హెడ్గేవార్ గారు కలకత్తాకు వస్తూనే అనుశీలన సమితితో సంబంధ మేర్పరచుకొన్నారు. త్రైలోక్యనాథ్ చక్రవర్తి ఇలా వ్రాశారు : “హెడ్గేవార్ నేషనల్ మెడికల్ కాలేజి విద్యార్థిగా ఉండగా బెంగాల్లో రచించిన ప్రసిద్ధ గ్రంథం “బంగలార్ విప్లవవాద్” గ్రంథకర్త అయిన నలిని కిశోర్ గుహ కూడా అక్కడే చదువుతూ ఉండేవారు. హెడ్గేవార్ , నారాయణరావ్ సావర్కర్ లకు మరికొందరికి సమితిలో ప్రవేశమిప్పించినది శ్రీ గుహగారే . ” ( Thirty Years in Prison by Trilokyanath Chakravarty Alpha Beta Publication , Calcutta- 1963 , Pages 277-278 )
హెడ్గేవార్ గారు అతి తక్కువ కాలంలోనే సమితిలో విశ్వసనీయ స్థానాన్ని సంపాదించుకొన్నారు. క్రమక్రమంగా ఆయన వసతిగృహం విప్లవోద్యమ కార్యకలాపాలకు కేంద్రబిందువుగా రూపొందింది. అజ్ఞాతవాసం గడుపుతూ ఉండిన శ్యామసుందరచక్రవర్తి అప్పుడప్పుడూ అక్కడికి వస్తూ ఉండేవాడు. నళినీ కిశోర్ గుహతో సహా అనేకమంది విప్లవకారులు రాత్రి బసచేయడానికి, ఆయుధాలను తాత్కాలికంగా దాగుకొనడానికి, దాచిపెట్టడానికి ఈ వసతిగృహం ఉపయోగపడుతూ వచ్చింది.
నళినీ కిశోర్ గుహ వారి పాత్రను వివరించుతూ ఇలా వ్రాస్తారు : క్రాంతికారి, సమితి” హెడ్గేవార్ నిజమైన అర్థంలో ఆదర్శమూర్తి సభ్యులలో నిర్మాణాత్మకమైన ఆలోచనలు ముందుంచటంలో, పనులను నిర్వహించటం లో అతనికి అతనే సాటి.” విప్లవకారుల బృందంలో హెడ్గేవార్ రహస్యసంకేతనామం ‘ కొకేన్.’ అలాగే ఆయుధాలను గురించి”-ప్రస్తావించవలసి వచ్చినపుడు ‘అనాటమీ’ శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉండేవారు . సమితిలోని అంతర్గత విషయాలను ఎప్పటికీ , ఎవ్వరికీ తెలియనీయమని సమితి సభ్యులు ప్రతిజ్ఞ చేసేవారు . చాలా విషయాలు ఈ కారణంగా వెలుగుచూడకుండా ఉండిపోయాయి . హెడ్గేవార్ కు సమితిలో ఉన్న పాత్ర ఏమిటి అన్న విషయమై కచ్చితమైన ఆధారాలతో కూడిన సమాచారం లభించటం లేదు . అయితే ఆ సమితిలో సంబంధమున్న ప్రతి ప్రముఖ విప్లవకారుడూ కూడా హెడ్గేవార్ పట్ల ఉన్నతమైన , సమ్మానీయమైన భావం ప్రకటిస్తూ ఉండేవారు. 24 సంవత్సరాలపాటు కారాగృహవాసంచేసిన జోగేశ్చంద్రచటర్జీ కూడా తాను రచించిన పుస్తకంలో హెడ్గేవార్ వహించిన ప్రముఖపాత్రను ప్రస్తుతించాడు. ( In search of Freedom page – 27 )
హెడ్గేవార్ గారు బెంగాలుకు, మధ్యప్రాంతాలకు చెందిన విప్లవకారుల మధ్య , వారి కార్యకలాపాల సమన్వయంలో ఒక సంధానం కర్తగా వ్యవహరిస్తూండేవారు. 1910 నుండి 1915 వరకు బెంగాలునుండి మధ్యప్రాంతాలకు పిస్తోళ్ళు , ఇతర ఆయుధాలు తగినంత సంఖ్యలో పంపబడ్డాయి . హెడ్గేవార్ నాగపుర్ వచ్చినప్పుడల్లా ఏవో ఆయుధాలను రహస్యంగా దాచి తనతోపాటు తెస్తూ ఉండేవారు. (‘పీ.సీ. ఖాన్ ఖోజేయాంచా చరిత్ర’ గ్రంథంలో జీ.వి. కేత్కర్, రణఝణకర్ పుట.12)
◆రాకేశ్ సిన్హా రచించిన డా॥కేశవబలిరాం హెడ్గేవార్ గ్రంథంలో నుండి
(భారత ప్రభుత్వంవారి సూచనా ఔర్ ప్రసారణ మంత్రాలయం వారి ప్రకాశన్ విభాగ్ ద్వారా ఈ గ్రంథం హిందీ, తెలుగు, సంస్కృతం, మలయాళం, గుజరాతీ మొదలైన భాషలలో ప్రచురింపబడింది.)