Home News విజయదశమి ఉత్స‌వంలో ఆర్‌.ఎస్‌.ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ ఉప‌న్యాసం

విజయదశమి ఉత్స‌వంలో ఆర్‌.ఎస్‌.ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ ఉప‌న్యాసం

0
SHARE

నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి శ్రీ శంకర మహదేవన్ జీ, వేదికపై ఉన్న మా. సర్ కార్యవాహ జీ, విదర్భ ప్రాంత మా. సంఘచాలక్, నాగపూర్ మా. సంఘచాలక్, నాగపూర్ మహానగర్ మా. సహ సంఘచాలక్, ఇతర అధికారులు, పురప్రముఖులు, మాతలు, ఆత్మీయ స్వయంసేవక బంధువులారా …

దానవత్వంపై మానవత్వ విజయపు శక్తి పర్వంగా మనం ప్రతి సంవత్సరం విజయదశమి ఉత్సవాన్ని జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఈ పండుగ మనకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, గౌరవాన్ని కలిగించే అనేక సంఘటనలను తీసుకువచ్చింది.

గతేడాది మన దేశం జి 20 దేశాల సంస్థకు అధ్యక్షత వహించింది. ఏడాది పొడవునా సభ్య దేశాలకు చెందిన నేతలు, మంత్రులు, అధికారులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు, సమావేశాలు జరిగాయి. భారతీయుల ఆత్మీయ ఆతిధ్యపు అనుభూతి, భారత్ గౌరవశాలి గతం, ఉజ్వల వర్తమానం సభ్య దేశాలను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆఫ్రికా దేశాలకు శాశ్వత సభ్యత్వం కలిగించడం, సమావేశాల మొదటి రోజునే ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపచేయడం వంటివి భారత్ వ్యవహార కుశలత, ప్రపంచంలో ఉన్న గుర్తింపును మరోసారి సభ్యదేశాలకు అనుభవంలోకి తెచ్చింది. భారత్ విశుద్ధ భావన, దృష్టికోణం ప్రపంచపు ఆలోచనాధోరణికి `వసుధైవ కుటుంబకం’ అనే ఆలోచనను జోడించింది. ఇప్పటి వరకు జి 20 పరిమితమైన ఆర్ధిక సంబంధమైన ఆలోచనకు మానవ కేంద్రిత దృష్టి ఏర్పడింది. భారత్ ను ప్రపంచంలో ప్రముఖ స్థానానికి చేర్చే ముఖ్యమైన కార్యాన్ని ఈ సందర్భంగా దేశ నాయకత్వం సాధించింది.

ఈసారి ఆసియా క్రీడల పోటీల్లో మన ఆటగాళ్లు వందకు పైగా – 107 పతకాలను (28 బంగారు, 38 వెండి, 41 కాంస్య) సాధించి దేశ ప్రజలకు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించారు. వారిని అభినందిస్తున్నాం. పెరుగుతున్న భారత్ శక్తి, బుద్ధి, కౌశల్యాన్ని చంద్రయాన్ సందర్భంగా ప్రపంచం మరోసారి తెలుసుకుంది. మన శాస్త్రవేత్తల వైజ్ఞానిక శక్తి, కుశలత, నేతృత్వం కలిసి ఈ విజయాన్ని సాధించిపెట్టాయి. అంతరిక్ష రంగంలో మొదటిసారి చంద్రుని దక్షిణ ధృవంపై భారత్ కు చెందిన విక్రమ్ ల్యాండర్ దిగింది. భారతీయులందరికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచే ఈ కార్యాన్ని సాధించిన శాస్త్రవేత్తలు, వారిని ప్రోత్సహించిన నాయకత్వం అందరి మన్ననలకు పాత్రమవుతున్నది.

ఒక దేశపు లక్ష్యం, ప్రయోజనం ప్రపంచ ప్రయోజనాలను సాధించడంలో ఉపకరించే ఆ దేశపు జాతీయ ఆదర్శాలు అవుతాయి. అందువల్లనే మన రాజ్యాంగపు మూల ప్రతిలో ధర్మానికి రూపమైన శ్రీరామచంద్రుని చిత్రం ఉంది.  బాల రామునినికి అయోధ్యలో భవ్యమైన మందిరం తయారవుతోంది. జనవరి 22న శ్రీ రామ్ లలా ప్రాణప్రతిష్ట జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. భద్రత, వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు అయోధ్యలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించే అవకాశం ఉంది. శ్రీరామచంద్రుడు సత్ప్రవర్తనకు, కర్తవ్యపాలనకు, స్నేహం, కరుణలకు ప్రతీక. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట రోజున అందరూ అక్కడికే వెళ్లాలనుకోకుండా తమతమ ప్రాంతాల్లోని దేవాలయాల్లో కార్యక్రమాలు ఏర్పాటుచేసుకోవచ్చును. అయోధ్య రామమందిరంతో సమానంగా మన మనస్సులలో మందిరాలను తెరుచుకుని మన మనసులనే అయోధ్యలుగా మలుచుకోవాలి.

శతాబ్దాల తరబడి ఎదురైన సంకటాలు, బాధల నుండి బయటపడి భారత్ భౌతికంగా, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్నదనే సంకేతాన్ని ఇస్తున్న ఈ సంఘటనలన్నీ ప్రత్యక్షంగా చూడగలగడం మన అదృష్టం.

ప్రపంచానికి అహింస, భూతదయలను నేర్పిన శ్రీ మహావీర స్వామి 2550వ వర్ధంతి, 350 సంవత్సరాల సుదీర్ఘ విదేశీ పాలన నుండి ముక్తిమార్గాన్ని చూపి హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించండ‌మే కాక న్యాయపూర్ణమైన పరిపాలనను అందించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజ్యాభిషేకం జరిగి 350 సంవత్సరాలు పూర్తికావడం, ఆంగ్లేయ పాలన నుండి ముక్తి సాధించడం కోసం సంపూర్ణ సమాజంలో `స్వ’ అనే భావనను జాగృతం చేయడానికై `సత్యార్థ ప్రకాశ్’ రచించిన స్వామి దయానంద సరస్వతి 200 జయంతిని ఈ ఏడాది మనం జరుపుకున్నాము. వచ్చే ఏడాది ఇలాంటి మరో ఇద్దరు జాతీయ మహాపురుషులను స్మరించుకుంటాము. స్వాభిమానం, స్వాతంత్ర్యాలను నిలబెట్టుకునేందుకు బలిదానం చేసిన, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తులకు ప్రతీకగా నిలవడమేకాక సుపరిపాలన పేరుగాంచిన రాణి దుర్గావతి 500వ జయంతి, అలాగే సుపరిపాలన, సామాజిక వికృతులను సవరించెందుకు జీవితకాలం కృషికి పేరుపొందిన ఛత్రపతి శాహు మహరాజ్ 150వ జయంతి ఈ సంవత్సరం జరుపుకోబోతున్నాము.

ఇటీవలే తమిళ యోగి శ్రీమద్ రామలింగ వల్లలార్ 200వ జయంతిని కూడా జరుపుకున్నాము. వల్లలార్ తమ యుక్తవయస్సు నుండి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అన్నదానం ద్వారా పేదవారి ఆకలి తీర్చడం కోసం ఆయన  వెలిగించిన పొయ్యి తమిళనాడులో ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడంతోపాటు ఆయన దేశపు ఆధ్యాత్మిక, సాంస్కృతిక జాగృతికి, సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఎంతో కృషి చేశారు.

స్వాభిమానాన్ని, తన గుర్తింపును కాపాడుకోవడం మనిషి సహజ లక్షణం. అందుకు సహజంగానే ప్రయత్నిస్తాడు. నేడు ప్రపంచం కుంచించుకుపోతున్నది. దీనితో తన ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవడం ఎలాగన్నది ప్రతి దేశం ఎదుర్కొంటున్న ప్రశ్న. అయితే ప్రపంచం మొత్తాన్ని ఒకే చట్రంలో బిగించడానికి, ఒకే `రంగు’లోకి మార్చడానికి ఇప్పటివరకు జరిగిన ఏ ప్రయత్నం సఫలం కాలేదు, ఇకముందు కూడా కాదు. భారతదేశపు గుర్తింపు, హిందూ సమాజపు అస్తిత్వాన్ని పరిరక్షించాలనే ఆలోచన సహజమైనది. నేడు ప్రపంచపు అవసరాల దృష్ట్యా భారత్ తన మౌలిక విలువల ఆధారంగా కాలానుగుణమైన స్థితిలో నిలబడాలని ప్రపంచం కూడా కోరుకుంటున్నది.

మతమౌఢ్యం, అహంకారం, ఉన్మాదాల మూలంగా ప్రపంచం నేడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. స్వార్థ ప్రయోజనాల ఘర్షణ, అతివాదం కారణంగా యుక్రెయిన్ యుద్ధం, గాజా యుద్ధం జరుగుతున్నాయి. ప్రకృతి విరుద్ధమైన జీవనశైలి, విశృంఖలత్వం, అడ్డూఅదుపూ లేని భోగవాదం, కారణంగా కొత్తకొత్త శారీరిక, మానసిక సమస్యలు పుడుతున్నాయి. వికృతులు, నేరాలు పెరుగుతున్నాయి. వ్యక్తివాదం పెరిగిపోవడంవల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ప్రకృతి శోషణ వల్ల కాలుష్యం, భూతాపం పెరగడం, ఋతువుల క్రమంలో అసంతులనం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనేక సమస్యలు కల్గుతున్నాయి. తీవ్రవాదం, శోషణ, వంటివి పెరుగుతున్నాయి. బాహ్యమైన దృష్టి మాత్రమే ఉన్న పాశ్చాత్య ప్రపంచం ఈ సమస్యలకు పరిష్కారాలు చూపలేదని స్పష్టమైపోయింది. అందువల్లనే సనాతన విలువలు, సంస్కారాల ఆధారంగా భారత్ నిజమైన సుఖశాంతులను అందుకునే మార్గాన్ని ప్రపంచానికి చూపగలదు.

ప్రకృతి వైపరీత్యాల గురించి తాజా ఉదాహరణ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో కనిపించింది. హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం వరకు ప్రకృతి విపత్తులు సంభవించడం చూసాము. ఇవి భవిష్యత్తులో సంభవించే మరింత తీవ్ర పరిణామాలకు సూచనలని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశ రక్షణ, పర్యావరణ సమతుల్యత దృష్ట్యా దేశంలోని ఉత్తరం వైపున్న ఈ ప్రాంతం అత్యంత ముఖ్యమైనది. ఎల్లప్పుడూ దీని రక్షణ అత్యావశ్యకం. రక్షణ,.పర్యావరణం, జనాభా సమతుల్యత, అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రదేశాన్ని ఒక ప్రాంతంగా భావించి హిమాలయ క్షేత్రంగా ఆలోచించాలి. ప్రకృతి రమణీయ క్షేత్రమైనా, భూగర్భ శాస్త్ర దృష్ట్యా ఇప్పటికీ కొత్తగా రూపొందుతూనే ఉంది. అందుకని అస్థిరత్వం ఇంకా ఉంది. ఈ ప్రాంత భూగర్భ, భూపృష్ఠ, జీవ వైవిధ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన జరిగింది. దాని కారణంగానే ఈ ప్రాంతంతోపాటు మొత్తం దేశం సంకట స్థితి వైపు వెళుతోంది. భారత్ తో పాటు పూర్వ, దక్షిణ పూర్వ ఆసియా మొత్తానికి జలవనరులు అందించేది ఈ క్షేత్రమేనని మనందరికీ తెలుసు. ఈ క్షేత్రంలో ఉత్తర భాగంలో చైనా ఆక్రమణ ఆనవాలు చాలా కాలంగా కనపడుతున్నాయి. అందుకని ఈ ప్రాంతానికి భూగర్భ, సామాజిక, రాజకీయ విషయాల దృష్ట్యా ప్రాధాన్యత ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఇటువంటి ఘటనలు హిమాలయ ప్రాంతంలో తరచూ జరుగుతుంటే అవి దేశానికి ఒక స్పష్టమైన సంకేతంగా భావించాలి. అసంపూర్తి, భౌతికవాద, వినియోగవాద దృష్టితో కూడిన అభివృద్ధి మార్గాల వల్ల మానవజాతి, ప్రకృతి నెమ్మ‌దిగా అయినా వినాశనం వైపు వెళుతున్నాయి. ప్రపంచం మొత్తంలో ఈ ఆందోళన పెరుగుతోంది. ఆ ప్రతికూల మార్గాలను వదిలి భారతీయ మార్గాల వైపు, భారతీయ మూలాల ఆధారమైన, భారతీయ సమగ్ర ఏకాత్మ దృష్టి మీద ఆధారంగా, కాలనుగుణమైన పద్ధతిని భారత్ తయారు చేసుకోక తప్పదు. ఇది భారత్ తో పాటు ప్రపంచానికి కూడా అనుకరణీయమైనది కాగలదు. అయోగ్యమైన, అసఫలమైన మార్గంలో వెళ్ళే అంధానుకరణ ప్రవృత్తిని విడవక తప్పదు. వినియోగవాద ప్రవృత్తిని వదిలి ప్రపంచంలో ఏది సమయానుకూలమో అదే తీసుకోవాలి. మన దేశంలో ఉన్నదానిని  సమయానుగుణంగా మార్చుకుంటూ, మన స్వఆధారిత స్వదేశీ అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవాలి. దీని దృష్ట్యా కొన్ని విధానపరమైన మార్పులు గత కొన్ని రోజులలో జరిగాయని తెలుస్తోంది. సమాజంలో వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగాల రంగంలో సహకారం, కొత్త ప్రయోగాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ రంగంలో, అన్ని రంగాలలో ఆలోచనాపరులు, దిశానిర్దేశం చేసే వారిలో  మరింత జాగృతి రావలసిన అవసరం ఉంది. ప్రభుత్వంలో స్వ ఆధారిత యుగానుకూల విధానం, పరిపాలనా తత్పరత , ప్రజాభిముఖ వ్యవహారం సమాజ మన, వచన, కర్మల సహకారం, సమర్ధతే దేశాన్ని పరివర్తన దిశలో ముందుకు తీసుకెళ్తాయి.

