Home News జాతి పునర్ నిర్మాణం లో ABVP పాత్ర

జాతి పునర్ నిర్మాణం లో ABVP పాత్ర

0
SHARE

-శ్రీశైలం వీరమల్ల

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు భారతదేశంలో క్రియాశీలమైన విద్యార్ధి సంఘం. స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్, సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ వంటి మహనీయులు ఏబీవీపీ సంఘటనాత్మకమైన కార్యపద్ధతికి పునాది వేశారు.

భారత దేశంలో అనైక్యతల కారణంగా కోల్పోయిన స్వాతంత్ర్యం సాధించుకోవడంలో కొన్ని వేలమంది అమరులైనారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో మనం స్వతంత్ర సమరయోధులను మనం తలుచుకుంటున్నాము. భారత దేశంలో ఇటువంటి సంఘటనలు పునఃరావృత్తం కాకుండా, భారతమాత పునర్వైభవం కోసం విద్యార్థి, యువతను సంఘటిత పరిచి వారిలో దేశభక్తి, దేశం పట్ల నిష్ఠను ప్రాదుకొల్పడం కోసం జ్ఞానం, శీలం, ఏకతలే ధ్యేయంగా విద్యార్థి పరిషత్ ప్రభావశీలంగా దేశంలో పనిచేస్తుంది. ఏబీవీపీ 1948 లోనే ఢిల్లీ యూనివర్సిటీలో అతికొద్ది మందితో తన ప్రస్థానాన్ని కొనసాగించినా, 1949 జూలై 9 న అధికారికంగా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఏబీవీపీ రాబోయే సంవత్సరంలో అమృతోత్సవాలు (75 సంవత్సరాలు ) జరుపుకోబోతున్న సందర్భంగా ఈ సంవత్సరం నుండే యేడాది పొడుగునా వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టబోతుంది. ఆగస్ట్ 15 రోజున ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఎగురవేసి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అజ్ఞాత స్వాతంత్ర్య సమరయోధుల (Unsung Heroes) గురించి యువతకు తెలియచేసి వారిలో దేశభక్తి స్ఫూర్తి రగిలించడం కోసం ఏబీవీపీ కృషి చేయాలని సంకల్పించింది. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునఃనిర్మాణమే ధ్యేయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు అన్ని రంగాల విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా విద్యార్థి పరిషత్ పనిచేయడంలో ముందుంది.

తెలంగాణ ప్రాంతంలో వామపక్ష తీవ్రవాదం కారణంగా అప్పుడప్పుడే విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, స్కూళ్ళలో చదువుకోవడానికి వస్తున్న మొదటి తరం ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులను, పుస్తకాలు పెన్నులతో వారి జీవితాన్ని తీర్చి దిద్దుకునే సమయంలో వామపక్ష తీవ్రవాదులు వర్గ సంఘర్షణ సిద్ధాంతం, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అంటూ తప్పుడు సిద్ధాంతాలను విద్యార్థుల పసి మెదల్లలో నూరి పోసి తుపాకులు చేత బట్టి, అడవుల బాట పట్టించి, అమరులైనారు అంటూ కీర్తిస్తూ అటు కుటుంబం, ఇటు సమాజం అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా అర్ధాంతరంగా బతుకును ముగించేటట్లు చేసిన వామపక్ష సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సామాజిక సమరసత, దేశభక్తి, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు అని ఈ దేశం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి ప్రజల మధ్యనే బ్రతుకుతూ, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ ఒక శక్తివంతమైన విద్యార్థి శక్తిని జాతీయ వాదం వైపు నడిపించిన చరిత్ర ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)ది. వామపక్ష తీవ్రవాదం వల్ల అశాంతి, అలజడి, ఆందోళనకరమైన పరిస్థితులలో యూనివర్సిటీలలో, కాలేజీలలో ఏబీవీపీ జాతీయ భావాన్ని పెంపొందించడంలో 40 మంది కార్యకర్తలను కోల్పోయింది. ఇటువంటి కఠిన సమయంలో మొక్కవోని దైర్యంతో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రాంతంలో శాంతియుత వాతావరణం, యూనివర్సిటీలలో విద్యా వాతావరణాన్ని పెంపొందించడంలో అవిరళ కృషి చేశారు. ఆ సందర్భంలో 1981 జనవరి 26 రోజున నాటి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఎగరేసిన కొద్ది సేపటికి, రాడికల్ మూకలు జాతీయ జెండా దించి, నల్ల జెండాను ఎగరవేయడం జరిగింది. నక్సల్స్ బెదిరింపులను లెక్క చేయక సామ జగన్మోహన్ రెడ్డి తిరిగి జాతీయ పతాకాన్ని ఎగుర వేశాడు. ఇదే కేసులో సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి బయలుదేరిన సామ జగన్మోహన్ రెడ్డిని నడిరోడ్డుపై అతి కిరాతకంగా నక్సల్స్ హత్య చేశారు. నల్గొండ నాగార్జున కళాశాలకు చెందిన ఏచూరి శ్రీనివాస్ ను 1981 ఏప్రిల్లో నక్సల్స్ హతమార్చారు. 1997లో మేరెడ్డి చంద్రారెడ్డి ని ఉస్మానియా యూనివర్సిటీలో నక్సలైట్ల తూటాలకు ఆత్మార్పణం అయ్యారు. ఈ విధంగా జాతీయ వాదంతో దేశం పట్ల ప్రేమ, విశ్వవిద్యాలయాల విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను గన్నులతో బెదిరించినా, 40 మందికి పైగా కార్యకర్తలను పొట్టనబెట్టుకున్న ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నక్సలైట్లను ఎదురించి ఈరోజు ఏబీవీపీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా వెలుగొందుతుంది. ఈరోజు హైదరాబాద్ ఆర్థిక, టెక్నాలజీ హబ్ గా అభివృద్ధివైపు అడుగులు వేస్తూ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలతో కళకళలాడుతుంది అంటే ఏబీవీపీ చేసిన త్యాగాల కారణంగానే అని చెప్పక తప్పదు. రాజకీయ నాయకుల హత్యలు చూసి రాజకీయాలు చేయాలంటే భయపడే పరిస్థితి ఆరోజు… కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏబీవీపీ చేసిన కృషి అమోఘం.

ఏబీవీపీ మెంబర్షిప్, దేశవ్యాప్తంగా వివిధ నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోనే No.1 స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొందింది. కాలానుగుణంగా వచ్చే వివిధ రకాల మార్పులను స్వీకరిస్తూ Most Advanced, Update ఆర్గనైజేషన్ గా విద్యార్థుల చేత వేనోళ్ళ కొనియాడబడుతూ ఉంది. విద్యార్థులలో నూతనత్వం, సృజనాత్మకతను పెంపొందుచుట కొరకు, విద్యార్థి సర్వాంగీన ఉన్నతి, విశ్వగురువుగా భారత దేశాన్ని మన కనులారా వీక్షించేందుకు, వివేకానంద కలలు కన్న భారతాన్ని పునఃనిర్మించేందుకు విద్యార్థుల వివిధ రకాల అభిరుచులకు అనుగుణంగా విద్యార్థి పరిషత్ వివిధ ఫోరమ్స్ (ఆయామాల) ద్వారా జాతీయ పునఃనిర్మాణంలో ప్రతి ఒక్క విద్యార్థిని ఏబీవీపీ భాగస్వాములను చేస్తూ ఉంది.

ఏబీవీపీ- స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ (SFD) ఫోరం ద్వారా విద్యార్థులకు ప్రకృతి పై ప్రేమను పెంచి, జల్, జంగల్, జన్వర్, జన్, జమీన్ ల పరిరక్షణ కొరకై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ‘వృక్ష మిత్ర’ అభియాన్ ద్వారా నిర్వహిస్తుంది. రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికులు, గల్ఫ్ కార్మికులు, సంచార జాతులపై సర్వే, ఫ్లోరోసిస్ బాధితుల కోసం సర్వే నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుళ్తుంది.

థింక్ ఇండియా (Think India) ఫోరం ద్వారా వివిధ నేషనల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ లలో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, నిపుణులలో నేషన్ ఫస్ట్ ఫిలాసఫీని పెంపొందింప చేయడం. వారి ప్రతిభాపాఠవాలను ఈ దేశ జాతీయ సమస్యలపై దృష్టి పెట్టే విధంగా ప్రోత్సహించి, పరిష్కార మార్గాలను అందించే భావిభారత మార్గనిర్దేశకుల వేదిక థింక్ ఇండియా.

వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ & యూత్ (WOSY) ద్వారా ప్రపంచం అంతా ఒక కుటుంబం- వసుధైవకుటుంబకం, సర్వేజనా సుఖినోభవంతు అన్న భావనను పెంపొందింప చేసి, భారత దేశ విశాల తాత్వికతను ప్రపంచానికి తెలియచేయడం కోసం నిరంతరం పనిచేస్తూ, ప్రస్తుతం WOSY యొక్క కార్యక్రమాలు 40 దేశాల విద్యార్థులతో కొనసాగుతూ ఉన్నాయి. ప్రపంచ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై దేశాల మధ్య సత్సంబంధాల ద్వారా ఏకాభిప్రాయం, సహకారం మరియు సౌహార్దాలను పెంపొందించడానికి WOSY కృషి చేస్తుంది.

MeDeVision మెడికల్ & డెంటల్ విద్యార్థుల ఫోరమ్. మెడివిజన్ జాతీయ స్థాయిలో వారి ఆలోచనలు పంచుకోవడానికి ఒక వేదిక. ఈ వేదిక ద్వారా వైద్య విద్యను మెరుగుపరచడానికి మరియు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ పెంపొందించడం కోసం పనిచేస్తుంది. మెడివిజన్ దేశం పట్ల తమ బాధ్యత గుర్తు చేస్తూ భారతీయ విలువలను వైద్యరంగంలో పెంపొందింప చేయటంలో కృషి చేస్తూ ఉంది.

రాష్ట్రీయ కళామంచ్ ఫోరమ్ ద్వారా దేశంలో ఉన్న వివిధతలను మన వారసత్వ కళల ద్వారా ఏకతాటిపైకి తీసుకుని వచ్చి భారత సమైక్య శంఖారావాన్ని పూరించడం, భారతీయులందరిలో ఒకే ఆత్మభావనను పెంపొందింప చేస్తుంది. రాష్ట్రీయ కళామంచ్ ఫోరం ఆధ్వర్యంలో సింగిడి పేరుతో వరంగల్, కరీంనగర్ లో యువకళాకారులను ఉర్రూతలూగించింది. ఈ సింగిడి మాధ్యమం ద్వారా ప్రముఖ గాయకులు, సినీ గ్లామర్ కూడా తోడవడంతో సింగిడికి విశిష్ట ఆదరణ లభించింది.

ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం టెక్నికల్ సెల్ ఫోరం. టెక్నికల్ సెల్ నిర్వహించే సృజన ద్వారా వర్కింగ్ మోడల్ ఎగ్జిబిషన్, పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, షార్ట్ ఫిల్మ్ అనేక సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఏ ఇంజినీరింగ్ కాలేజ్ చేయని సందర్భంలోనే ఏబీవీపీ 20 సంవత్సరాలుగా సృజన టెక్ ఫెస్ట్ నిర్వహిస్తుంది. ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాన్ని ప్రభోదన్ నిర్వహిస్తుంది. ఈవిధంగా అగ్రికల్చర్ విద్యార్థుల కోసం అగ్రివిజన్, ఆయుర్వేద, యునాని, సిద్ధ విద్యార్థుల కోసం జిజ్ఞాస, ఆవిష్కార్ ఇలా మొత్తం 15 ఫోరమ్స్ ద్వారా ఏబీవీపీ పనిచేస్తుంది.

