అంతర్జాతీయ స్థాయి వాణిజ్యానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన చెల్లింపులను భారతీయ కరెన్సీ రూపాయల్లో జరిపేలా తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను RBI ఆదేశించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేసింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రోత్సాహం, రూపాయల్లో చెల్లింపుల పట్ల అంతర్జాతీయ వ్యాపారవేత్తలు మొగ్గు చూపిస్తున్నందున బ్యాంకులు తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని RBI కోరింది.
గ్లోబల్ ట్రేడ్‌లో ఇన్‌వాయిస్ చెల్లింపులు, ఎగుమతులు, దిగుమతుల సెటిల్‌మెంట్స్‌ను రూపాయల్లో చెల్లించేందుకు రిజర్వ్ బ్యాంక్‌లోని ఫారిన్ ఎక్స్ఛెంజ్ డిపార్ట్‌మెంట్ నుంచి బ్యాంక్‌లు అవసరమైన అనుమతులు తీసుకోవాలని కోరింది. కొత్త విధానంలో అంతర్జాతీయ వాణిజ్యంలో మారకపు రేటును ఇక నుంచి రూపాయల్లో చెల్లిస్తారు.
భారత్‌లోని బ్యాంకులు ఏ దేశంతోనైనా వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్ కోసం రూపాయి వోస్ట్రో ఖాతాలను తెరవడానికి అనుమతించినట్టు RBI తెలిపింది. ఏదైనా ఒక బ్యాంక్‌కు ఇతర బ్యాంకుల్లో ఖాతా ఉండటాన్నే వోస్ట్రో ఖాతా అంటారు. ఈ విధానం ద్వారా భారత్‌కు దిగుమతులు జరిపేవారు చెల్లింపులను రూపాయిల్లో చేస్తారని RBI సదరు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే కొత్త విధానానికి లోబడి సాగించే దిగుమతులు, ఎగుమతులు సాధారణ డాక్యుమెంటేషన్‌కు లోబడి ఉంటాయని తెలిపింది. వోస్ట్రో ఖాతాల్లోని నగదును పెట్టుబడుల చెల్లింపు, ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించుకోవచ్చునని RBI జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది.
ఈ ప్రత్యేక ఖాతాల్లోని అదనపు నిల్వను బ్యాంకులు పరస్పర అవగాహనతో పరిమితికి లోబడి మూలధనం, కరెంట్ ఖాతా లావాదేవీలకూ వినియోగించుకోవచ్చు. ఈ ఖాతాల్లోని నిల్వను ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఎగుమతి లేదా దిగుమతి ముందస్తు చెల్లింపులు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకూ వినియోగించుకోవచ్చు. నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని RBI తెలిపింది.
రష్యా లాంటి దేశాలు అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో RBI తాజా నిర్ణయంతో రష్యా, తదితర దేశాలతో రూపాయి కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా ఇనుమడింపజేసుకోవడానికి భారత్‌కు మార్గం సుగమవుతుందని అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషకుల అభిప్రాయం. భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు తగ్గిపోకుండా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వారి భావన.