కానీ ఇది జరగకూడదని, సమాజం చిన్నాభిన్నమై ఘర్షణలమయం కావాలని  చేసే ప్రయత్నాలు కూడా పెరుగుతున్నాయి. మన అజ్ఞానం, అవివేకం, పరస్పర విశ్వాసలోపం, అజాగ్రత్త వలన సమాజంలో ఇటువంటి ఉపద్రవాల సంఖ్య పెరుగుతూ పోతున్నట్టు కనిపిస్తోంది. భారతదేశ అభివృద్ధి లక్ష్యం విశ్వకళ్యాణమే, కానీ ఈ ఉత్థాన మార్గంలోని పరిణామాల వలన స్వార్థపూరిత, విఘటనకర, మోసపూరిత శక్తులు నియంత్రించబడతాయి. అందువల్ల ఆ శక్తుల నుండి తీవ్రమైన వ్యతిరేకత, నిరంతరమైన విరోధం ఎదురవుతూనే ఉంటుంది. ఈ శక్తులు ఏదోక సిద్ధాంతపు రంగు పులుముకున్నప్పటికీ వాటి స్వభావం అలాగే ఉంటుంది. ప్రామాణికంగా నిస్వార్థంగా పని చేసే వారికి, దేశహితాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసేవారికీ ఎల్లప్పుడూ ఇబ్బందులు తప్పవు .

ఈ మధ్య ఇలాంటి విచ్ఛిన్నవాదులు  తమను తాము సాంస్కృతిక మార్క్స్ వాదులమని చెప్పుకుంటున్నారు. దీనినే వోక్ (Woke) అనగా జాగృత జీవులుగా చెబుతున్నారు. కానీ మార్క్స్ ని వీళ్ళు 1920లోనే మరిచిపోయారు. ప్రపంచంలోని మంచి వ్యవస్థలు, శుభం, సంస్కారం, సంయమనం పట్ల వీరికి ఎల్లప్పుడూ విరోధమే.

గుప్పెడు మంది చేతుల్లో అధికారం వారి అజమాయిషీ కోసం అరాచకత్వం, విశృంఖలత్వాలను ప్రచారం చేస్తారు. ప్రసార మాధ్యమాలు, అకాడమీలను స్థావరంగా చేసుకొని దేశాలలో విద్య, సంస్కారం, రాజకీయ సామాజిక రంగాలలో భ్రమలను, భ్రష్టత్వాన్ని పెంచడమే వీరి కార్యశైలి. ఇటువంటి వాతావరణంలో అసత్యం, అభూతకల్పన ద్వారా భయం, భ్రమ, ద్వేషం సులభంగా వ్యాపిస్తాయి. పరస్పర ఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ, అసంబద్ధత , దుర్బలతల మధ్య చిక్కుకున్న సమాజం సులభంగా ఈ విధ్వంసకారుల బారిన పడుతుంది. మన పరంపరలో ఇటువంటి దేశంలోని ప్రజలలో అపనమ్మకం, దిగ్భ్రాంతి, పరస్పర ద్వేషం పుట్టించేటువంటి ప్రణాళికను మంత్ర విప్లవం అని పేర్కొన్నారు.

రాజకీయ స్వార్థం కోసం రాజకీయ ప్రత్యర్థిని ఓడించడం కోసం ఇటువంటి అవాంఛనీయ శక్తులతో చేతులు కలపడమనే అవివేకం కొందరిలో కనిపిస్తోంది. సమాజం ఎప్పటినుండో ఆత్మవిస్మృతిమయమై, అనేక రకాల భేదాలతో శిథిలమై, స్వార్థపరుల దెబ్బలు, ఈర్ష్యా ద్వేషాలతో ఇబ్బంది పడుతోంది. అందుకనే ఈ అసూరీశక్తులకు సమాజం, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే అంతర్గత, బాహ్య శక్తుల సహాయం కూడా లభిస్తోంది.

మణిపూర్ లోని ప్రస్తుత స్థితిని గమనిస్తే మనకి ఈ విషయం గుర్తుకు వస్తుంది. ఒక దశాబ్దం పాటు ప్రశాంతంగా ఉన్న మణిపూర్ లో ఉన్నట్టుండి ఈ ఘర్షణాగ్ని ఎలా రగిలింది? అల్లర్లు చేసిన వాళ్ళలో పక్క దేశపు తీవ్రవాదులు కూడా ఉన్నారా? వారి అస్తిత్వానికి సంబంధించి ఎటువంటి సందేహం లేని మణిపురి మైతేయీ, కుకీ సమాజాల మధ్యన ఈ ఘర్షణకి మతం రంగు పులిమే ప్రయత్నం ఎవరి ద్వారా జరిగింది?  కొన్ని ఏళ్లుగా అక్కడ అందరికీ సమానంగా సేవ చేసే సంఘ వంటి సంస్థలను ఇందులోకి లాగే ప్రయత్నంలో ఎవరి స్వార్థం ఉంది? ఈ సరిహద్దు ప్రాంతంలో నాగాలాండ్ , మిజోరాం లకు మధ్యలో ఉన్న మణిపూర్ లో ఇటువంటి అశాంతి నుండి లాభం పొందేందుకు ఏ విదేశీ శక్తులకు ఆసక్తి ఉండి ఉండవచ్చు? ఈ ఘటనల పరంపరలో దక్షిణ పూర్వ ఆసియాలోని భౌగోళిక రాజకీయ శక్తుల పాత్ర ఉందా? దేశంలో పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ హింస ఇన్ని రోజులు ఎటువంటి అడ్డు లేకుండా ఎవరి మద్దతుతో సాగుతోంది? గత 9 సంవత్సరాలలో ఉన్న శాంతిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ ఈ హింస ఎలా పుట్టింది? ఎలా సాగుతోంది? ఈ రోజున ఘర్షణపడుతున్న ఇరు పక్షాలూ శాంతి చర్చలకు అంగీకరించగానే, ఆ దిశగా సానుకూలంగా ముందుకు కదలగానే ఏదో ఘర్షణ పుట్టించి మళ్ళీ హింస ప్రబలిస్తున్న శక్తులు ఏవి? ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక విధాల ప్రయత్నం అవసరమౌతుంది. ఎలాగైతే రాజకీయమైన ఆలోచన, కార్యాచరణ అవసరమో, దీనితో పాటు ఈ అనుకోని పరిస్థితి వలన పుట్టిన ఆవిశ్వాసాన్ని తొలగించడానికి సమాజ నేతృత్వం కూడా విశేషమైన పాత్ర వహించాల్సి ఉంటుంది. సంఘ స్వయంసేవకులు సమాజ రంగంలో నిరంతరం సేవ, సహాయక చర్యలతో పాటు సమాజంలో సజ్జనశక్తితో కలిసి శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందర్నీ తమవారిగా భావించి , అందరికీ ఈ విషయాన్ని అర్ధం చేయించి , సురక్షితమైన , వ్యవస్థితమైన , సద్భావనతో కూడిన శాంతి కోసం సంఘ ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో కూడా శాంత చిత్తంతో అందర్నీ కలుపుకొని ముందుకు సాగే ప్రయత్నం చేసిన వారికి, స్వయంసేవకులకు అభినందనలు.

ఈ పరిస్థితికి సరైన సమాధానం సమాజ ఏకత్వంతోనే వస్తుంది. అన్ని పరిస్థితులలో ఈ ఏకత్వమే సమాజంలో వివేకాన్ని జాగృత పరిచే కీలక అంశమౌతుంది. రాజ్యాంగంలో కూడా భావ ఏకాత్మత సాధన ఒక మార్గదర్శక సూత్రంగా పేర్కొనబడింది. ప్రతి దేశంలో ఈ ఏకత్వాన్ని సాధించే మార్గాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని దేశాలలో భాష, కొన్ని దేశాలలో అందరి సమాన వ్యాపార లాభం, కొన్ని దేశాలలో ఒక సుదృఢ ప్రభుత్వం దేశాన్ని ఏకత్వంతో నడిపే సూత్రమవుతుంది. కానీ మానవ నిర్మితమైన కృత్రిమాధారాల మీద, స్వార్థం మీద ఆధారపడ్డ ఏకత్వం దృఢంగా ఉండదు. మన దేశంలో ఎంత వివిధత్వం ఉందంటే ఇదంతా ఒకే దేశం అని అర్ధం చేసుకోవడానికే జనాలకి చాలా సమయం పడుతుంది. కానీ మన దేశం ఒకే దేశంగా, ఒక సమాజంగా ప్రపంచ చరిత్రలో అనేక ఉత్థాన పతనాలు దాటి ఈనాటికీ తన ప్రాచీన సూత్రాలతో బంధాలను కొనసాగిస్తూ నిలబడింది.

ఏకత్వ పరంపర మనకి వారసత్వంగా  అందింపబడింది. దీని రహాస్యమేమిటి ? నిస్సందేహంగా అది మన సార్వజనీన సంస్కృతే. పూజా పద్దతి, భాష , జాతి వంటి భేదాలను వదిలి మన కుటుంబం నుంచి విశ్వ కుటుంబం వరకు ఆత్మీయతను పంచే మన ఆచరణ, పద్ధతే. మన పూర్వజులు జీవన ఏకత్వ సత్య సాక్షాత్కారం పొందారు. దాని ఫలంగా శరీరం, మనస్సు , బుద్ధులకు ఉన్నతిని కలిగించి సుఖాన్ని ఇచ్చి,అర్థ కామాలతో పాటు మోక్షం వైపు నడిపే ధర్మతత్వం అవగతమైంది. ఆ ధర్మం ఆధారంగా వాళ్ళు సత్యం,కరుణ,శుచి,తపస్సు అనే నాలుగు శాశ్వత గుణాలను ఆచరణలోకి తెచ్చే సంస్కృతిని వికసింపజేశారు. నలుదిక్కుల నుండి సురక్షితమైన మన మాతృభూమి , అది అందించే అన్నం,జలం,వాయువు కారణంగానే ఇది సాధ్యమైంది. అందుకే మన భారతభూమిని మన సంస్కారాలకు అధిదేవతగా కొలుస్తాము. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన మహాపురుషులను మనం 75 వ స్వాతంత్రోత్సవం సందర్భంగా స్మరించాం. ఏ మహాపురుషుల వల్ల మన ధర్మం,సంస్కృతి ,సమాజం ,దేశ రక్షణ , సమయానుకూల మార్పులు చేస్తూ దేశ వైభవ వృద్ధి జరిగిందో ఆ కర్తృత్వ సంపన్న పూర్వజులు మనందరికీ గౌరవనీయులు, అనుసరణీయులు. మన దేశంలో భాషలు, ప్రాంతాలు, పంథాలు, సాంప్రదాయాలు, జాతులు, ఉపజాతులు మొదలగు వివిధత్వాలను ఒకే సూత్రంతో కలిపి ఉంచి ఒకే దేశంగా నిలబెట్టిన మాతృభూమి పట్ల భక్తి, పూర్వజుల పట్ల గౌరవం, అందరికీ సమాన సంస్కృతి, అనే ఈ మూడు గుణాలు మన ఏకత్వానికి ఆధారభూతాలు.

సమాజంలో ఏకత్వం ప్రేమ నుండి వస్తుంది స్వార్థం నుంచి కాదు. మన సమాజం చాలా పెద్దది. చాలా వివిధత్వం నిండింది. కాలక్రమంలో కొన్ని విదేశీ ఆక్రమణలతో అనేక వికృతులు కూడా వచ్చాయి. అయినప్పటికీ మన సమాజం ఇవే మూడు గుణాల ఆధారంగా ఒకే సమాజంగా నిలబడింది. అందుకని మనం ఏకత్వం గురించి ఆలోచించినప్పుడు అది ఏదో ఒక వ్యాపార ధోరణి నుంచి రాదు. అలాగే కృతకమైన ఏకత్వం ఎక్కువకాలం నిలబడదు.  ఈనాడు కలహాలు నింపాలనే కుట్రలు చూసి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. తమను తాము హిందువులుగా చెప్పుకునే వాళ్ళు , పూజ పద్ధతి కారణంగా ముస్లిములు గా, క్రైస్తవులు గా గుర్తింపబడవాళ్ళు కూడా కలుస్తున్నారు. ఈ చర్చలలో గుర్తుపెట్టుకోవాలసిన అంశం మనం సమాన పూర్వజుల వారసులం, ఒకే మాతృభూమి సంతానం, ఒకే సంస్కృతి వాసులం, పరస్పరం సమానం. ఈ  భావనను మరిచాము. ఆ మూల భావనను అర్ధంచేసుకొని దాని ఆధారంగా మళ్ళీ కలవాలి.

మన మధ్య ఎటువంటి సమస్యలూ లేవా? అభివృద్ధి కోసం మనలో మనకి పోటీ లేదా ? మనలో అందరం మనసా వాచా కర్మణా ఈ ఏకాత్మ సూత్రాలను అనుసరించి వ్యవహరిస్తున్నామా? మనదరికి తెలుసు అంతటా ఈ పరిస్థితి లేదు. కానీ ఇలా ఉండాలి అంటే ముందు సమస్యలు తొలగాలి, ప్రశ్నలకి సమాధానాలు లభించాలి, అప్పుడు ఏకత్వం గురించి ఆలోచిస్తామంటే కుదరదు. మనం మనది అనే ఆలోచన ప్రారంభం చేసి జీవిస్తే అందులోంచి ఈ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఒకచోట వచ్చిన ఘర్షణల వల్ల చలించకుండా. శాంతి, నియంత్రణ కోల్పోకుండా పని చేయాలి. సమస్యలు ఉన్న మాట వాస్తవం కానీ అవి కేవలం ఒక వర్గం లేదా జాతికి మాత్రమే చెందినవి కాదు. వాటిని పరిష్కరిస్తూనే ఆత్మీయత ,ఏకత్వం కలిగిన మానసిక స్థితిని పెంపొందించుకోవాలి. బాధిత మనస్తత్వం , పరస్పర అవిశ్వాసంతోనే చూడడం, రాజకీయ ప్రతిష్ట వంటి వాటి నుంచి పక్కకు వచ్చి కదలాలి. ఇటువంటి పనులలో రాజకీయం నష్టకారిగానే పనిచేస్తుంది. ఇదేమి శరణాగతి కాదూ లేదా బలవంతం కాదు. యుద్ధం చేస్తున్న ఇరుపక్షాల అస్త్ర సన్యాసం కూడా కాదు. భారత్ లోని వివిధత్వం మధ్య ప్రకటితమవుతున్న  ఏకత్వ సూత్రం నుంచి వచ్చిన అనుబంధం ఇచ్చిన పిలుపు ఇది. మన స్వాతంత్ర్య భారత రాజ్యాంగానికి కూడా 75 ఏళ్లు నడుస్తున్నాయి. ఆ రాజ్యాంగం మనకి ఈ దిశను అందిస్తుంది. పూ. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చేసిన రెండు ప్రసంగాలు గమనిస్తే మనకు ఈ విషయం అర్ధం అవుతుంది.

