Home Interviews ఐక్యతా వ్యూహం : RSS సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీతో ముఖాముఖి

ఐక్యతా వ్యూహం : RSS సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీతో ముఖాముఖి

0
SHARE
‘An Agenda for Unity’ పేరుతో ప్రచురితమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీ ఇంటర్వ్యూ తెలుగు అనువాదం…

ప్ర‌శ్న : వెయ్యి సంవత్సరాలకు పైగా అనేక దండయాత్రలను, విభజనను ఎదుర్కొన్నప్పటికీ, భారతదేశం ఇప్పటికీ తన మౌలిక ఐక్యతను, నాగరికతను, వారసత్వాన్ని నిలుపుకుంది. ఈ ఫలితానికి ఏ ఏ అంశాలు దోహదపడ్డాయని మీరు అనుకుంటున్నారు?

జ‌వాబు : మనం భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, ఒక సత్యాన్ని గ్రహిస్తాం. మన దేశంలోని రాజ్యాలు అనేకమంది రాజుల పాలనలో ఉన్నప్పటికీ, ప్రతి రాజ్యమూ ఈ విశాల భారతదేశంలో భాగమనే భావన, స్పృహ పాలకులలోనూ, ప్రజలలోనూ లోతుగా ఉండేది. అందుకే భారతదేశం ఐక్యంగా ఉంది. ఇది సైద్ధాంతిక, సాంస్కృతిక, తాత్విక నిర్మాణం. ఇది వేలాది సంవత్సరాలుగా ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యా కుమారి వరకు మరియు పశ్చిమాన గుజరాత్, పాకిస్తాన్ తీర ప్రాంతాల నుండి అరుణాచల్ ‌లోని పరశురామ కుండ్ వరకు విస్తరించి ఉన్న భూభాగాన్ని కలిగి ఉంది. ఇది రాజకీయ ఐక్యతకు మించిన మౌలిక ఐక్యత. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్, విలీనాన్ని ప్రోత్సహించినప్పుడు 560కి పైగా సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి.

ప్ర‌ : మరలాంటప్పుడు మన దేశంలో “హిందూ-ముస్లిం-సిక్కు-క్రైస్తవ భాయి భాయి” వంటి నినాదాలు ఎందుకొచ్చాయి? ప్రజల మధ్య అలాంటి విభేదాలున్నాయని భావించి, వారి మధ్య సయోధ్య నిర్మించడం కోసం అలాంటి నినాదాలు సృష్టించారా?

జ‌ : మన దేశంలో భాషాపరమైన, భౌగోళిక వైవిధ్యం దేశవ్యాప్తంగా పర్యటించే ఎవరికైనా కనిపిస్తుంది. మనం అలా చూస్తూ పోతే…. ప్రజల ఆహారపుటలవాట్లు, పండుగలు, రంగులు మారిపోతుంటాయి. కానీ ఇవి బాహ్యంగా కనిపించే వ్యత్యాసాలు మాత్రమే. కానీ మౌలికంగా, అంతర్గతంగా, దేశమంతటా ఒకే సహజమైన తాత్వికత ఉంది. భాషలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ప్రతి భాష, ప్రధానంగా ఒకే తాత్వికతను ప్రతిపాదిస్తుంది. జీవన విలువలు, భక్తి, భూమి పట్ల గౌరవం, కర్మ భావన, జన్మ – పునర్జన్మ, నిర్వాణం, మోక్షం, మొదలైన భావనలన్నీ బెంగాలీ, ఒరియా లేదా మరే ఇతర భారతీయ భాషలోనైనా ఒకే విధంగా ప్రతిధ్వనిస్తాయి. భాష ఏదైనా సరే… ప్రతిపాదించబడిన తత్త్వం మాత్రం ఒకటే కావడమే దీనికి కారణం. మీరు ప్రస్తావించిన నినాదాలన్నీ తర్వాత తెచ్చినవే. అవన్నీ రాజకీయ నినాదాలు మాత్రమే.

ప్ర‌: మీరు చెబుతున్న ఈ మౌలిక ఐక్యత నేటి సమాజం నేపథ్యంలో ప్రజలకు ఎలా అర్థమవుతుంది?

