Home News వీర సావర్కర్ సహచరుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడు: వరహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ 

వీర సావర్కర్ సహచరుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడు: వరహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ 

0
SHARE
  • ఆకారపు కేశవరాజు

వరహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ (2 ఏప్రిల్ 1881 – 3 జూన్ 1925), VVS అయ్యర్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమిళనాడుకు చెందిన విప్లవకారుడు. తన రచనల ద్వారా ప్రజలలో ధైర్యం, పరాక్రమాన్ని నింపిన వ్యక్తి. అతని సమకాలీనులలో సుబ్రమణ్య భారతి, ‘వావూసి చిదంబరం పిళ్లై’ ఉన్నారు.

VVS అయ్యర్ 1902లో మద్రాసులో ప్లీడర్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత తిరుచ్చి జిల్లా కోర్టులో ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేశారు. 1906లో అతను రంగూన్‌కు, బర్మాలో ఉన్న అనేకమంది తమిళ వ్యాపారవేత్తలతో కలిసి బర్మా కు వెళ్లాడు. అక్కడి ఇంగ్లీష్ బారిస్టర్ ఛాంబర్స్‌లో జూనియర్‌గా ప్రాక్టీస్ చేశాడు. రంగూన్ నుండి అతను 1907లో లండన్‌కు వెళ్లి న్యాయవాదిగా ప్రాక్టీసు చేయాలనే ఉద్దేశ్యంతో లింకన్స్ ఇన్‌లో చేరాడు. ఇంగ్లీషు సంగీతాన్ని అభ్యసించడంతోపాటు ఇంగ్లీషు నాట్యం కూడా నేర్చుకోవాలనేది అప్పట్లో ఆయన ఉద్దేశ్యం. అయితే, “వినాయక్ దామోదర్ సావర్కర్‌తో పరిచయం ఏర్పడటంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది”. అతను ఇండియన్ హోమ్ రూల్ లీగ్‌ను నిర్వహించడంలో, భారతదేశ విముక్తి కోసం సాయుధ తిరుగుబాటుకు శిక్షణ ఇవ్వడంలో సావర్కర్‌కు కుడి భుజమయ్యారు.

బ్రిటీష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాద సంస్థలలో చేరి, 1910లో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని సవాలుచేసి పడగొట్టడానికి లండన్, పారిస్‌లలో జరిగిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నందుకు అతనిని అరెస్టు చేయడానికి ఆదేశించింది. దీనితో ‘ఐర్ లింకన్ ఇన్‌’ కు రాజీనామా చేసి పారిస్‌ వెళ్ళాడు. రాజకీయ ప్రవాసంలో పారిస్‌లో ఉండాలనుకున్నప్పటికీ, అతను భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. అరెస్టు నుండి తప్పించుకోవడానికి అయ్యర్ 4 డిసెంబర్ 1910న ముస్లిం వేషధారణలో పాండిచ్చేరిలోకి ప్రవేశించాడు. అయ్యర్ పదేళ్లకు పైగా పాండిచ్చేరిలోనే ఉన్నారు. పాండిచ్చేరిలో ఉన్నప్పుడు, అయ్యర్ తోటి విప్లవకారులైన సుబ్రమణ్య భారతి, అరబిందోలను కలిశారు. దేశ విముక్తి కోసం ఎన్నో పథకాలను, ఉద్దండులైన ఎంతోమంది విప్లవకారులను తయారు చేశారు. విప్లవకారులైన అతని శిష్యులలో ఒకరైన “వాంజినాథన్”. తిరునెల్వేలి కలెక్టర్‌గా ఉన్న యాష్‌ని చంపివేసాడు.

ఆ విధంగా ఎన్నో రకాలుగా భారతమాతను విముక్తిని చేయడానికి చేసిన ప్రయత్నాలు ఎన్నో సఫలమయ్యాయి మరెన్నో విఫలమయ్యాయి. ఈ క్రమంలో అయ్యర్, అతని మిత్రుడు సుబ్రమణ్య భారతిని ఆంగ్లేయులు మరిన్ని కష్టాల పాలు చేశారు. పాండిచ్చేరిలో తన కూతుర్ని రక్షించే క్రమంలో తాను ఒక జలపాతంలో కొట్టుకుపోయాడని, ఆ విధంగా తనువు చాలించాడని చరిత్ర. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఎదుర్కొని దేశమాత బంధనాలను ఛేదించడానికి జీవితాంతం కృషిచేసిన మహనీయులు ఎప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయం.