-అరవిందన్ నీలకందన్
2022 సంవత్సరం జులై 25న భారతదేశపు 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము అవతరించారు. భారత్ పార్లమెంట్‌కు అధినేత్రిగా, భారత్ సాయుధ బలగాలకు సుప్రీం కమాండర్‌గా నిలిచిన తొలి వనవాసీ మహిళగా ఆమె వినుతికెక్కారు. భారత్‌ను బీజేపీ పాలిస్తున్న కాలంలో అలా జరగడం కాకతాళీయం కాదు.
భారత్‌లో హిందుత్వ ఉద్యమం నిరంతరం సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య అనుసంధానం, సద్భావన, సమరసతలకు వెన్నంటి నిలుస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మూస ధోరణులను అది క్రమంతప్పకుండా సవాల్ చేస్తూనే ఉంటుంది.
ఉదాహరణకు, 1978-79 లో చోటు చేసుకున్న జనతా ప్రయోగంలో ప్రధానమంత్రి పదవికి సరైన వ్యక్తిగా బాబూ జగ్జీవన్ రామ్‌ను(1908-1986) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) ఎంపిక చేసింది. ఆయనే కనుక ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన పక్షంలో అది ఈ దేశపు సామాజిక, రాజకీయ గమనాన్ని ఒక ఆరోగ్యకరమైన, సానుకూల మార్గంలో తిరగరాసి ఉండేది.
అయితే రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ము రూపేణా ఒక వనవాసీ అభ్యర్థినిని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) బరిలోకి దింపడమనేది ఇదే తొలిసారి కాదు. గతంలో NDA విపక్షంలో ఉన్నప్పుడు క్రైస్తవులైన పూర్ణో అగితోక్ సంగ్మా (1947-2016) ను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలబెట్టారు. ద్రౌపది ముర్ము ఎంపిక నిస్సందేహంగా హిందుత్వ ఉద్యమానికి అనుసంధానమైనది.
ద్రౌపది ముర్ము ఒక నాగరికతా విముక్తి ప్రక్రియకు మూర్తీభవించినవారు. మానవ నాగరికత ఆవిర్భవించిన నాటి నుంచి పోడు వ్యవసాయం వరకు, ఆ తర్వాత పట్టణ కేంద్రాలకు చేరుకునే క్రమంలో అలాంటి ఒక పట్టణీకరణకు దూరమైపోయిన సామాజిక తెగలు అడవుల్లో నివసించే సామాజిక తెగలుగా మిగిలిపోయాయి.
అనేక నాగరికతా తెగల మధ్య అలా అడవుల్లో నివసించే తెగలు ఆదిమ, అనాగరికమైనవిగా పరిగణనకు గురయ్యాయి. అలాంటి తెగలు అంతరించిపోవడం లేదా ఆధిపత్య వర్గాల్లోకి కలిసిపోయాయి.
వలస రాజ్యాల కాలంలో, అది ఆసియాలో కావొచ్చు, ఆస్ట్రేలియా లేదా అమెరికాలో కావొచ్చు, అటువంటి అడవి, పర్వత ప్రాంతం లేదా గడ్డి భూములపై ఆధారపడి, వాటినే తమ జీవనాధారంగా చేసుకున్న తెగలను విస్తారమైన సహజ వనరుల కోసం లక్ష్యంగా చేసుకున్నారు. వాటిని నాశనం చేశారు. వనవాసీలుగా వినుతికెక్కిన ఈ తెగలు ఇప్పుడిప్పుడే గుర్తింపునకు నోచుకుంటున్నాయి.
భారత్‌లో, చాలా కాలం క్రితమే అలాంటి వనవాసీ తెగలు సహజసిద్ధంగా జ్ఞానాన్ని సంతరించుకున్న గౌరవనీయమైన వనరులుగా గుర్తింపు పొందాయి. వనవాసీ తెగలకు చెందినవారు ఎంతో పవిత్రమైవారుగా గుర్తింపును పొందారు. అలాగని వారిలో విభేదాలు, వైషమ్యాలు లేవనికాదు. ఆయా తెగల్లో విభేదాలు, వైషమ్యాలు ఉన్నాయి. అయితే వనవాసీలుగా పిలుచుకునే అటవీ తెగలతో ప్రాకృతిక బంధాలను ధర్మం ఉద్ఘాటించింది.