జ‌: మౌలిక ఐక్యత ఇప్పటికే ఉంది. దీన్ని అర్థం చేసుకోవటానికి, మన చుట్టూ ఉన్న వైవిధ్యాన్ని మనం దర్శించవలసి ఉంటుంది. అస్సాం, పశ్చిమ బెంగాల్ ల నుండి ప్రజలు ఉత్తర భారతదేశానికి వెళితే, వారు కృష్ణుడి పట్ల అదే భక్తిని పాటిస్తారు. కేరళలో భాష మలయాళం. కానీ భక్తి కవిత్వం మాత్రం ఒకటే. అస్సాం, బెంగాల్ కవులు, రచయితలు రాసిన నాటకాలు, వ్యాసాలు అదే భావాన్ని తెలియజేస్తాయి. ఇదే మౌలిక ఐక్యత. దీనిని మరింత లోతుగా తెలుసుకోవడానికి, ప్రజలు మరింతగా ప్రయాణించాల్సిన, అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉంది. తమిళనాడులోని తిరువల్లువర్, పంజాబ్ ‌లోని గురునానక్ దేవ్ జీల రచనలలో సారూప్యతను మనం గమనించవచ్చు. ఇదే మౌలిక ఐక్యత.

ప్ర‌ : 15వ శతాబ్దంలో అస్సాంకు చెందిన గొప్ప పండిత కవి శంకరదేవుడు, ఎనిమిదో శతాబ్దంలో శారదాపీఠాన్ని స్థాపించిన కేరళకు చెందిన ఆదిశంకారుల వంటి భారతదేశం యొక్క ఈ స్ఫూర్తిని, ఐక్యతను ప్రచారం చేసిన గొప్ప జ్ఞానులు శతాబ్దాలుగా మనకు ఉన్నారు. పదహారవ శతాబ్దంలో మనకు రసఖాన్ అనే ముస్లిం ఉన్నాడు. ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. అలాగే తాజ్ ‌బీబీ. ఇది సంస్కృతి యొక్క పరస్పర కలయికను మరియు సమీకరణను చూపింది. భారతదేశం సాంస్కృతిక సమ్మేళనానికి ప్రధాన కేంద్రం. అయనప్పటికీ దేశం విభజన గాయాన్ని ఎందుకు భరించవలసి వచ్చింది? ఆ సమయంలో మౌలిక ఐక్యతకు ఏమైంది?

జ‌ : మన దేశంలో ఒక నిర్దిష్ట భావజాలాన్ని వ్యాప్తి చేయడానికే సుమారు 1000 సంవత్సరాల క్రితం మన దేశంపై ఇస్లామిక్ దండయాత్రలు జరిగాయి. యుద్ధంలో గెలిచిన తర్వాత, తమ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి, స్థానిక మతంపై దాడి చెయ్యడం, మన దేవాలయాలను, మన సిద్ధాంతాలను, మన ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసే పరిస్థితి మన దేశ వాసులు జీవితంలో అంతకముందు ఎప్పుడూ అనుభవించలేదు. ఏడెనిమిది వందల సంవత్సరాల పాటు ఇస్లాం పాలనలో ఉన్నప్పటికీ, ఇస్లాం పాలనలో కూడా, తమ సిద్ధాంతాలను, సంస్కృతిని, సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి భారతదేశపు మేథావి వర్గం సుదీర్ఘ పోరాటం చేసింది. ఆ విషయంలో వారు విజయం సాధించారు కూడా. ఇస్లామిక్ ఆక్రమణకు గురైన, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో, స్థానిక జనాభా దండయాత్రికుల భావజాలానికి తేలికగా లొంగిపోయింది. కానీ భారతదేశం మాత్రమే అందుకు మినహాయింపు. కాబట్టి, మొదట గుర్తించవలసిన విషయం ఏమిటంటే, భారతదేశ ప్రజలు తమ మతాన్ని, సంస్కృతిని, సిద్ధాంతాలను, సమాజాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పోరాడారు. కానీ బ్రిటీషర్లు వచ్చాక, వారు పాలించిన రెండు వందల సంవత్సరాల కాలంలో, వారు భారతదేశం యొక్క ఈ మౌలిక ఐక్యతపై తెలివిగా దాడి చేశారు. భారతదేశం యొక్క సాంస్కృతిక ఐక్యత ఇస్లామిక్ దండయాత్రల ద్వారా విచ్ఛిన్నం కాలేదు. ఎందుకంటే ఈ ఐక్యత రాజకీయమైనది కాదు. హిందూ రాజులు లేకపోయినా, ప్రజల తీర్థయాత్రలు మాత్రం కొనసాగాయి. హిందువులకు సైన్యం లేకపోయినా, దేవాలయాలు ద్వంసమైనా, ప్రజల వద్ద భగవద్గీత, రామాయణం, భారతం ఉన్నాయి. అవి హిందువుల విశ్వాసం విచ్ఛిన్నం కాకుండా కాపాడాయి. కానీ, బ్రిటీష్ వారు నెమ్మదిగా భారతీయ సమాజంలో చీలికలను సృష్టించారు. ఇది సమాజంలో లోతైన విభజనకు దారితీసింది. చివరికి దేశ విభజనకు దారితీసింది.

