Home News ధార్మిక గ్రంథాలు, ఇతిహాసాల వక్రీకరణకు వెయ్యేళ్ల క్రితమే పునాది! 

ధార్మిక గ్రంథాలు, ఇతిహాసాల వక్రీకరణకు వెయ్యేళ్ల క్రితమే పునాది! 

0
SHARE
సంవిత్ ప్రకాశన్ నూతనంగా ప్రచురించిన మహేతిహాసం, చార్వాకం – ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ డిసెంబర్ 3న భాగ్యనగరంలోని నాగోల్ ప్రాంతం సాయినగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ వారి వయోవృద్ధుల సేవా కేంద్రంలో ఘనంగా జరిగింది. పుస్తక ప్రియులు, సాహితీ అభిమానులు, రచయితలు, పరిశోధకులు ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ వెంకటాచల ఫణి గారు మాట్లాడుతూ, మహేతిహాసం, చార్వాకం –  ఈ రెండు పుస్తకాలు పరస్పర విరుద్ధమైన అంశాలని, ఒకటి మహాభారతానికి సంబంధించినదైతే మరొకటి చార్వాకం అనే చాదస్తానికి సంబంధించినది అన్నారు. నేడు మన సంస్కృతీ సాంప్రదాయాలపై కుట్రపూరితంగా జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలంటే ప్రతిఒక్కరూ MBBS చదవాలని.. అనగా  మహాభారతం(M), భాగవతం(B), భగవద్గీత(B), శ్రీరామయణం(S) – ఈ నాలుగు గ్రంథాలపై పట్టు సాధించాలని అన్నారు.

ఈ సందర్భంగా సమాజానికి ఉపయోగపడే అనేక పుస్తకాలను ప్రచురించే కార్యానికి శ్రీకారం చుట్టిన సంవిత్ ప్రకాశన్ వారి కృషిని కొనియాడారు. సంవిత్ అంటే విజ్ఞానం అని అర్ధమనీ తెలుపుతూ, జ్ఞానం, విజ్ఞానం మధ్య తేడా వివరించారు. జ్ఞానం థియరీ అయితే, దాన్ని తెలుసుకుని ఆచరణలో పెట్టడం విజ్ఞానం అన్నారు. జ్ఞానం లైబ్రరీలో ఉంటుంది. దాన్ని సాధన చేసి అనుభవంలోకి తీసుకువచ్చే మహత్తరమైన పనిని సంవిత్ ప్రకాశన్ చెప్పట్టడం చాలా ఆనందకరమైన విషయం అని ప్రశంసించారు.

ఇతిహాసాలు మన సంస్కృతిక సంపద అని, అలాంటి ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతాన్ని మన తెలుగు సినిమాలు పూర్తిగా వక్రీకరించాయని ఆవేదన వ్యక్తం చేశారు . నిజానికి తెలుగువారు తమ నిత్య, దైనందిన జీవితంలో మాట్లాడుకునే మాటల్లో మహాభారత ఘట్టాలు, పాత్రలు ఎక్కువగా పలుకుతుంటారని, అలాగే తెలుగువారి సామెతల్లో ఎక్కువభాగం మహాభారతం నుండే పుట్టాయని అన్నారు. ఇంతలా మహాభారతం తెలుగువారిలో నరనరాన జీర్ణించుకుపోయిందని చెప్తూ, భారతాన్ని తెలుగీకరించిన నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱాప్రగడలతో కూడిన కవిత్రయాన్ని జ్ఞాపకం చేశారు.

వ్యాసమహర్షి సంస్కృతంలో వ్రాసిన మహాభారతం మూల గ్రంథం తెలుగులో మహాకావ్యాలుగా అనువదించబడ్డాయి. బహుశా తెలుగులో ఉన్నంత సుసంపన్నమైన, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలు మరే భాషలోనూ లేవు. మహాభారతం ఇతివృత్తంతో వచ్చిన పద్య, గద్య, నాటకాలు, కావ్యాలు, నవలలు, అవధానాలు, ఇలా ఎన్నో అంశాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి, ప్రజాదరణ పొందాయి. రంగస్థల నాటకాల నుండి మహాభారత ఇతిహాసం తెలుగు సినిమా తెరపైకి వచ్చింది. దీంతో దుర్యోధనుడు, కర్ణుడు వంటి ప్రతికూల పాత్రలను సూచించడంలో కొన్ని విచలనాలు జరిగాయి.  కొన్ని సినిమాల్లో వీరోచిత పాత్రలుగా చిత్రీకరించారు. భారతంలోని గొప్ప విషయాలు, పాత్రలను ఎలా వక్రీకరించారు అనేవి ఈ పుస్తకం వివరిస్తుందని అన్నారు.