కానీ, వలసవాదం, మతప్రచారం ఆయా తెగలపై సరికొత్త కథనాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. వారిని షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరించాయి. అంటే వారు ‘ఆదివాసీలు’ మరీ స్పష్టంగా చెప్పాలంటే వారిపై ఆదిమవాసులు అనే ముద్ర వేశాయి. వలస పాలన కాలంలో వారిని ఆదిమ ప్రజలుగా చిత్రీకరించారు.
వనవాసీలు సైతం నాగరికతను ఆపాదించుకోవాలి. అయితే, వలసవాద సామాజిక శాస్త్రం ప్రకారం వనవాసీలు హిందువులైన పక్షంలో వారు వర్ణ వ్యవస్థలో చివరి మెట్టు దగ్గర మిగిలిపోవడం లేదా వర్ణ సామాజిక చట్రం వెలుపల అవమానాల పాలవుతారు.
ప్రస్తుతం, ‘ఆదివాసీ’ అనే పదం.. భారత ప్రభుత్వం, మైదాన ప్రాంతంలో నివసించే ప్రజలను భారత్ ఉపఖండంలో వాస్తవికంగా నివసిస్తున్న వారి ప్రాంతాల్లో చొరబడి వారిని అణచివేసేవారుగా సూచించడానికి ఉపయోగిస్తున్నారు. ఇది భారతదేశపు మైదాన ప్రాంతాల్లో నివసించే వర్గాల పట్ల అటవీ ప్రాంతాల్లో నివసించే తెగలకు ఒక దురభిప్రాయం కలిగించడానికి ఐరోపా వలస పాలకులు చేసిన ఒక దుష్ప్రచారం.
ఈ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా, వనవాసీ సామాజిక వర్గాలు హిందూ నాగరికతలో ఎప్పటికీ అవిభాజ్యమని ఆధునిక కాలంలో గాంధీ నుంచి సావర్కర్ దాకా ఘంటాపథంగా చెప్పారు. వనవాసీలు ధర్మానికి చెందిన ఒకానొక కీలకమైన భాగం.
ఇది బ్రిటీష్ వారు అవలంభించిన వనవాసీలను విభజించు విధానానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ వైఖరి కాదని గుర్తుంచుకోవాలి. హిందూ సమాజంలో పేరొందిన కులాలు తీరుగా వనవాసీ సామాజిక వర్గాలూ హిందువులే అని చెప్పిన సందర్భంలో శాశ్వతమైన ఒక ధార్మిక సూత్రాన్ని గాంధీ ప్రవచించారు.
ఈ సందర్భంగా ఒక తమిళ సాంస్కృతిక అనుభవాన్ని మీకు వివరిస్తాను.
మధురైలో ప్రసిద్ధి చెందిన మీనాక్షి అమ్మవారి దేవస్థానంలో ‘వేట్ట మండప్’ అంటే వనవాసీ వేట మండపం పేరిట ఒక అలంకృతమైన హాలు ఉన్నది. ఆ హాలులో అత్యధిక భాగం ఒక వనవాసీ జంటకు చెందిన అతి పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఆ జంటను సాక్షాత్తూ శివ, పార్వతులుగా భావించిన క్రమంలో, దానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం ఒక బ్రాహ్మణుడు అత్యంత పాపానికి ఒడిగట్టినప్పుడు సదరు బ్రాహ్మణునికి అతడి దుష్ట స్వభావం నుంచి స్వయంగా అతడికి మోక్ష మార్గం చూపించడానికి వనవాసీ దంపతుల రూపంలో శివ, పార్వతులు నేలపైకి వచ్చారు.