ప్ర‌ : నిజంగా హిందూ-ముస్లిం ఐక్యత గురించి మాట్లాడితే, నేడు, వారి మధ్య మత సామరస్యాన్ని, ఐక్యతను ప్రోత్సహించడం అవసరం. ఒకవేళ రెండు వర్గాలను విడివిడిగా పరిగణించినట్లయితే, ఐక్యత అనేది ఎండమావే కదా? లేకపోతే మనం కేవలం రాజకీయ ఐక్యత కోసం మాత్రమే చూస్తున్నామా?

జ‌ : సనాతన భారతీయ సమాజం చాలా బలమైన ఐక్యతా మూలాలను కలిగివుంది. భారతదేశంలో విభిన్న ఆచారాలు, ఆరాధనా పద్ధతులు, సంప్రదాయాలు కలిగిన వందలాది వివిధ రకాలు శాఖలు ఉన్నాయి. వారందరూ ఐక్యంగానే ఉన్నారు. ఈ ఐక్యతకు ఆధారమేమిటన్న దాన్ని మొదట మనం అర్థం చేసుకోవాలి. ‘సర్వే భవన్తు సుఖినః’ అనే భారతదేశం యొక్క శాశ్వతమైన ఆలోచనలోనే ఈ ఐక్యత యొక్క ఆధారం ఇమిడి ఉంది. ఆ మాటల పరమార్థం ఆధారంగానే మనం అనేక విషయాలను ఆమోదించాం. కేవలం మన ఆలోచనలు, సిద్ధాంతాలతో ఏకీభవించే ఒక వర్గం ప్రజల సుఖ సంతోషాల కోసం కాదు, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా సర్వ మానవాళి సుఖ సంతోషాల కోసం చేసే ప్రార్ధన అది. ఈ తాత్వికత పాకిస్తాన్, చైనాల వంటి వివిధ ప్రపంచ దేశాల ప్రజల సుఖ సంతోషాలను కూడా కోరుకుంటుంది. విశ్వ మానవ సౌభాగ్యాన్ని కోరుకునే సిద్ధాంతమది. ‘సర్వే భవన్తు సుఖినః’ లో ఈ విధంగా సర్వవ్యాప్త ఐక్యత దాగి ఉంది. మనం దీనిని అర్థం చేసుకోవాలి. రెండవది, వేద కాలం నుండి నేటి వరకు, వేల సంవత్సరాలుగా సనాతన భారతీయ సమాజం, మరొక సూత్రాన్ని కూడా ఆమోదించింది. ఈ ఆలోచనలో ఉన్న అంతర్లీన సూత్రం ఏమిటంటే, మనం నమ్మే దానికి భిన్నమైన అభిప్రాయాలు, విశ్వాసాలు కలిగిన వ్యక్తులుంటారు. ఋగ్వేదం ప్రకారం మనకంటే భిన్నమైన అభిప్రాయాలు, విశ్వాసాలు కలిగిన వ్యక్తులు కూడా మంచివారే. వేద ఋషి “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అని చెప్పాడు. అంటే అతను ప్రత్యామ్నాయ దృక్కోణానికి కూడా ఆమోద పత్రాన్ని ఇచ్చాడు. ప్రతి ఆలోచనా గొప్పదే, ప్రతి ఆలోచనా సత్యమే, దానిని తిరస్కరించకూడదని ఋషులు ఉద్బోధించారు. ఇది అనంతమైన వైవిధ్యాన్ని ఏకం చేసే మంత్రం. మరో మాటలో చెప్పాలంటే, ఇది వైవిధ్యంలో ఏకత్వం. అందువల్ల, మనకు రెండు ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ఒకటి, సర్వ మానవాళి సుఖ సంతోషాలను కోరుకోవడం, రెండవది, ఏ ఆలోచననైనా గౌరవంగా అంగీకరించే పెద్ద మనస్సు కలిగి ఉండటం. భాషలు, మాండలికాలు, వాతావరణం, ఆహారం, దుస్తులు మరియు భావజాలాల వైవిధ్యాన్ని అధిగమించి, సాధించవలసిన సామరస్యం మరియు ఐక్యత కోసం ఇది మనం తప్పనిసరిగా పాటించవలసిన సూత్రం.

ప్ర‌ : మీరు దారా షికోపైన, భారతీయ తత్వ శాస్త్రాన్ని, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అనేక మంది ఇతర ముస్లిం సాధువులపైన చాలా అధ్యయనం చేశారు. అయితే స్వాతంత్ర్యానికి ముందు గత రెండు వందల సంవత్సరాల నాటి బ్రిటీష్ వారి కొత్త తరహా రాజకీయాల ఆవిర్భావం గురించి మాట్లాడుకుందాం. 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ‌ను మత ప్రాతిపదికన విభజించింది. 1906లో ముస్లిం లీగ్ ‌ని ఏర్పాటయింది. 1909లో, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఇచ్చారు. ఇది వారికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వడమే కాక, వారు ప్రత్యేక దేశాన్ని కోరుకోవడానికి మార్గం సుగమం చేసింది. ఇప్పుడు, ఈ ప్రజలందరూ కూడా భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో భాగమయ్యారు. గ్రామాల్లో, వారు ఇతర వర్గాల ఆచారాలు, సంప్రదాయాలను కూడా అనుసరించారు. ఆ తర్వాత, కొన్ని దశాబ్దాలలోనే దేశ విభజన జరిగింది. నేడు, ఈ సమస్యలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. మెజారిటీ మరియు మైనారిటీ చర్చలు మతాల మధ్య దూరం పెంచాయి. ఇప్పుడు మనం ఈ సమస్యను ఎలా అధిగమించాలి?

జ‌ : బ్రిటిష్ వారు ఒక విషయం అర్థం చేసుకున్నారు. భారతదేశం ఐక్యంగా ఉంటే ఈ దేశంలో వారి పాలన త్వరగా ముగుస్తుంది. ఆ కారణంగా హిందువులు, ముస్లింల మధ్య చీలికను సృష్టించడానికి బ్రిటిష్ వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ముస్లిం దండయాత్రల సమయంలో, అనేక రంగాలలో అనేక సాంస్కృతిక కలయికలు జరిగాయి. ముస్లింలు భారతీయ సంగీతంలో మునిగిపోయారు, ముస్లిం ఖవ్వాలిలు ప్రాచుర్యం పొందాయి, ముస్లింలు సమాధులను పూజించడం ప్రారంభించారు, తజియా ఊరేగింపు మొదలైన వాటిని మనం చూస్తాం. చాలా మంది ముస్లింలు హిందూ పవిత్ర గ్రంథాలను పర్షియన్ మరియు అరబిక్ భాషలకు అనువదించడం కూడా మనం చూశాం. ఇది ఐదు నుండి ఆరు వందల సంవత్సరాల పాటు కొనసాగింది. భారతదేశాన్ని నిరంతరాయంగా పాలించడానికి, ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం చాలా అవసరమని బ్రిటన్ గ్రహించింది. ఆ విధంగా ముస్లిం సమాజాన్ని విభజించి, వారిని వివిధ రకాలుగా రెచ్చగొట్టి, వారిని భారతీయ సమాజం నుంచి వేరు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బెంగాల్ ‌ను ముస్లిం బెంగాల్ ‌గా, హిందూ బెంగాల్ ‌గా విభజించేందుకు కుట్ర పన్నినట్లే బ్రిటీష్ వారు ముస్లిం లీగ్ ‌ని ఏర్పాటు చేశారు. క్రమంగా, భారతదేశంలోని ముస్లిం సమాజం తన మూలాలకు దూరం జరిగింది. దేశ విభజన ముసాయిదా సిద్ధమైంది. కానీ దేశ విభజన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలు భారతదేశంలోనే ఉండిపోవడంతో సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. “మెజారిటీ హిందూ రాజ్యంలో మైనారిటీ ముస్లింలు ఎలా సురక్షితంగా ఉండగలరు?” అని అంతకుముందు జిన్నా చెప్పేవారు. ఆ వాదం వారిలో ఇప్పటికీ అలాగే ఉంది. కాబట్టి, ఐక్యతను తీసుకురావడానికి, మనస్సు, హృదయం మరియు భావాలలో మార్పు తీసుకురావాలి. ఇది వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