1969 తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ క్రీయాశీలక పాత్ర పోషించింది. 1997 నెల్లూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా విభజించాలని తీర్మానం చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ సాహసం చేయనటువంటి సందర్భంలో ఏబీవీపీ లాంటి అఖిల భారత విద్యార్థి సంస్థ తీర్మానం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే కృష్ణ, గోదావరి జలాలు బీడు భూములకు అందించి లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకురావాలని బాసర నుండి శ్రీశైలం వరకు సస్యశ్యామల రథయాత్రను ఏబీవీపీ నిర్వహించింది. ఈ యాత్ర తెలంగాణ పల్లెల్లో సైతం తెలంగాణ ఆవశ్యకతను గుర్తించేట్లు చేసింది. తద్వారా అన్ని రాజకీయ పార్టీల ఎజెండాలో చేర్చక తప్పలేదు. తెలంగాణ సాధనకై డిసెంబర్ 8, 2009 లో ఏబీవీపీ ఛలో అసెంబ్లీ కార్యక్రమంతో తెలంగాణ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది, అదేరోజు అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి చిదంబరం 9 డిసెంబర్,2009 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుంది అని ప్రకటించారు. రాజకీయ నాయకుల కుట్రలతో వెనక్కు తగ్గిన UPA ప్రభుత్వం పై అనేక రూపాలలో ఏబీవీపీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ఏబీవీపీ తెలంగాణ నిర్మాణాత్మక ఉద్యమంలో భాగంగా నారక్తం- నా తెలంగాణ పేరుతో ఒకేరోజు 20వేల మంది విద్యార్థులు, యువకులచే రక్తదానం చేసి రికార్డ్ సృష్టించింది. ఒకేరోజు లక్ష మొక్కలు నాటడం జరిగింది. 2010 జనవరి 23వ తేదీన నిజాం కళాశాల గ్రౌండ్ లో వేలాది మంది విద్యార్థులచే భారీ రణభేరి నిర్వహించడం జరిగింది. ఈ రణభేరి బహిరంగ సభలో నాటి లోకసభా ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సుష్మాస్వరాజ్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరాదు, బ్రతికుండి రాబోయే తెలంగాణ ను మన కనులారా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ నాలుగు స్థలాల నుండి పాదయాత్ర నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీ లో మరో రణభేరీ బహిరంగ సభతో పాదయాత్ర ముగించటం జరిగింది. ఇలా అనేక రకాల ఉద్యమాలను పట్టణం నుండి పల్లెల వరకు, యూనివర్సిటీల నుండి ప్రతి కళాశాల వరకు ఉద్యమాలు నిర్మించి నాటి UPA ప్రభుత్వం పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం, తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన నూతన తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసుకోవడం జరిగింది.

భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో “వందేమాతరం” మన జాతీయ గేయంగా పొందుపర్చటంలో పరిషత్ చేసిన భావ జాగరణ, నిర్మాణాత్మక ఆందోళన చెప్పదగినది. రాజ్యాంగంలో “India that is Bharath” అని నిలిపేందుకు పరిషత్ రాజ్యాంగ సభలోని పెద్దలు, మేధావులు, విద్యావేత్తలని చైతన్యవంతుల్ని చేసి జాతీయతకి ఊపిరిలూదింది. మన ప్రాంతీయ భాషల్ని పరిరక్షిస్తూనే దేశవ్యాప్తంగా సాంస్కృతిక ఏకత్వానికి జాతీయ భాష హిందీ ఆవశ్యకతను తెలియజేసి, హిందీని జాతీయభాషగా ఏర్పాటు చేయటంలో విద్యార్థి పరిషత్ కృషి చేసింది. 1975 లో ఎమర్జెన్సీ వ్యతిరేఖ ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ABVP క్రియాశీలక పాత్ర పోషించి నాన్ కాంగ్రెస్ మూవ్మెంట్ ని నిర్మించి, దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసి ABVP అనేకమంది విద్యార్థులను, యువకులను ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములను చేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడింది. శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో పాకిస్తాన్ ప్రేరిత ముష్కరులు త్రివర్ణ పతాకానికి నిప్పు పెట్టారు. ఎక్కడైతే త్రివర్ణ పతాకానికి అవమానం జరిగిందో అక్కడే త్రివర్ణ పతాకానికి సన్మానం చేద్దాం అని ప్రతినపూని 11 డిసెంబర్ 1990 కాశ్మీర్ కు బయలు దేరిన పదివేల ప్రదర్శనకారులను ఉదంపూర్ వద్ద సైన్యం నిలిపివేయడంతో ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం ముందు ప్రజలందరూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన ముఖ్యంగా నిర్వాసితులైన కాశ్మీరీ ప్రజలలో మరియు జమ్ము ప్రాంత ప్రజలలో మనోధైర్యాన్ని పెంపొందింప చేసింది. పోరాటం కోసం దేశ ప్రజలంతా తమ వెంట ఉన్నారని విశ్వాసం వారిలో కలుగజేసింది. ఆ తర్వాత కాశ్మీర్ సమస్య పై జమ్ము ప్రాంతమంతా విస్తృతమైన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీంతో జమ్ము ప్రాంతం నుండి నిర్వాసితుల వలసలు ఆగాయి. ప్రజల మనోభావాలను చూసిన రాజకీయ పార్టీలు ఆ తర్వాత ఈ సమస్య పై దృఢమైన పాత్రను పోషించాయి. కాశ్మీర్ ప్రజలలో ఏకాత్మతా భావన కారణంగానే పార్లమెంట్ లో జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు చేయబడింది.

