Home News వాడివేడిగా తెలుగు రాష్ట్రాలు సహా లోక్‌సభ 4వ విడత పోలింగ్

వాడివేడిగా తెలుగు రాష్ట్రాలు సహా లోక్‌సభ 4వ విడత పోలింగ్

0
SHARE

దేశవ్యాప్తంగా సోమవారం లోక్‌సభ ఎన్నికల 4వ విడత పోలింగ్‌తో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పర్వం వాడివేడిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఆయా పార్టీల నడుమ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా… పాలకుల భవిష్యత్తుని తిరగరాసేందుకు పోలింగ్ బూత్‌ల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నడుస్తుండగా… ఏపీలో అధికార వైసీపీ ఒకవైపు… బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి మరోవైపు హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి.

తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటn వరకు 52.3 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని, 2019తో పోలిస్తే పోలింగ్‌శాతం బాగానే ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 2 గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌ నమోదవగా… ఇక్కడ పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బెదిరింపులు, దాడులు, ప్రతిదాడులతో వాతావరణం వేడెక్కింది. తెనాలిలో ఓటరుపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన్ని పోలింగ్ పూర్తయ్యే వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఇంకా తిరుపతి, గుంటూరు, అన్నమయ్య, కర్నూలు, కడప, సత్యసాయి జిల్లా ధర్మవరం, కోనసీమ, నెల్లూరు, శ్రీకాకుళం, కుప్పం తదితర ప్రాంతాల్లో అధికార – విపక్ష పార్టీల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా, వీటన్నిటిలోనూ వైసీపీ నేతల పాత్ర ఉందని టీడీపీ కూటమి ఆరోపించింది. ఇందుకు సంబంధించిన పలు దృశ్యాలు సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోను సర్కులేట్ అవుతున్నాయి.

ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి మాధవీలత పైనా విపక్షాలు ఫిర్యాదులు చేశాయి. మరోవైపు కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ విపక్ష నేతలు, కార్యకర్తలు వారితో ఘర్షణపడిన దృశ్యాలు కూడా బయటకొచ్చాయి.

దేశవ్యాప్తంగా చూస్తే మధ్యాహ్నం 3 గంటల సమయానికి 52.60 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే సమయానికి బెంగాల్‌లో 51.87%, మధ్యప్రదేశ్‌లో 48.52%, జమ్మూ కాశ్మీర్‌లో 23.57% పోలింగ్ నమోదైంది. శ్రీనగర్‌లో 2019 కంటే ఎక్కువ పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. బెంగా‌లో మాత్రం కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

లోక్‌సభ ఎన్నికల 4వ దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు 10 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. తెలంగాణలో మొత్తం 17, ఏపీలోని మొత్తం 25 లోక్‌సభా స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా… బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), ఉత్తరప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్ముకశ్మీర్ (1) లోక్‌సభ స్థానాలున్నాయి. ఇదే సమయంలో ఏపీలోని మొత్తం 175 శాసనసభా స్థానాలకు ఒకే విడతగా, ఒడిశా అసెంబ్లీకి తొలి దశలో భాగంగా 28 స్థానాల్లోను పోలింగ్‌ జరుగుతోంది.

తెలంగాణలో హైదరాబాదు స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ… తమ కుటుంబానికి కంచుకోటగా భావించే హైదరాబాదులో రాజకీయాలలోకి కొత్తగా అడుగుపెట్టిన బిజెపి అభ్యర్థి కె మాధవీలత నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దానం నాగేందర్ (కాంగ్రెస్), పద్మారావు (బీఆరెస్) భవితవ్యం ఈ విడతలో తేలనుంది. ఇంకా బండి సంజయ్, శత్రుఘన్ సిన్హా, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌, టీఎంసీ ఫైర్‌ బ్రాండ్‌ మహువా మొయిత్రా, కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌, నిత్యానంద్‌ రాయ్‌, పంకజ ముండే, తదితర నేతలు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.