ప్ర‌ : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 30 వరకు మైనారిటీల హక్కుల రక్షణకు హామీ ఇస్తున్నాయి. అయితే, భారతదేశంలో గత 75 ఏళ్లుగా రాజకీయాలు, మైనారిటీల హక్కులను పరిరక్షించడం నుండి మైనారిటీల సంతుష్టీకరణ దిశగా పయనించాయి, పరిణమించాయి. ఇది భారత ఐక్యతకు విఘాతం కలిగించిందా?

జ‌ : స్వాతంత్ర్యంతో ప్రతి పౌరుడికీ ఓటు హక్కు వచ్చింది. ఓటు చాలా విలువైన వస్తువుగా మారింది. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్లను గంపగుత్తగా సేకరించడం ప్రారంభించాయి. అలాంటి ఓట్లను పొందడానికి కొత్త పదజాలం సృష్టించాయి. అటువంటి కోవలోనిదే ‘మైనారిటీ’ అనే పదం. ఈ పదం ఐరోపా నుండి వచ్చిన విదేశీ పదం. మైనారిటీ అంటే ఆ దేశానికి చెందిన వారు కాని, ఏదో ఒక కారణంతో ఎక్కడి నుంచో వలస వచ్చిన చిన్న సమూహం అని అర్థం. ఇది ఆ దేశానికి లేదా ఆ జాతికి చెందని ప్రజలను సూచిస్తుంది. కానీ భారతదేశంలో, ముస్లిం సమాజం ఒక పెద్ద సమాజం. స్వాతంత్ర్యం తరువాత, ఇది మొత్తం భారతీయ సమాజంలో దాదాపు 12 నుండి 13 శాతం. దాని ఆధారంగానే వారిని మైనారిటీలుగా పేర్కొనకూడదు. ఈ ముస్లింలలో ఎక్కువ మంది ఇక్కడి నుండి మతం మారినవారే. కేవలం మతం మారినందున వారిని మైనారిటీలు అని ఎలా అంటారు? కానీ వారి ఓట్లను పొందడానికి, వారు ఎల్లప్పుడూ మిగతా సనాజం నుంచి విడిగా ఉండేలా చూసుకోవడానికి వారికి ఏదో ఒక పేరు పెట్టబడింది. బ్రిటీష్ వారి నిష్క్రమణతో ఆ అధ్యాయం ముగియవలసినది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. అనవసరంగా మెజారిటీ – మైనారిటీ భావన సృష్టించబడింది. మనం ఇప్పుడు దాని దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాము.

ప్ర‌ : ఐక్యతా సాధనకు ఇప్పుడు ఎంత ప్రయత్నం అవసరం?