ఇది ఒక్క రోజులో సాధించగలిగే పని కాదు. సామూహిక మనస్తత్వంలో పాత సంఘర్షణల చేదు జ్ఞాపకాలు చిమ్ముతూనే ఉన్నాయి. భారతదేశ విభజన గాయాలు ఇప్ప‌టికీ వెంటాడుతున్నాయి. ఆ భయంకరమైన విభజనపై ‘చర్యలు, ప్రతిచర్యల’ సంఘటనల కారణంగా మనస్సులలో ఏర్పడిన ఆగ్రహం తరచుగా మాటలు, ప్రవర్తనలో వ్యక్తమవుతుంది. ఒకరికొకరు ఉన్న ప్రాంతాల్లో ఇల్లు పొందలేకపోవడం, పరస్పర ధిక్కారంతో వ్యవహరించడం వంటి చేదు అనుభవాలున్నాయి. హింస, అల్లర్లు, వేధింపులు మొదలైన సంఘటనలపై నిందలు వేయ‌డం జ‌రుగుతుంది. ఒక వ్యక్తి దుష్కార్యాలు మొత్తం సమాజం యొక్క దుష్ప్రవర్తనగా వివరించబడతాయి, చిత్రీకరించబడతాయి, ఆపై మాటల యుద్ధం జరుగుతుంది. మనలో మనకి ఘర్షణ పెట్టి ప్రయోజనం పొందే శక్తులు దీని నుంచి పూర్తి లాభాన్ని పొందుతాయి. చూస్తూ చూస్తూనే చిన్న ఘటనను పెద్దది చేసి ప్రచారం చేస్తారు. దేశ విదేశాల్లో ఆందోళన వ్యక్తం చేసే , ప్రమాద సూచనలు చేసే మాటలు ప్రచారమవుతాయి. హింసను ప్రేరేపించే “టూల్ కిట్స్” సక్రియమై పరస్పరం అవిశ్వాసం, ద్వేషం మరింత పెంచుతాయి.

సమాజంలో సామరస్యం కోరుకునే వాళ్ళందరూ ఈ కుట్రల జాలం నుంచి జాగురుకులై ఉండాలి. ఈ సమస్యలన్నింటి పరిష్కారం నెమ్మదిగానే వస్తుంది. దీని కోసం దేశంలో విశ్వాసం, సౌహాద్ర వాతావరణం అవసరం. మన మనస్సుని స్థిరంగా ఉంచి విశ్వాసంతో పరస్పర అనుబంధం పెరగడానికి, పరస్పర అంగీకారం పెరగడానికి, అందరి మధ్య అనుబంధం పెరగడానికి మనసా వాచా కర్మణా పని చేయాలి. ప్రచారాల మీద కాక వాస్తవికత ఆధారంగా పని చేయాలి. ధైర్యం, నియంత్రణ, సహనశీలతతో, మన వాక్కు , పనిలో తీవ్రత, క్రోధం లేదా భయం వదిలి దృఢత్వంతో , సంకల్పబద్ధులమై, ఎక్కువ కాలంపాటు నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. సత్సంకల్పాలు అప్పుడే ఫలిస్తాయి.