యావత్ ప్రపంచం ధర్మం మీదనే నడుస్తోంది. ఈ ధర్మానికి ఎలా ఆచరించాలి తెలిపే ధర్మసూక్ష్మాలు మనకు మహాభారతం అందిస్తుందని వేంకటాచల ఫణి అన్నారు. అదే విధంగా దుర్మార్గులతో ఎలా వ్యవహరించాలో కూడా మహాభారతం వివరిస్తుందని అన్నారు. ధర్మం గురించి తెలుసుకుని ఏం చేయాలనే ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది, అందుకు సమాధానం – ధర్మమే అన్నిటికీ మూలం, ఆ ధర్మాన్ని పాటిస్తూ, ప్రచారం చేయడాన్ని మనం అలవాటు చేసుకోవాలి, అప్పుడే సమాజం శాంతియుతంగా మనగలుగుతుంది అన్నారు. మన మనస్సు యొక్క శక్తితో మనల్ని మనమే ఉద్దరించుకోవాలని, అదే మనసు చెప్పే తప్పుడు మాటలు విని పతనమైపోకూడదని అన్నారు. ఎందుకంటే మన మనస్సే మన మిత్రుడు, శత్రువు కూడా మనస్సే అని చెప్తూ దీనికి ఆధారమైన భగవద్గీత ధ్యానయోగంలోని శ్రీకృష్ణడు ఈ క్రింది విధంగా చెప్పిన 5వ శ్లోకాన్ని వివరించారు.