జ‌ : భారతదేశం పౌరసత్వాన్ని ఇస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రతి వ్యక్తికి అన్ని హక్కులనూ అందిస్తుంది. కానీ జాతీయత పొందాలంటే మాత్రం మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. పౌరసత్వం మీకు రాజ్యాంగపరంగా కొన్ని హక్కులను ఇస్తుంది. జాతీయత మీ విధులను నిర్ణయిస్తుంది. మీరు ఈ జాతీయులైన వెంటనే, మీరు వేల సంవత్సరాల ఈ సంస్కృతీ సంప్రదాయాల ద్వారా ఈ దేశంతో అనుసంధానింపబడతారు. ఈ దేశం యొక్క సుఖదుఃఖాలను, జయాపజయాలను మీవిగా భావిస్తారు. ఈ దేశం యొక్క చరిత్ర, భౌగోళికతను మీదిగా భావిస్తారు. జాతీయత కాబట్టి అందరికీ సమానంగా ఉండాలి. జాతికి సుఖ దుఃఖాలు, శత్రుమిత్ర భావనలు ఒక్కటే. పౌరులందరూ ఈ జాతీయవాద భావాన్ని అలవరచుకోవాలి. ఉదాహరణకు, మన మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశం కోసం వివిధ క్షిపణులను అభివృద్ధి చేశారు. వాటికి ఆకాష్, నాగ్, త్రిశూల్ మొదలైన పేర్లను పెట్టారు. ఈ పేర్లు జాతీయవాద భావానికి ప్రతీకలు. మన ముస్లిం సోదరులు, సోదరీమణులు తమను తాము ఈ దేశ చరిత్రతో ముడిపెట్టాలి తప్ప దేవాలయాలను ధ్వంసం చేసిన, ప్రజలను హింసించిన, జిజియా పన్ను విధించి, ప్రజలను బాధించిన, ఆక్రమణదారుల చరిత్రతో కాదు. వారు ఆక్రమణదారులతో తమను తాము అనుసంధానించుకున్నట్లయితే, వారిని ఈ జాతీయులుగా ఎలా పిలవగలం?

ప్ర‌ : భారతదేశంలో గత 75 ఏళ్లుగా మత సామరస్యంపై చర్చ, సెక్యులరిజంపై కేంద్రీకృతమై ఉంది. హిందూ సమాజం దాని స్వభావ రీత్యా లౌకికమైనది. కానీ లౌకికవాదం యొక్క అభ్యాసం రాజకీయాలలో మరియు కొన్ని వర్గాలలో ఏకరీతిగా లేదు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారతదేశం రాబోయే 25 సంవత్సరాల పాటు ముందుకు సాగాల్సిన ‘అమృత కాలం’ గురించి మాట్లాడారు. మనం సుసంపన్నమైన, సమర్థమైన భారత్ ‌ను ఊహించుకుంటాం. అయితే ఇప్పుడు మనం మత సామరస్యం గురించి ఎలా చర్చించాలి? దాని రూపం ఎలా ఉండాలి? మరి దాన్ని సమాజం ఎలా ముందుకు తీసుకెళ్లాలి?

