రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను పూర్తిగా విశ్వసించి, నిష్ఠతో పని చేసే లక్షలాది మంది కార్యకర్తలు ఉండటం వల్లనే నేడు సంఘ విశాలరూపం కనిపిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ మోహన్ భాగవత్ జీ అన్నారు. ఏ త్యాగనిరతి, సమర్పణ భావమైతే సంఘాన్ని ఈ స్థితికి చేర్చిందో దానిని మాత్రం ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు. ఛత్రపతి శంభాజీ నగర్‌లో దత్తాజీ భాలే స్మృతి మందిరాన్ని మోహన్ భాగవత్ జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘ కార్యం ఇంతలా విస్తరించిందంటే… దీని వెనుక చాలామంది తపస్సు వుందని, నిరంతర సాధన కూడా వుందని, వీటిని కూడా మనం ఎల్లప్పుడూ మననం చేసుకోవాలని అన్నారు. జ్ఞానం, కర్మ అనేవి మనిషికి రెండు రెక్కల్లాంటివని, ఈ రెండే మనిషిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు.
అయితే ఇవి కావాలంటే భక్తి అనేది వుండాలని, భక్తి వుంటే ఆనంద క్షణాలను అనుభవిస్తారని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది 500 సంవత్సరాల కల అని, జనవరి 22న బాల రాముడ్ని దర్శనం చేసుకోగానే… ప్రతి ఒక్కరికి ఆనంద భాష్పాలు వచ్చాయన్నారు. సమాజంలోని ఎంతో మంది త్యాగం, తపస్సుతో పాటు శ్రీరామచంద్రుడి సంపూర్ణ కృపా కటాక్షాలు వున్నాయి కాబట్టే.. రామమందిర నిర్మాణం సాధ్యమైందని స్పష్టం చేశారు.