Home News సౌదీ అరేబియాలో బైటపడిన 8,000 సంవత్సరాల నాటి దేవాలయం

సౌదీ అరేబియాలో బైటపడిన 8,000 సంవత్సరాల నాటి దేవాలయం

0
SHARE

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు నైరుతి దిక్కున ఉన్న అల్-ఫా లో 8,000 సంవత్సరాల నాటి ఒక పురావస్తు ప్రాంతాన్ని సౌదీ హెరిటేష్ కమిషన్ కనుగొంది.

సౌదీ అరేబియా నేతృత్వంలో వివిధ దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సదరు ప్రాంతంలో ఒక సమగ్రమైన సర్వేను చేపట్టిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) పేర్కొంది.

ఆ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అనేక అంశాల్లో అత్యంత కీలకమైనదిగా రాతితో నిర్మించిన దేవాలయం తాలూకు అవశేషాలు, హోమ గుండం భాగాలు ఉన్నాయి. ఒకానొక కాలంలో అల్-ఫా స్థానికుల జీవన విధానంతో వేడుకలు, పూజలు, ప్రార్థనలు, ఆచార వ్యవహారాలు పెనువేసుకుపోయి ఉన్నాయనే స్పష్టమైన సంకేతాలను వెలుగులోకి వచ్చిన దేవాలయం, హోమగుండం ఇస్తున్నాయి. అల్-ఫా కు తూర్పు దిక్కున ఖషేమ్ ఖర్యా అని పేరొందిన తువాయిఖ్ పర్వతం అంచున రాతితో నిర్మితమైన దేవాలయం కొలువై ఉంది. 8,000 సంవత్సరాల క్రితం వేర్వేరు కాలాలకు చెందిన 2,807 సమాధులతో పాటుగా అప్పటి మానవ ఆవాసాలకు చెందిన అవశేషాలను సైతం అధునాతన సాంకేతిక నైపుణ్యంతో చేపట్టిన సర్వే వెలుగులోకి తీసుకువచ్చింది. అలా బైటపడిన వాటిని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆరు గ్రూపులుగా వర్గీకరించింది. సదరు వివరాలను గ్రంథస్తం చేసింది. పురావస్తు సర్వే చేపట్టిన ప్రాంతం అట్టడుగున నేల అంతటా అల్-ఫా ప్రజల ధార్మిక విశ్వాసాలకు అద్దం పడుతున్నట్టుగా భక్తి సంబంధిత శాసనాలు పరచుకొని ఉన్నాయి.

సాంస్కృతిక సంపదకు తోడు ఆ ప్రాంతంలో నాలుగు స్మారక భవనాలు, మూల గుమ్మటాలు, అంతర్గత ప్రణాళికలు, బహిరంగ ప్రాంగణాలతో కూడిన ఒక ప్రణాళికబద్ధమైన నగరం తాలూకు ఉనికిని సర్వే నిర్ధారించింది. కాలువలు, నీటి తొట్టెలు, వందలాదిగా గోతులతో ప్రపంచంలోనే అత్యంత ఏడారి ప్రాంతంగా వినుతికెక్కిన చోట నీటిపారుదల వ్యవస్థను పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనం బహిరంగపరిచింది.

గడచిన 40 సంవత్సరాలుగా పురావస్తు అధ్యయనాలకు కీలకమైన ప్రాంతంగా అల్-ఫా పురావస్తు ప్రాంతం పేరొందింది. అలా జరిపిన అధ్యయనాలు ఏడు పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి. ఆవాస, విపణి ప్రాంతాలు, దేవస్థానాలు, స్మారక చిహ్నాలతో కూడిన అల్-ఫా తాలూకు సాంస్కృతిక జీవనాన్ని ఇంతకమునుపు జరిపిన పురావస్తు అధ్యయనాలు ప్రస్తావించాయి.

మరీ ముఖ్యంగా.. ప్రస్తుతం ఇస్లామ్ అనుసరణలో దేవాలయాలు, విగ్రహారాధనకు తావు లేని సౌదీ అరేబియాలోని అల్-ఫా పురావస్తు ప్రాంతం దేవస్థానాలు, పూజలు, విగ్రహారాధనతో కూడిన ఒక సంస్కృతిని ప్రతిబింబించడం గమనార్హం. దీంతో అరేబియా ఎడారి ప్రాంతంలో నివసించే ప్రజలను ఇస్లామిక్ విజయాలు నాగరికులుగా మార్చాయంటూ విస్తృతంగా ఆమోదం పొందిన ఒక ప్రతిపాదనకు అల్-ఫా ప్రాంతంలోకి వెలుగులోకి వచ్చిన 8,000 సంవత్సరాల నాటి దేవాలయం, హోమగుండం సవాల్‌గా కూడా నిలిచాయి.

Source : ORGANISER