జ‌ : ఇక్కడ రెండు విషయాలు చర్చించాల్సి ఉంది. మొదటిది మైనారిటీలకు ఆర్థిక మరియు ఇతర సహాయాలను అందించడం. ఇది వారి సంక్షేమం పేరుతో జరుగుతోంది. కానీ అది ఎప్పుడూ మంచి ఫలితాలను ఇవ్వదు. ఉదాహరణకు, మైనారిటీ వర్గాల పిల్లలకు చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ‌లు ఇస్తారు. పేద పిల్లలకే ఇస్తారు. అయితే, ఉదాహరణకు 40 మంది పిల్లలున్న ఒక తరగతిలో, మైనారిటీ వర్గాల నుండి ఐదుగురు పేదలు ఉన్నారని, వారికి స్కాలర్‌షిప్ ఇస్తున్నారని అనుకుందాం. కానీ ఆ తరగతిలో మరో 10 మంది పిల్లలు కూడా పేదలు ఉన్నారు. కానీ వారు మైనారిటీ వర్గానికి చెందినవారు కానందున వారికి స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. ఇది వారిలో అసమ్మతిని సృష్టిస్తుంది. ఎందుకంటే ఆ పది మంది పిల్లల మనస్సులలో, ప్రశ్న తలెత్తుతుంది : మా ఇంటి పరిస్థితి వారి కంటే అధ్వాన్నంగా ఉన్నప్పుడు మాకు ఎందుకు సహాయం చేయడంలేదు? ఇటువంటి ఏకపక్ష సహాయం సమాజంలో సామరస్యానికి బదులుగా వ్యత్యాసాలను సృష్టిస్తుంది. కాబట్టి, విభజన ప్రాతిపదికన కాకుండా ఆర్థిక మరియు ఇతర సహాయాలు అందరికీ ఒకే విధంగా అందించబడాలి. ఇటీవల ప్రభుత్వం, మతంతో సంబంధం లేకుండా అన్ని పేద కుటుంబాలకూ మరుగుదొడ్లు, వంటగ్యాస్ ‌ను అందించింది. సహాయం అవసరమైన వారికి అందించాలి. మైనారిటీ కమ్యూనిటీలో ఎక్కువ పేదరికం ఉంటే, సహజంగానే వారిలో ఎక్కువమంది సహాయం పొందుతారు. బ్యాంకు అవసరం ఉన్న చోట బ్యాంకులు తెరవాలి. అవసరమైన కళాకారులకు శిక్షణ ఇవ్వాలి. ఈ దేశం మనది-ఇప్పటివరకు జరిగినట్లుగా మైనారిటీ – మెజారిటీ విభజన ఇకమీదట ఉండకూడదు. మనం పౌరులందరినీ ఒకే దృష్టితో చూడాలి తప్ప మత దృష్టితో కాదు. ఇది రాజ్యాంగ పరిషత్ ‌లో చెప్పబడింది. కానీ అమలు కావడంలేదు. రాజ్యాంగ పరిషత్ ‌లో ఉన్న వ్యక్తులకు, మన రాజ్యాంగ నిర్మాతలకు ఈ దృష్టి ఉంది. మొత్తం సమాజాన్ని ఒక్కటిగా చూడటం ద్వారా సమగ్ర వికాసం సాధ్యమయ్యే ఈ దృక్పథాన్ని మనం గ్రహించాలి. పేదరికాన్ని అంతం చేయడానికి, మనం మొత్తం సమాజంలోని పేదలందరినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక నిర్దిష్ట మత సమూహాన్ని మాత్రమే కాదు.

ప్ర‌ : గత 50 సంవత్సరాలుగా, మీ పని మొత్తం సమాజ కేంద్రంగా సాగింది కదా? మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, సమానత్వ సాధనకు కూడా చాలా కృషి జరిగింది. నేను ఇప్పుడు సోదరభావం (సౌభ్రాతృత్వం) సమస్యను తీసుకుంటాను. ఒక సమాజంగా భారతదేశం ఈ దిశలో ఎలా పయనించాలి?

