Home News అణగారిన ప్రజల ఆశా జ్యోతి కర్నె శ్రీశైలం ఇక లేరు

అణగారిన ప్రజల ఆశా జ్యోతి కర్నె శ్రీశైలం ఇక లేరు

0
SHARE
షెడ్యూల్ కులాల జన ఉద్దారకుడు ,షెడ్యూల్ కులాల సంస్కృతి పరి రక్షకుడు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నిజమైన షెడ్యూల్ కులాలకే అందాలని ఆశించి, సతతం కృషి చేసిన కర్నె శ్రీశైలం మన మధ్య లేకపోవడం తీరని బాధను కలిగిస్తున్నది. ఆ లోటు ఎవరూ తీర్చలేనిది.

కొండంత ధైర్యం,మొక్కవోని విశ్వాసం, పట్టుదల, నిష్కలంక దేశభక్తి, సౌమ్య స్వభావం,సిద్ధాంత నిబద్దత,సంఘటన చతురత కలిగి,నిరంతరం సమాజ సేవలో మునిగి,సోదర షెడ్యూల్ కులాల వారు హైందవ సంస్కృతికి దూరం కాకుండా తపించిన కార్యతత్పరుడు, అణగారిన ప్రజల ప్రేమమూర్తి, నిమ్న వర్గాల ఆశా కిరణం కర్నె శ్రీ శైలం మనకు భౌతికంగా దూరమయ్యారు. హైందవ సంస్కృతీ ప్రవాహంలో షెడ్యూల్ కులాల వారు మునకలు వేయాలని, విదేశీ భావ జాలంలో కొట్టుకుని పోవద్దని డా అంబేద్కర్ వలెనే అడుగులు వేసిన షెడ్యూల్ కులాల బాంధవుడు కర్నె శ్రీశైలం. అటు ఉద్యోగం, ఇటు కుటుంబ సంసారంలో తల మునకలై ఉన్నా, తన జీవితమంతా పేద ప్రజల సమస్యలలోనే గడిపిన కరుణాసాగరుడు కర్నె శ్రీశైలం.

చిలకూరు బాలాజీ దేవాలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారి భుజాలపై షెడ్యూల్ కుల భక్తున్ని ఎక్కించి, ముని వాహన సేవను 2,700 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంకురార్పణ చేసి అసమానతలు లేని సమాజ నిర్మాణానికి నడుం కట్టిన సంస్కర్త. షెడ్యూల్ కులాల వారు చెల్లెళ్ళతో అన్ని వర్గాల అన్నయ్యలకు భగినీ హస్త భోజనం పెట్టించి, సామరస్యత నింపిన అందరికీ సోదర సమానుడు కర్నె శ్రీశైలం.

కొద్ది రోజులుగా షుగర్, కిడ్నీ తదితర సంబంధిత రోగాలతో ఇబ్బంది పడుతూ, అలాగే ఇటీవల కాలంలో మహబూబ్ నగర్ లో చిన్న ప్రమాదానికి గురై తలకు దెబ్బ తగిలి మొదట గాంధీ ఆస్పత్రి లో ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రిలో చేరి, గుండె పోటు వచ్చి శ్రీ రామ నవమి ఉత్సవాల వేళలో, ఉత్తరాయణ కాలంలో, వసంత ఋతువు, చైత్ర మాసం ఏప్రిల్ 8 న మధ్యాహ్నం 12.30 నిముషాలకు నిమ్స్ ఆస్పత్రి లో కర్నె శ్రీశైలం శాశ్వతంగా కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుర్లు వున్నారు. కర్నె శ్రీశైలం కి ఉత్తమ గతులు కలిగించి, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిద్దాం.