భారత నౌకాదళానికి ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నింపే సరికొత్త పతాకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. శుక్రవారం కొచ్చిలో ఐఎన్ఎన్ విక్రాంత్ ప్రారంభం తర్వాత ప్రధాని నౌకదళం పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు భారత నావికా దళం జెండా బానిసత్వ చిహ్నాన్ని మోసిందని, దాని స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో కొత్త దానిని తీసుకొచ్చినట్లు తెలిపారు.
భారత నావికా దళం నూతన పతాకంలో వలస పాలన బానిసత్వానికి గుర్తుగా నిలిచిన సెయింట్ జార్జి క్రాస్‌ను తొలగించి, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో నూతన పతాకాన్ని రూపొందించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో రూపొందించిన ఈ ‘నిశాన్’లో అనేక ప్రత్యేకతలున్నాయి. నౌకాదళం కొత్త చిహ్నంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో మన జాతీయ పతాకం. ఇక రెండోది నీలం, బంగారు వర్ణంలో అష్టభుజాకారంలో ఉన్న చిహ్నం. ఈ అష్టభుజాకార చిహ్నంలో రెండు రెండు స్వర్ణ వర్ణపు హద్దులు.. నీలం రంగు మధ్యలో జాతీయ చిహ్నం ఉంది. దాని కిందనే ‘సత్యమేవ జయతే’ అనే అక్షరాలను దేవనాగరి లిపిలో నీలం రంగులో రాసి ఉంటుంది. ఈ జాతీయ చిహ్నం.. నౌక లంగరు ఆకృతిపై నిల్చున్నట్లుగా ఉంది. ఈ రెండింటి కింద భారత నౌకాదళ నినాదం ‘సమ్ నో వరుణః’ అని దేవనాగరి లిపిలో బంగారు వర్ణంలో రాసి ఉంది. ‘వరుణదేవుడా మాకు అంతా శుభం కలుగుగాక’ అని దీని అర్థం. ఈ అష్టభుజాకారం నౌకాదళ బహుళ దిశల పరిధి, బహుళ కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. లంగరు చిహ్నం ‘స్థిరత్వాని’కి గుర్తుగా రూపొందించారు. నీలం రంగు నావికాదళ సామర్ధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
అష్టభుజాకారానికి ఆవృతమైన రెండు స్వర్ణ వర్ణపు హద్దులు శివాజీ మహరాజ్ రాజముద్రను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. సముద్ర జలాలు, తీరాలపై అత్యంత దార్శనికత కలిగిన భారతీయ మహారాజుల్లో శివాజీ మహరాజ్ ముందు వరుసలో నిలుస్తారు. వారి హయాంలో అత్యంత విశ్వసనీయమైన నౌకాదళాన్ని నిర్మించారు. ఇందులో 60 యుద్ధ నౌకలు, దాదాపు 5వేల మంది నావిక దళం ఉండేదని నేవీ ఓ వీడియోలో పేర్కొంది. గతంలో భారత తీర రక్షణలో ఈ దళం అత్యంత కీలకంగా పనిచేసింది. పతాకంలోని శ్వేత వర్ణం భారతీయ నౌకాదళ సాధనాసంపత్తిని ప్రతిబింబిస్తుంది.