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।।
సుప్రసిద్ధ పరిశోధకులు, రచయిత,  10కి పైగా ఉత్తమ పరిశోధనాత్మక పుస్తకాలను అందించిన శ్రీ ఖండవల్లి సత్యదేవ్ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ, తాను విడుదల చేస్తున్న రెండు పుస్తకాలు మహేతిసహం, చార్వాకం, ఒకదానికొకటి వ్యతిరేక ధ్రువాలు అని పేర్కొన్నారు. మహా ఇతిహాసం లేదా మహేతిహాసం అంటే మహర్షి వేదవ్యాస మహాభారతం లక్ష శ్లోకాలతో కూడిన గొప్ప రచన అని, ఇది మనకు ధర్మాన్ని అనుసరించి, ఆచరించాల్సిందిగా బోధిస్తుందని అన్నారు. నాలుగు పురుషార్థాలలో, ధర్మం ప్రధానమైనదని, ధర్మమార్గంలో సాధించిన అర్ధంతో కోరికలు తీర్చుకుంటేనే మోక్షమనే నాలువగ పురుషార్ధాన్ని సాధించగలమని అన్నారు. ధర్మాన్ని విస్మరిస్తే ఏం జరుగుతుందో ప్రస్తుత సమాజ సమస్యలను చూస్తే తెలుస్తుందని అన్నారు. మహాభారతాన్ని,  దాని ధర్మబోధలను అర్థం చేసుకోవడం మనకు అత్యవసరం.
మన ఋషులు ఎప్పుడూ మనకు దైవీ గుణాల గురించే వర్ణించి నేర్పించారు. మన గ్రంథాలన్నీ కూడా దైవీ గుణాల గురించే మనకు చెప్తాయి. అందుకే మన సంస్కృతి ఇప్పటికీ మనగలుగుతోంది. కానీ పరిస్థితి మారుతోంది. కలి ప్రభావంతో ధర్మం యొక్క ప్రభావం తగ్గుతూ, అధర్మం రాజ్యమేలుతున్న పరిస్థితి వచ్చింది. ఈ  స్థితిలో వాటి మధ్య బేధాలను, అరిషడవర్గాలను మనం తెలుసుకోవాలి.  కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య ఆధిపత్యం మొదలైంది. ఇందులో భాగంగానే ఈ అరిషడ్వర్గాలనే పునాదులుగా చేసుకున్న మూడు మతాలు కూడా ఆవిర్భవించాయి. వాటిలో ఒకటి శాంతి మతంగా, మరొకటి ప్రేమ మతంగా చెలామణి అవుతూ దేశానికి హాని చేస్తున్నాయి. ఆ మూడో మతమే చార్వాకం. ఆ మతాల్లో దైవీగుణ సంపద ఏమాత్రం లేదన్న విషయాన్ని చార్వాకం పుస్తక రచయిత అరిందమ నిరూపించారని అన్నారు. అసలు ఏమిటీ చార్వాకం తెలుసుకోవాలని సూచించారు.
చార్వాకం అనేది ధర్మానికి పూర్తి విరుద్ధమైన సిద్ధాంతం అని, సామాజిక నియమాలు, నైతిక విలువలకు ఏమాత్రం సంబంధం లేకుండా అమితమైన ఆనందాలను అనుభవించేలా మనిషికి దుష్టప్రేరణ కలిగిస్తుందని అన్నారు. అయితే  సామాజిక నియమాలు, నైతిక విలువలను విచ్ఛిన్నం చేయకుండా మానవ ఆనందాన్ని ఎలా సమతుల్యం చేయాలో ప్రాచీన భారతీయ సమాజానికి తెలుసునని,  అందువల్ల, సహజప్రక్రియలో, చార్వాకాన్ని దర్శనం లేదా తత్వశాస్త్రంగానూ, చార్వాకుడిని సిద్ధాంతకర్తగా పరిగణించినప్పటికీ, సమాజం ఈ చార్వాక సిద్ధాంతాన్ని విస్మరించిందని అన్నారు.
చార్వాకం అనేది నాస్తిక దర్శనాల క్రింద లెక్కించబడుతుంది. అరిషడ్వర్గాలుగా చెప్పుకునే ఆరు దుష్ట గుణాలు, చార్వాక సిద్ధాంతాలపై ఆధిపత్యం చెలాయించాయి, విదేశీ అబ్రహమిక్ మతాలు కూడా ఇలాంటి సిద్ధాంతాలను ప్రతిపాదిస్తాయి.  మనము విదేశీ మత సిద్ధాంతాల ప్రమాదాన్ని కనీసం గుర్తించడానికి కూడా ఒప్పుకోలేని దుఃస్థితిలో ఉన్నామని అన్నారు. అందుకు ఉదాహరణగా, ప్రమాదం ఎదురవ్వగానే తన తల భాగాన్ని మాత్రం ఇసుకలో పాతిపెట్టుకుని ఏమీ జరగట్లేదు అనుకునే ఉష్ట్రపక్షిని గుర్తుచేశారు. శుక్రనీతిలో చెప్పబడిన ‘అటటాయి’ అనే సంఘవిద్రోహ లక్షణాలను ఈ క్రింది శ్లోకం ద్వారా  గుర్తుచేశారు.
అగ్నిదహః గర్దశ్చైవ శస్త్రపాణిర్ధనాపః | 
క్షేత్రదారహరశ్చైవ షడేతే ఆతతాయినః || 
ఆతతాయిలు అనగా, దుండగులు, తీవ్రవాదులు, దోపిడీదారులు, ఇల్లు తగలపెట్టేవారు, విషప్రయోగలు చేసేవారు, ఆయుధాలతో సంచరిస్తూ దాడులు చేసేవారు, దోపిడీలు చేసేవారు, పరుల స్త్రీలను కైవసం చేసుకుని అనుభవించేవారు ఆతతాయిలని, ఇటువంటి వారిని ఎలా నాశనం చేయాలో భగవాన్కు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ద్వారా సూచించాడని అన్నారు.
ధర్మాన్ని దేశకాల పరిస్థితులకు అన్వయించుకుంటూ, ఈ కాలంలో మనం యుద్ధం ఆయుధాలతో కాకుండా, మనసు బుద్ధితో చేయాలని అన్నారు. యుద్ధం చేయమని కృష్ణుడే చెప్పాడు. మనం బుద్ధితో చేసే యుద్ధం ద్వారా సమాజానికి ఆయుధాలతో జరిగే నష్టాన్ని ఆపగలమని చెప్పారు. మన దేశం, నగరం భద్రంగా ఉంటేనే మనం, మన ఇల్లు, మన కుటుంబం భద్రంగా ఉంటాయని, దేశరక్షణ విషయంలో తీరిక దొరకట్లేదనే సాకులు చెప్పరాదని హితవు పలుకుతూ, కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఆయుధాలు చేపట్టి పోరాటం చేసిన వయోవృద్ధుడైన భీష్ముడిని ఉదహరించారు.
గ్రంథాల వక్రీకరణకు పునాది వెయ్యేళ్ళ క్రితమే!
తన ప్రసంగంలో ధార్మిక గ్రంథాలు, ఇతిహాసాల వక్రీకరణ అంశాలను స్పృశించిన రచయిత శ్రీ ఖండవల్లి సత్యదేవప్రసాద్, ఈ వక్రీకరణకు వెయ్యేళ్ళ క్రితమే పునాది పడిన విషయాన్ని వివరించారు.  దురదృష్టవశాత్తు తెలుగు సినిమాలు భారతంలోని కర్ణుడు, దుర్యోధనుడు వంటి ప్రతికూల, అధార్మిక పాత్రలను వీరులుగా, శూరులుగా, గొప్పవారిగా చిత్రీకరిస్తన్నాయని, అయితే అలాంటి వక్రీకరణలకు నాందిపలికిన వారిలో ముఖ్యమైన వ్యక్తి పంపడు అనే కవి అని, వైదిక బ్రాహ్మణుడైన పంపడు జైనుడిగా మారాడని తెలిపారు. కన్నడ ఆదికవిగా పేరుగాంచిన పంపడు కన్నడంలో జైన భారతం లేదా పంప మహాభారతం రాసి, కర్ణ, దుర్యోధనాదులను ఘనంగా కీర్తించాడని, ప్రస్తుతం మనం గమనిస్తున్న అనేక వక్రీకరణలకు మూలగ్రంథంగా దాన్ని చెప్పవచ్చు అన్నారు. అప్పట్లో జైనులు సనాతన ధర్మాన్ని రూపుమాపేందుకు అనేక ప్రయత్నాలు చేసేవారని, అందులో భాగంగా గ్రంథాలను వక్రీకరించి, ఆ గ్రంథాల పట్ల మనకున్న గౌరవం పోగొట్టి, చివరికి జైనంలోకి మారేలా ప్రయత్నాలు చేసేవారని తెలిపారు. అలాంటి ప్రయత్నమే పంపడు కూడా చేసాడని తెలిపారు.
భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో మార్పులేనిది ధర్మం. ధర్మం ఆధారంగా ఆచరించడానికి వీలుగా ధర్మసూక్ష్మాలు రూపొందుతాయని అన్నారు. ధర్మం మారదు, కానీ కాలమాన పరిస్థితుల బట్టి, దేశకాల పాత్రలను బట్టి ధర్మం సూక్ష్మాలు మారుతాయని, ధర్మ సూక్ష్మాలు ఎలా నిర్ణయమవుతాయి అనే విషయాన్ని  మహాభారతం ఏవిధంగా చెప్తుందో మహేతిహాసం పుస్తకం విస్తరిస్తుందని అన్నారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సంవిత్ ప్రకాశన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జి. శైలజ గారు తన ప్రసంగంలో, గత మూడు సంవత్సరాలలో సంవిత్ ప్రకాశన్ అందించిన ప్రచురణల సంక్షిప్త సమాచారాన్ని అందించారు. దక్షిణాపథ అధ్యయనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ కళ్యాణ్ చక్రవర్తి సంస్థ కార్యకలాపాల గురించి వివరించారు. కార్యక్రమం చివరిలో శ్రీ సాయినగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ వారు పుస్తక రచయిత శ్రీ ఖండవల్లి సత్యదేవప్రసాద్, కార్యక్రమ ముఖ్య అతిధి కన్నెగంటి వేంకటాచల ఫణి మరియు సంవిత్ ప్రకాశన్ ప్రచురణల సంస్థ డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.