ఛలో అస్సాం కార్యక్రమం ద్వారా “సేవ్ అస్సాం- సేవ్ ఇండియా” పేరుతో లాయర్స్ గ్రౌండ్ లో సత్యాగ్రహం చేసింది. 1983 నుండి ఏబీవీపీ నిరంతరం బంగ్లాదేశ్ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా జనజాగరణ మరియు ఆందోళన నిర్వహిస్తూనే ఉంది. 2007 లో విద్యార్థి పరిషత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఒక సర్వే చేయించింది. అంతేకాక సరిహద్దు ప్రాంతమైన చికెన్ నెక్ క్షేత్రం( కిషన్ గంజ్, బీహార్ ) లో 40 వేల పైచిలుకు విద్యార్థులతో 17 డిసెంబర్ 2008 న ఒక ప్రదర్శన జరిపింది. ఏబీవీపీ యువత, ప్రజలలో తీసుకువచ్చిన చైతన్యం, ఉద్యమాల వలన పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేయడం జరుగుతుంది. రాజ్యాంగ విలువల్ని, దేశసార్వభౌమత్వాన్ని నిలబెట్టేందుకు విద్యార్ధి పరిషత్ చేసిన ఉద్యమం భారత జాతీయ పునర్మిర్మాణ ఉద్యమంలో చిరస్థాయిలో నిలిచి ఉంటుంది.

ఏబీవీపీ ఛలో ఢిల్లీ నవంబర్ 26, 2002 రోజున దేశ నలుమూలల నుండి లక్ష మందికి పైగా విద్యార్థులతో ఢిల్లీలో ర్యాలీ నిర్వహించి ఈదేశ స్వాభిమాన, స్వదేశీ విద్య అందించాలని, విద్యా భారతీయకరణ చేయాలని ప్రధాన మంత్రికి మెమోరండం సమర్పించడం జరిగింది. జాతీయ విద్యా విధానం కోసం ఏబీవీపీ సెమినార్ లు, సమావేశాలు అనేకం నిర్వహించి, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, స్కాలర్స్, విద్యార్థుల నుండి పెద్ద మొత్తంలో విద్యా విధానంలో మార్పులపై తగు సూచనలు తీసుకుని వాటిని నూతన జాతీయ విద్యావిధానం కమిటీకి సమర్పించడం జరిగింది. దాని ఫలితంగానే ఈరోజు “నూతన జాతీయ విధానం” (NEP) అమలుచేయబడుతుంది.

1989 నాటికి ఉన్న 21 సంవత్సరాల ఓటు హక్కు వయస్సు ను 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించడంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషించింది. పాక్, చైనాతో నిత్యం ప్రమాదం పొంచి ఉంది అని, అణ్వస్త్రాలు తయారు చేయాలని ఏబీవీపీ నినదించింది. వాజపేయి ప్రభుత్వం చొరవతో 1998 మే లో అణ్వస్త్రాలను సాధించుకోవడం జరిగింది.