ఇదే స్థల పురాణాన్ని మరో కోణంలో చూసినప్పుడు, సదరు పాపి ఒక వనవాసిగానూ, అతడికి సద్గతి కల్పించడానికి శివ, పార్వతులు ఒక బ్రాహ్మణ దంపతులుగానూ వచ్చినప్పుడు సదరు స్థల పురాణం ఉద్దేశ్యపూర్వకంగానే మూస పోసిన మిడిమిడి జ్ఞానపు ఛాందస భావాన్ని సమర్థించిందని చెప్పుకోవచ్చు. కానీ అలంకృతమైన హాలులో ఆది దంపతుల విగ్రహాలు వనవాసీ జంటను పోలి ఉన్నాయి. ఈ ఉదంతం హిందూ సమాజంలో వనవాసీ సామాజిక వర్గాలకు గణనీయమైన గుర్తింపు ఉన్న వైనానికి అద్దం పడుతున్నది. అది వలస పాలకుల ప్రభావం లేనంతవరకు హిందూ సమాజంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మికతల్లో అత్యంత విలువైన అంశంగా ఇమిడిపోవడం గమనార్హం.
విస్తృతమైన ఈ భారతీయ నాగరికతా ఐక్యత ప్రాతిపదికగా వనవాసీ సామాజిక వర్గాలను చేరుకోవాలని గాంధీజీ నిత్యం పట్టుబడుతుండేవారు. ఇదే అంశం ప్రాతిపదికగా సావర్కర్, గాంధేయవాదులు పరస్పరం సహకరించిన సందర్భాలు ఉన్నాయి.
వనవాసీల సంక్షేమానికి అంకితమైన పేరొందిన గాంధేయవాది థక్కర్ బాబా వనవాసీ బాలబాలికలకు పాఠశాలల రూపకల్పన కోసం 1943లో సావర్కర్‌తో కలిసి ముందుకు వచ్చారు.
అనంతర కాలంలో థక్కర్ బాబా నుంచి స్ఫూర్తి పొందిన ‘వనయోగి’ రమాకాంత్ కేశవ్ దేశ్‌పాండే (1913-1995) వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం (VKA) ను 1952లో ప్రారంభించారు.
నయా వలసవాద శక్తుల చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడే పాశ్చాత్య దేశాల ప్రజా హక్కుల ఉద్యమాలకు భిన్నంగా, సామాజిక న్యాయాన్ని పాటించడంలో రాజీ పడకుండా వనవాసీ సమాజిక వర్గాలను, మైదాన ప్రాంతాల్లోని సామాజిక వర్గాలను ఏకం చేయడంలో VKA అహరహం పాటుపడుతున్నది.
ఉదాహరణకు VKA కు చెందిన ఏకలవ్య ఖేల్ కూడ్.. క్రీడా నైపుణ్యాలను సంతరించుకున్న వారిని గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి, వారి క్రీడా పాటవాన్ని ప్రదర్శించడంలో ఒక వేదికను అందిస్తున్నది. సుప్రసిద్ధ విలుకాడు లింబారామ్, సుదీర్ఘ దూరం పరుగులు తీసే క్రీడాకారిణి కవితా తుంగర్ మూలాలు VKA లో ఉన్నాయి. VKA లో తన సామాజిక సేవా జీవనానికి నాంది పలికిన దామోదర్ గణేష్ బాపట్ (1935-2019) వనవాసీ ప్రాంతాల్లో కుష్ఠు రోగ నిర్మూలనకు వారి యావజ్జీవితాన్ని అంకితం చేశారు.
రెండు దశాబ్దాలుకు పైగా శరణార్థ శిబిరాల్లో తలదాచుకున్న రెయాంగ్ సామాజిక వర్గానికి చెందిన వారికి పునరావాసం కల్పించడంలో VKA అవిశ్రాంతంగా పనిచేసింది.
చివరగా, ఒడిశాలో ఒక వనవాసీ తెగకు చెందిన ఒక చురుకైన మహిళా నాయకురాలు రైసానా హిల్‌కు చేరుకున్న తరుణాన, కంథమాల్‌లో వనవాసీ బాలబాలికల సంక్షేమం, వారి సర్వతోముఖాభివృద్థి కోసం పనిచేసిన కారణంగా దేశ వ్యతిరేక, వనవాసీ వ్యతిరేక శక్తుల చేతిలో అమరులైన స్వామీ లక్ష్మానంద సరస్వతి సర్వోన్నత త్యాగాన్ని మరువరాదు.
వ్యాసకర్త స్వరాజ్య కు కంట్రిబ్యూటింగ్ ఎడిటర్
Source: swarajyamag
అనువాదం: మహేష్ ధూళిపాళ్ళ