ఎట్టి పరిస్థితులలో ఎటువంటి రెచ్చగొట్టే పరిస్థితి ఉన్నప్పటికీ నాగరిక అనుశాసనం, న్యాయవ్యవస్థ ,రాజ్యాంగానికి లోబడి మాత్రమే వ్యవహరించాలి. స్వాతంత్ర్య దేశంలో ఇటువంటి వ్యవహారమే దేశభక్తిగా గుర్తింపబడుతుంది. ప్రచార మాధ్యమాలను ఉపయోగించి చేసే దుష్ప్రచారాలు, వాటి ఫలితంగా వచ్చే ప్రత్యారోపణల గొడవలో పడకుండా, వాటిని సమాజంలో సత్యం ఆత్మీయత ప్రచారం చేయడానికి ఉపయోగించాలి. హింస,ఆక్రమణలకు సంఘటితమైన సమాజ న్యాయ రక్షణలో ప్రభుత్వాలకు సహకారం అందించాలి.

రాబోయే సంవత్సరం 2024 ప్రారంభ రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల హామీలలో భావనలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం సరైంది కాదు, కానీ జరుగుతూంటుంది. సమాజాన్ని విభజించే ఈ మాటల నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓటు వేయడం ప్రతి నాగరికుడి కర్తవ్యం. దాన్ని తప్పక నిర్వర్తించాలి. దేశ ఏకాత్మత, అఖండత , వైభవం, అభివృద్ధి అనే విషయాలను ఆలోచించి ఓటు వేయాలి.

2025 నుండి 2026కు సంఘ శ‌తాబ్ధి ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. పైన చెప్పిన అన్నీ విషయాల పట్ల సంఘ స్వయంసేవకులు ముందుకు కదలడానికి సిద్ధమవుతున్నారు. సమాజ ఆచరణలో, వాక్కులో సంపూర్ణ సమాజం, దేశం పట్ల అనుబంధ భావన ప్రకటితమవ్వాలి. గుడి, నీరు, శ్మశానం విషయంలో ఇంకెక్కడైనా భేదాలు ఉంటే అవి సమాప్తమవ్వాలి. కుటుంబంలో అందరిలో నిత్యమూ మంచి వ్యవహారం, సంవేదనా శీలత కలిగి ఉండాలి, పెరగాలి. దాని ద్వారా సమాజ సేవ జరుగుతూ ఉండాలి. నీటి పొదుపు, ప్లాస్టిక్ వాడకపోవడం, ఇంటి పరిసరాలలో పచ్చదనం పెరగాలి. స్వదేశీ ఆచరణలో స్వ నిర్భరత, స్వావలంబన పెరగాలి. దూబరాఖర్చులు తగ్గాలి. దేశంలో ఉద్యోగాలు పెరగాలి. దేశంలోని ధనం దేశానికి ఉపయోగపడాలి. ఇందుకోసం స్వదేశీ ఆచరణ ఇంటి నుంచే ప్రారంభమవ్వాలి. న్యాయ వ్యవస్థ , నాగరికత నియమాల పాలన జరగాలి. సమాజంలో పరస్పర అనుబంధం సహకార ప్రవృత్తి సర్వత్ర వ్యాపించాలి. ఈ 5 ఆచరణాత్మక విషయాలు జరగాలని అందరూ అనుకుంటారు. కానీ చిన్న వాటి నుంచి మొదలు పెట్టి వీటిని ఆచరణలోకి తెచ్చే నిరంతర ప్రయత్నం అవసరం. సంఘ స్వయంసేవకులు రాబోయే రోజుల్లో సేవతో పాటు ఈ 5 విషయాలను పాటిస్తూ సమాజం కూడా పాటించే విధంగా ప్రయత్నం చేస్తారు. సమాజహితంలో ప్రభుత్వం, సజ్జనశక్తి ఏమి చేస్తున్నారో చేయదలుచుకున్నారో వాటిలో సంఘ స్వయంసేవకుల యోగాధానం తదనుగుణంగా ఉంటూనే ఉంటుంది. సమాజ ఏకత్వం, నిస్వార్థ ప్రయత్నం, జనహిత ప్రభుత్వం జనోన్ముఖ వ్యవస్థ స్వ అధిష్ఠానం మీద నిలబడ్డ పరస్పర సహాయకారి ప్రయత్నాలు ఎక్కడ ఉంటాయో, అప్పుడే దేశ బలం వైభవ సంపన్నమవుతుంది. బల, వైభవ సంపన్నమైన దేశం వద్ద మన సంస్కృతి వంటి అందర్నీ కుటుంబంగా భావించే, తపస్సుతో వెలుగు వైపు నడిపే, అసత్యం నుంచి సత్యం వైపు తీసుకెళ్ళే, మృతప్రాయమైన జీవనం నుండి సార్ధకమైన అమృత జీవనం వైపు తీసుకెళ్ళే సంస్కృతి ఉంటుందో, అప్పడే దేశం, విశ్వం కోల్పోయిన సమతుల్యతను తిరిగి తెస్తూ ప్రపంచానికి సుఖశాంతులతో కూడిన జీవనాన్ని అందిస్తుంది. ప్రస్తుత కాలంలో మన దేశ నవోథ్థాన ప్రయోజనం ఇదే.