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నిరుపేద SC, ST, BC విద్యారులు నివాసం ఉండే సంక్షేమ హాస్టళ్ల దుస్థితి పై ఏబీవీపీ సర్వే నిర్వహించి 1992 లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్లు అని బ్లాక్ పేపర్ విడుదల చేయడం జరిగింది. వేదిక పై ఉన్న జస్టిస్ పున్నయ్య ఈ రోజు మీరు హాస్టల్ నిద్ర చేశారు, పదేళ్ల తర్వాత మంత్రులు, అధికారులు ఆ పని చేస్తారు. అప్పుడు ఈ హాస్టళ్లు మారుతాయి, ఈ పిల్లలకు మేలు జరుగుతుంది అన్నారు. నిజంగానే వారు చెప్పినట్టుగా జరిగింది.

టీచర్ల నియామకం, ప్రభుత్వ స్కూళ్లు, స్కాలర్షిప్స్, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, 1996 ఆగస్టు 6 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఛలో హైదరాబాద్ పిలుపునివ్వడంతో వేలాది మంది విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థి ఉద్యమం పై వాటర్ కెనాల్స్, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు, కర్కశంగా లాఠీఛార్జ్ చేసి గుర్రాలతో తొక్కించడం జరిగింది. వందలాది మంది విద్యార్థులు జైలు పాలయ్యారు. ఏబీవీపీ ఉద్యమంతో దిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా నెలకొన్న భయాందోళనల నుండి ప్రజలను జాగృతం చేసి వారికి సహాయ సహకారాలను అందించి దేశ ప్రజలకు విద్యార్థి పరిషత్ అండగా నిలిచింది. వ్యాక్సినేషన్ పై అపోహలను తొలగించి వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా ప్రజలను చైతన్య పరిచి, వ్యాక్సినేషన్ కు ముందు బ్లడ్ డొనేషన్ చేయాలని ఏబీవీపీ పిలుపునిచ్చి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది. కరోనాతో చనిపోయినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం, పేద కుటుంబాలకు ఆహారం, నిత్యావసర సరుకులు అందించడం చేసింది. తరగతిగది విద్యాభ్యాసానికి దూరమైన విద్యార్థులకు పరిషత్ పాఠశాలలను బస్తీలు నగరాలు పట్టణాలలో దేశ వ్యాప్తంగా నిర్వహించింది.

బ్లడ్ డొనేషన్ క్యాంపులు, చెట్లు నాటడం, స్టడీ సర్కిల్, ఉచిత కోచింగ్ సెంటర్స్ లాంటివి ఏర్పాటు చేయడం, BC,SC,ST విద్యార్థుల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజుల పెంపు ఇలా అనేక విద్యారంగ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఏబీవీపీ ఉద్యమాలు నిర్మిస్తూ వాటిని పరిష్కరిస్తూ విద్యార్థులకు అండగా ఉంటుంది. ఆదర్శ పురుషులు, దేశ నాయకులను స్మరిస్తూ వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా, డా.బీ.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని సామాజిక సమరసత దినంగా ప్రతి సంవత్సరం వేలాది కళాశాల లో పరిషత్ నిర్వహిస్తుంది.

నేటి విద్యార్థి రేపటి పౌరుడు అనేది గతం, నేటి విద్యార్థి నేటి పౌరుడే అనే స్పృహతో ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలపై అవగాహనతో స్పందిస్తూ, పరిష్కారాలను చూపే విధంగా విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే విద్యార్థి పరిషత్ ధ్యేయం. విద్యార్థి, టెక్నాలజీ, వైద్య, సామాజిక, కళా మొదలైన రంగాల్లో సమాజంతో మమేకం చేస్తూ ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా, ఏకాత్మ భావనను పెంపొందించే విధంగా ఏబీవీపీ కృషి చేస్తుంది.

This article was first published in 2020