బాలకృష్ణుని లీలలను గుర్తుకు తెచ్చేలా, వర్ష రుతువుకు స్వాగతం పలుకుతూ, ఆషాడ మాసపు 11వ రోజున గోవాలో హిందువులు, ఆనందోత్సాహాలతో ఆచరించే వినూత్నమైన ఉత్సవం.. ‘బురదోత్సవం’. అక్కడివారు ఈ వేడుకను.. ‘చికల్ కొలా’ అని అంటారు. గోవాలోని మర్సెలా గ్రామంలో, దేవకీ కృష్ణ దేవస్థానం సమీపంలో ప్రతి యేటా జరిగే ఈ ‘బురదోత్సవం’లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఆబాలగోపాలమూ ఆ బాలగోపాలుని ఆటలను బురదలో ఆడుతారు.
దేహాలకు నూనెను పట్టించిన తర్వాత దేవస్థానంలో మూల విరాట్టును దర్శించుకుంటారు. దేవస్థానంలో జ్యోతి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. ఆ తర్వాత మెడలో పుష్పమాలతో అందరూ బురదలోకి దిగుతారు. ఈ బురదోత్సవంలో 60 ఏళ్ళ వయోవృద్ధుడు కాస్త ఎనిమిదేళ్ళ పిల్లాడిగా మారిపోతారు. ఆటపాటల్లో మునిగితేలుతారు. చివరగా రావి చెట్టు చిటారు కొమ్మకు కట్టిన దహి-హండీని ఛేదించడంతో ‘బురదోత్సవం’ ముగుస్తుంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను అణవణువునా ఆచరించే ఈ ఉత్సవం సర్వోన్నతమైన భారతీయ సనాతన ఆచార వైభవానికి నిదర్శనం. విదేశీయులు టమోటాల గుజ్జులో, ద్రాక్ష పండ్ల గుజ్జులో ఆటలాడే ఉత్సవాలు కేవలం ఆనందోత్సహాలకు మాత్రమే పరిమితమైనవి కాగా. గోవాలో ప్రతి ఏటా జరిగే ‘చికల్ కోలా’ ఉత్సవం ప్రజల్లో భక్తి భావనలు వెల్లివిరియడానికి, సమరసతను పాదుగొల్పడానికి, వారిలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది.