పంచభూతాలైన పృథ్వి (భూమి), వాయువు (గాలి), జలం (నీరు), అగ్ని (నిప్పు), ఆకాశం (శూన్యం).. వాటి సమన్వయంపైన మన జీవన వ్యవస్థలు ఏ విధంగా ఆధారపడి ఉన్నదీ మన పూర్వీకులు వివరించారు. ప్రకృతిలో భాగమైన ఈ పంచభూతాలే దైవత్వానికి నిదర్శనాలు.
మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న నేలని తల్లిగా కొలవడం మన సంస్కృతి గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజలు కూడా తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు. మన దేశంలో మాత్రమే ఈ మట్టిని మాతృభూమిగా ఆరాధిస్తాం. మన అథర్వవేదంలోని పృథ్వీ సూక్తం- ప్రకృతి, పర్యావరణం గురించి మనకు అసమాన జ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ వేదంలోని అద్భుత శ్లోకం…
యస్యాం సముద్ర ఉత సిన్ధురాపో యస్యామన్నం కృష్టయః సంబభూవుః
యస్యామిదం జిన్వతి ప్రాణదేజత్సా నో భూమిః పూర్వపేయే దధాతు
అంటే- ‘‘భూమాతకు వందనం. సముద్ర, నదీజలాలను ఏకం చేసి తనలో ఇముడ్చుకున్నదీ మాత. తనను దున్నినపుడు తన గర్భంలోని ఆహారాన్ని ఆ మాత అందిస్తుంది. నిజానికి అన్ని ప్రాణులూ నివసిస్తున్నది ఆమెలోనే… ఆ జీవశక్తిని భూమాత సదా మనకు ప్రసాదించుగాక!’’ అని అర్థం.
జన్మించిన భూమిని తల్లిగా ఆరాధించటం ఈనాటి ఆలోచన కాదు. మాతా భూమి పుత్రోహం పృథివ్యా అని కూడా పృథ్వీ సూక్తం ఉద్బోంధించింది. ఈ పుడమి నా తల్లి, నేనామె పుత్రుడను అని దీని అర్థం. మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు ఆదర్శ మానవుడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి రెండు స్వర్గం కంటే గొప్పవి అని అర్థం. జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోస్తుంది. జన్మభూమి మనల్ని జీవితాంతం మోస్తుంది. మన జీవితాలకి ఆధారం అవుతుంది. చనిపోయిన తర్వాత ఖననం అయినా, దహనం అయినా తనలోనే కలుపుకుంటుంది మన మాతృభూమి. అందుకే మన జీవనానికి నెలవైన, మన వికాసానికి కొలువైన మాతృభూమి ఆరాధన ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. పుట్టిన నేలతల్లిని కొలవని వాడు బ్రతికున్నా మరణించినవానితో సమానం అనే మాట అనాదిగా వినిపిస్తున్నది.
Watch below Video :