యమే చెల్లించవలసి వచ్చింది.

ఆయన ఆ రోజులలోనే తమిళనాడులో పెద్ద నౌకా నిర్మాణ కేంద్రాన్ని స్థాపించారు. అది బ్రిటిష్‌ నౌకలకు పోటీ అయింది. దీనితో ఆయనను ఏవో కారణాలు చూపించి జైలుకు కూడా పంపారు. సరిగ్గా ఈ కేసులోనే బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా రాయడంతో భారతి అరెస్టుకు వారెంట్‌ జారీ అయింది. అప్పటికే పత్రిక యజమాని ఆచార్యను అరెస్టు చేశారు. భారతి తప్పించుకుని ఫ్రెంచ్‌ అధీనంలోని పుదుచ్చేరి చేరుకున్నారు. అక్కడ నుంచి ‘ఇండియా’, ‘విజయ’, ‘బాల భారతి’ అనే మూడు పత్రికలు వెలువరించారు. ఈవన్నీ వారపత్రికలు. అలాగే పుదుచ్చేరికే పరిమితమైన ‘సూర్యోదయం’ అనే పత్రికను కూడా నిర్వహించారు. 1909లో ఇండియా, విజయ పత్రికలను బ్రిటిష్‌ ఇండియాలోకి రాకుండా నిషేధించారు. పుదుచ్చేరిలో ఉండగానే అరవింద్‌ ఘోష్‌, లాలా లజపతిరాయ్‌, వీవీఎస్‌ అయ్యర్‌ వంటి మహోన్నతులను కలుసుకున్నారు. అరవిందులతో కలసి ఆయన ‘ఆర్య’, ‘కర్మయోగి’ పత్రికల ప్రచురణలో సహకరించారు. అక్కడే ‘చక్రవర్తిని’ మాసపత్రిక నిర్వహించారు. ‘భారతీయ మహిళాభ్యున్నతికి అంకితమైన పత్రిక’ అని ముఖపత్రం మీద ఒక నినాదం ఉండేది.

1918లో భారతి కడలూరు దగ్గర భారత దేశంలో ప్రవేశించి కావాలని అరెస్టయ్యారు. మూడు వారాలు ఆయనను కడలూరు జైలులోనే నిర్బంధించారు. తరువాత ఆయన గాంధీజీని కూడా కలుసుకున్నారు. అనంతర కాలాలలో కూడా ఆయన కొన్ని పర్యాయాలు జైలుకు వెళ్లారు. అదే ఆయన ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపింది. 1920లో రాజకీయ ఖైదీలకు సాధారణ క్షమాభిక్ష పెట్టడంతో ఆయనకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఆయన మరణం విచిత్రంగా సంభవించింది. మద్రాస్‌లోనే ట్రిప్లికేన్‌ లోని పార్థసారథి ఆలయంలో ఒక ఏనుగుకు ఆయన నిత్యం ఏదో ఒకటి తినిపించేవారు. అదే ఒకరోజున దాడి చేసింది. అప్పటికి కోలుకున్నా, ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలయింది. సెప్టెంబర్‌ 11, 1921 అర్ధరాత్రి కన్నుమూశారు. ఈరోడ్‌లోని కరుంగాపాళయం గ్రంథాలయంలో అంతకు కొద్దిరోజుల ముందే భారతి ఒక ఉపన్యాసం ఇచ్చారు. అంశం `మనిషికి చావులేదు. ఆయన భావాల కారణంగా, ఆయన పోరాటం, జైలు జీవితం కారణంగా భారతి అంతిమయాత్రకు కేవలం 14 మంది హాజరయ్యారు.

భారతీయులు రకరకాల కారణంగా విడిపోయి ఉండవచ్చు. అయినా వారంతా ఒకే తల్లి బిడ్డలు అని చెప్పిన కవి భారతి. మన సమాజంలో విదేశీయులు జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు. కుల రహిత సమాజం, ఆర్థిక అసమానతలు లేని వ్యవస్థలను ఆయన కోరుకున్నారు. నీటి సౌలభ్యత అధికంగా ఉన్న చోట నుంచి ఆ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాలకు నీళ్లు మళ్లించాలని కూడా ఆయన ఆశించారు. భారత్‌కు ఇరుగు పొరుగున ఉన్న దేశాలతో సహాయ సహకారాలు ఉండాలని ఆయన స్వప్నించారు. కుల రహిత సమాజానికి సంబంధించి ఆయనది విప్లవాత్మక దృష్టి. చక్రవర్తిని పత్రిక కోసం ఆయన ఎంచుకున్న అంశాలు విశాలమైనవి. బౌద్ధంలో మహిళలు, మద్రాస్‌ ప్రెసిడెన్సీలో మహిళల విద్య గురించి గణాంకాలు, తులసిరాజ్‌, బాల్య వివాహాలు, స్త్రీవిద్య వంటి అంశాలు కనిపిస్తాయి.