జ‌ : రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, సమాన స్వేచ్ఛను ఇచ్చింది. దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, చదువుకోవచ్చు, న్యాయం పొందవచ్చు, ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, భూములు కొనవచ్చు, ఓటు వేయవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు- ఇది ప్రతి ఒక్కరి హక్కు. రాజ్యాంగం లాగే న్యాయస్థానాలు కూడా అందరికీ ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇది స్వతహాగా సౌభ్రాతృత్వానికి దారితీయదు. రాజ్యాంగం హక్కులు ఇవ్వగలదు. కానీ రాజ్యాంగం ఆలోచనలో మార్పు తీసుకురాదు. అందుకు ఇంకేదో చేయాలి. గత 700 నుండి 900 సంవత్సరాల చరిత్ర కూడా ప్రజల మనస్సులలో కొన్ని జ్ఞాపకాలను లోతుగా నాటుకుపోయేలా చేసిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆక్రమణదారులను రోల్ మోడల్స్ ‌గా పరిగణించలేము. కాబట్టి ఈ రకమైన ఆలోచనా విధానంలో మార్పు అవసరం. మన దేవాలయాలను ధ్వంసం చేసిన వారిని, జిజియా పన్ను విధించి, ప్రజలపై దౌర్జన్యం చేసి, క్రూరంగా ప్రవర్తించిన వారిని, కొందరు నాయకులుగా భావిస్తే, మిగిలిన సమాజం వారిని ఆక్రమణదారులతో కలుపుతుంది. సోదరభావం ఏర్పడదు. అలాంటప్పుడు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, భారతదేశంలో నివసిస్తున్న ప్రజలను ఈ దేశ వినాశన చరిత్రను వ్రాసిన వ్యక్తుల నుండి వేరు చేయాలి. రెండవది, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, ప్రపంచంలో ఎన్ని విశ్వాసాలు, మతాలు, వర్గాలైనా ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ గౌరవం అనే భావన భారతదేశం యొక్క ‘సనాతన’ భావజాలం. భారతీయుడిగా ఉండటం అంటే, ప్రపంచంలోని ప్రతి విశ్వాసాన్ని, మతాన్ని గౌరవించడం, ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలను కోరుకోవడం. ఈ రెండు గుణాలు భారతీయుడిగా ఉండటాన్ని నిర్వచించాయి. ఈ రెండు పరిస్థితులు వచ్చే వరకు మనం వేచి చూడాలి. అయితే ఇది ఎలా జరుగుతుందో సమాధానం చెప్పడం కష్టం. భారతీయ సంప్రదాయంలో అందరి అభిప్రాయాలను గౌరవించడం పెద్ద షరతు. అందరి సుఖ సంతోషాలను ఆకాంక్షించటం రెండవ పెద్ద పరిస్థితి. ఒక భారతీయుడు విదేశాలకు వెళ్ళినప్పుడు, అతను ఈ రెండు ఆలోచనలను తనతో తీసుకువెళతాడు. ఆ దేశంలోని ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తాడు. అది యునైటెడ్ స్టేట్స్, కెనడా, UK, జర్మనీ లేదా ప్రపంచంలోని మరే ఇతర భాగమైనా సరే అక్కడి ప్రజల సుఖ సంతోషాలను కోరుకుంటాడు. తన ప్రార్థనలో, అతను ఎల్లప్పుడూ ‘సర్వే భవన్తు సుఖినః’ అని చెబుతాడు. ఈ రెండు విషయాలూ ప్రజలందరికీ వస్తే, అప్పుడు సోదర భావాన్ని తీసుకురావడం సులభం అవుతుంది. మనం వందల సంవత్సరాలుగా కల్లోలం, పోరాటాలు, ఒడిదుడుకులు మరియు బాధలను అనుభవించాం. కానీ ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం. స్వతంత్ర భారతదేశం అంటే…. తన ప్రాచీన మహిమాన్వితమైన రూపాన్ని స్మరించుకుంటూ, తన తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే ఆ తాత్వికత వెలుగులో ముందుకు సాగడం.  మనం దానిని చెట్టు పరంగా అర్థం చేసుకుందాం, ఆ చెట్టు తన చుట్టూ విస్తరించే బహుళ శాఖలను కలిగి ఉంటుంది. ఆ శాఖలన్నిటి మూలం ఒక్కటే. భారతదేశం యొక్క వైవిధ్యం ఈ చెట్టు యొక్క ఒక శాఖ నుండి మరొక శాఖకు విస్తృతంగా విస్తరించింది. ఏకత్వం మూలంలో ఉంది, వైవిధ్యం శాఖలలో మాత్రమే కనిపిస్తుంది. ఆ వైవిధ్యంలో వైరుధ్యాలు తలెత్తవచ్చు, అయితే మౌలిక ఏకత్వం దర్శనమైతే ఈ పోరాటాలు, విభేదాలు ఆగిపోతాయి. ఇది భారతదేశపు మౌలిక తత్త్వం. అనేకతలో ఏకత్వాన్ని దర్శింపజేసే, అన్ని రకాల వివక్షలు, అసూయ, సంఘర్షణలను అంతం చేసే శక్తి ఈ ఏకాత్మ దర్శనానికి ఉంది. ఈ ఐక్యతలో గొప్ప శక్తి ఉంది. ఈ ఐక్యతా దృష్టి అన్ని వివాదాలనూ అణచివేయగలదు.

VSK ANDHRA సౌజ‌న్యంతో