“పారిశుద్ధ్య కార్మికులు మానవుల మల మూత్రముల కాలువలో దిగవల్సిరావడం హేయం. యాంత్రీకరణ జరగాలి, కాంట్రాక్టర్ల వ్యవస్థ రద్దు చేయాలి, పారిశుద్ధ్య కార్మికులను ప్రజలు గౌరవించాలి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం ప్రజలందరి బాధ్యత” అని “భారత్ లో సీవర్ మరణాలు” అనే అంశంపై భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS), దత్తోపంత్ తెంగ్దే ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో జూలై 2న ఢిల్లీలోని మాలవీయ భవన్ లో పారిశుద్ధ్య కార్మికుల జాతీయ సదస్సు వక్తలు అభిప్రాయపడ్డారు.
విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ ఆలోక్ జీ మాట్లాడుతూ “పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఒకప్పుడు డ్రైలెట్రిన్ లు ఉండేవి. కొందరు కార్మికులు తలపైకి ఎత్తుకొని దూరంగా ఈ మాలిన్యాన్ని పోసేవారు. ఈ అమానవీయ పనినీ ప్రభుత్వం నిషేధించింది. నగరాల్లో మల, మూత్రాలతో కూడిన కాల్వల(శీవర్)లో ప్రవాహం ఆగిపోతే పారిశుద్ధ్య కార్మికులు, శరీరంపై యే అచ్చాదనా లేకుండా లోపలికి దిగి ఆ మాలిన్యాన్ని బయటకు ఎత్తి పోస్తున్న సమయంలో అతని తలపై పడుతున్న సంఘటన ఇప్పటికీ చూస్తున్నాం. డ్రైనేజీల నుంచి వెలువడే విష వాయువుల వల్ల, అనేక ఇతర కారణాల వల్ల అన్ని రాష్ట్రాలలో అనేక మంది మరణిస్తున్నారు. 1993 నుండి 28 ఫిబ్రవరి 2022 వరకు 989 మంది మరణించారు. 2021-22 లోనే 78 మంది మరణించారు. 2022 జనవరి నుండి నేటి వరకు 42 మంది మరణించారు. ఇవి అధికార లెక్కలు మాత్రమే, వెలుగు చూడని మరణాలు ఎన్నో ఉండి ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీ పట్టణంలో కూడా ఇలాంటి మరణాలు జరగడం విచారం. ఇలా మరణించిన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని 2014 లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు లో కొన్ని లోపాలున్నాయి. ఈ పరిహారం ఎవరు చెల్లించాలనే విషయంపై స్పష్టత లేదు. ఢిల్లీలో ఒక ఘటనలో ఇద్దరు మరణించారు. 3వ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న ఈ పరిహారం అతనికి ఇవ్వలేదు. (కారణంగా ఇతను మరణించ లేదు). మార్చి 2022 లో మహారాష్ట్రలో పుణె, కొల్హాపూర్ లో దుర్ఘటనలు జరిగాయి. ఈ 10 లక్షలు బ్యాంక్ లో వేస్తే నెలకు రూ.6,500 చొప్పున బాధిత కుటుంబానికి వస్తాయి. ఈ ఆదాయంతో భర్తను కోల్పోయిన ఆమె పిల్లలతో జీవించడం కష్టంగా ఉంటుంది, ఈ పరిహార రొక్కాన్ని పెంచాలి. ఎటువంటి నియమనిబంధనలు పాటించకుండా పారిశుధ్య కార్మికున్ని బలవంతంగా మద్యం తాగింపజేసి సీవర్లోకి కాంట్రాక్టర్ దింపితే, ఆ పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తే ఆ కాంట్రాక్టరు పై హత్యారోపణ కేసును నమోదు చేయాలి. ఈ కాంట్రాక్టర్ ను నియమించిన ఆ మున్సిపాలిటి రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ఈ మరణాలకు ముగింపు పలకాలి. అవసరమైన యాంత్రీకరణను చేపట్టాలి, తప్పని సరిగా దిగాల్సి వస్తే అన్ని రక్షణలు, దుస్తులతో దింపాలి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాలకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలందరికీ సంవేదన శీలతను కల్పించాలి” అని అన్నారు.
సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జీ మాట్లాడుతూ మన వీధిని రోజూ శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికునికి దాహం వేస్తే ఒక గ్లాస్ నీరు ఇవ్వడానికి మన ముందుకు రావడంలేదని, వారిని తోటి మానవులుగా గౌరవించాలని అన్నారు. సామాజిక సమరసత వేదిక దేశ వ్యాప్తంగా 125 జిల్లాల్లో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, వారి సమస్యలను ప్రజలకు అర్థమయ్యే విధంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని వారు వెల్లడించారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులపై సామాజిక సమరసత వేదిక ఒక సర్వే నిర్వహించిందని వారు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు విద్యాభ్యాసం, వారి కుటుంభ సభ్యల ఆరోగ్య పరిరక్షణ దిశగా సామాజిక సమరసత వేదిక ఒక యోజన చేస్తుందని చెప్పారు. అదే సమయంలో ప్రజలందరి మధ్య బంధు భావన నిర్మాణానికి సామాజిక సమరసత పని చేస్తుందని జాతీయ కన్వీనర్ తెలిపారు.
ఈ సదస్సులో సదస్సు లక్ష్యాలను బి. ఎం.ఎస్ జాతీయ సంఘటనా కార్యదర్శి సురేంద్రన్ వివరించారు. BMS జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ డిక్కీ అధ్యక్షత వహించిన సదస్సులో సఫాయి కర్మచారి కమిషన్ మాజీ జాతీయ చైర్మన్ వేంకటేశన్, BMS జాతీయ నాయకులు, 11 రాష్ట్రాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికుల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవర్ మరణాలు లేకుండా చేయడం కోసం ఢిల్లీ జల్ బోర్డ్ రూపొందించిన వీడియో, రోబో ల ద్వారా సీవర్ లోని మలినాల తొలగింపు విధానాన్ని వివరించే వీడియోలను ప్రదర్శించారు.