‘మహిళల స్థానం’ అంటూ భారతి రాసిన ఒక ఆంగ్ల వ్యాసంలోని వాక్యాలు చిరస్మరణీయాలే. నాగరికత మొత్తం పురుషుడిని స్త్రీ సన్మార్గంలో పెట్టడమే అన్నారాయన. ఎక్కడ మహిళలు వృద్ధి చెందుతారో… అక్కడ కళాభివృద్ధి జరుగుతుంది. కళ అంటే ఏమిటి? మానవాళిని దైవత్వంవైపు నడిపించడమే కదా! అని కూడా ఆ వ్యాసంలో వ్యాఖ్యానించారు. మహిళల అణచివేత భారతీయ సంప్రదాయం కానేకాదని ఆయన వాదించారు. సోదరి నివేదితను కలిసినప్పుడు ఆమె ఆయనను స్వాగతించిన తీరు వినూత్నంగా ఉంటుంది. ‘మీ సతీమణి ఎక్కడ?’ అని ఆమె అడిగారట. దేశానికి చేసే నిజమైన సేవ ఏదో ఆమె తనకు బోధించిందని కూడా భారతి రాసుకున్నారు. అందుకే తన జాతీయగీతాల తొలి సంకలనాన్ని సోదరి నివేదితకు ఆయన అంకితం ఇచ్చారు.

చిరకాలం తనకి దూరంగా ఉన్నా తన భర్త తాత్త్వికతను గొప్పగా అర్ధం చేసుకున్న మహిళ చెల్లమ్మాళ్‌, ఆయన భార్య. సంప్రదాయం ప్రకారం ఆమెకు వైధవ్యం పాటించక తప్పలేదు. కానీ భారతి తొలి జీవితచరిత్ర రచయిత్రి ఆమె కావడం విశేషం. అంటే స్త్రీ విషయంలో భారతి ఊహించినది ఆయన మరణానంతరం ఆయన భార్య నిజం చేశారు. భారతి ఆశ్రమం పేరుతో ఆయన రచనలను ఆమె ఐదు సంకలనాలుగా వెలువరించారు. ఆమెకు రాయడం అంత బాగా రాకపోవడంతో ఇద్దరు కూతుళ్లు రాసిపెట్టారు. దాని పేరు ‘భారతీయార్‌ చరితమ్‌’. దీనినే ఆయన మనుమరాలు విజయభారతి 2003లో పునర్‌ ముద్రించారు. భారతి రచనల మీద పరిశోధన చేసి తొలి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినవారు కూడా విజయభారతే. అయితే రెండో కుమార్తె వివాహం కోసం చెల్లమ్మాళ్‌ భారతి రచనల మీద హక్కులను ప్రచురణకర్త కూడా అయిన తన సమీప బంధువుకు ఇవ్వవలసి వచ్చింది. భర్త రచనలు అందరికి అందాలన్న ఆమె కోరిక 1954లో తీరింది. ఆ సంవత్సరం ప్రభుత్వమే వాటిని ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

ఆయన ఉత్తరాలు చాలా పుదుచ్చేరిలో ఆయన పేరుతో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి. ప్రతి ఉత్తరం ‘ఓంశక్తి’ అని మొదలయ్యేది. చివర్న నీవు చిరంజీవిగా ఉండుగాక అని సంతకం చేసేవారు. 1921కి ముందే సుబ్రహ్మణ్య భారతి ఒక కవితలో ఇలా రాశారు`

‘గణతంత్ర భారతం వర్ధిల్లాలి
గణతంత్ర భారతానికి విజయం చేకూరాలి
ఇది ముప్పయ్‌ కోట్ల ప్రజలది’

డిసెంబర్‌ 11 సుబ్రహ్మణ్య భారతి జయంతి…

జాగృతి సౌజ‌న్యంతో….