Home News మావోయిస్టులపై నిప్పులు కక్కిన వనవాసీలు

మావోయిస్టులపై నిప్పులు కక్కిన వనవాసీలు

0
SHARE

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులపై వనవాసీలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వారిపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాము అడవుల్లో జీవిస్తున్నామని, ఆ ప్రాంతం తమదని, తమ ప్రాంతాల్లోకి వచ్చి తమకే హాని కలిగిస్తున్నారని, మందుపాతరలు పెడుతూ… తమ ప్రాణాలనే తీసేస్తారా? అంటూ వనవాసీలు నిప్పులుగక్కుతున్నారు. ఇదేం పద్ధతంటూ మావోయిస్టులను నిలదీస్తున్నారు. మావోయిస్టుల కారణంగానే తమ వనవాసీ ప్రాంతాలు అస్సలు అభివృద్ధి కావడం లేదని, అభివృద్ధి చేయడానికి వచ్చే వారిని బెదిరిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు.

తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలోని వాజేడు, వేంకటాపురం మండలాల పరిధిలోని పలు గ్రామాల వనవాసీలు రోడ్డెక్కారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నామని తెగ గొప్పలు చెప్పుకునే మావోయిస్టులు తమ ప్రాణాలనే తీసేసుకుంటున్నారని మండిపడ్డారు. తమ జీవితం నిత్యం అడవులతోనే ముడిపడి వుంటుందని, అలాంటి అడవుల్లో మావోయిస్టులు మందుపాతరలు పెట్టి, తమ ప్రాణాలనే తీసేస్తున్నారని ఆక్షేపించారు. ఇలా మందుపాతరలతో తమ ప్రాణాలు తీయడమేంటని నిలదీస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కొంగాల అటవీ ప్రాంతంలోని ఓ గుట్టపై మావోయిస్టులు మందు పాతర అమర్చారు. దీంతో జగన్నాథపురం గ్రామానికి చెందిన 55 సంవత్సరాల ఓ వనవాసీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వనవాసీలు భారీగా రోడ్లపైకి తరలివచ్చి, ఆ కుటుంబానికి మద్దతుగా జాతీయ రహదారిపై ప్రదర్శన చేపట్టారు. తాము నిత్యం పనులు చేసుకునే అడవుల్లో మావోయిస్టులు మందుపాతరలు పెడితే ఎలా బతకాలని ప్రశ్నించారు. మావోయిస్టులకు, ప్రభుత్వానికి జరుగుతున్న పోరులో తమ ప్రాణాలు పోతున్నాయని వనవాసీలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక… ఆంధ్రప్రదేశ్‌లోనూ వనవాసీలు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీలేరులోని జీకే వీధి మండలం దారకొండ, గుమ్మిరేవులు, దుప్పిలివాడ గ్రామ పంచాయతీల పరిధిలోని వనవాసీలు మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. వారి కారణంగానే తమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, వనవాసులమైన తమను ఇన్‌ఫార్మర్ల నెపంతో హత్యలు చేస్తున్నారని వనవాసీలు మండిపడ్డారు. తమ గ్రామాలను అభివృద్ధి చేయడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి వచ్చేవారిని బెదిరిస్తున్నారని, వారి దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని వెల్లడించారు. మూడు నాలుగు సంవత్సరాలుగా తాము నివసిస్తున్న ప్రాంతాల్లో రోడ్లు, మంచినీళ్లు, ఆస్పత్రులు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిని మావోయిస్టులు అడ్డుకుంటున్నారని, అందుకే తమ ప్రాంతాలకు మావోయిస్టులు రావొద్దని తేల్చి చెబుతున్నారు వనవాసీలు. ఒకవేళ తమను కాదని వచ్చినా… తమ మద్దతు మాత్రం వుండదని, మావోయిస్టులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని వనవాసీలు స్పష్టం చేస్తున్నారు.

ఇక తూర్పు గోదావరి జిల్లాలోని వనవాసీలు కూడా మావోయిస్టులపై మండిపడుతున్నారు. భారీ ప్రదర్శనలకు దిగుతున్నారు. గత మే మాసంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వారాంతపు సంతలో వనవాసీలు మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీలు చేశారు. అటవీ భూములపై హక్కు వనవాసులకే అని మావోయిస్టులు పదే పదే చెబుతుంటారని, కానీ.. తునికాకుల కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు అందకపోతే మాత్రం ఆ తునికాకు బసాలను కాల్చేస్తారని మండిపడుతున్నారు. తమ గ్రామాల్లో రహదారులు వేస్తే అటవీ సంపద దోచుకోవడానికే అంటూ అడ్డుకుంటారని, కాంట్రాక్టర్‌ గనుక డబ్బులిస్తే రహదారి పనులను అడ్డుకోరని, లేదంటే పనుల యంత్రాలను తగలబెడతారని వనవాసీలు వెల్లడిరచారు. తమ వనవాసీ సోదరులను చంపుతున్న మావోయిస్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అమాయకులైన తమను పనులకు వాడుకుంటూ… తిరిగి తమనే బలిపశువులను చేస్తారా? అంటూ వనవాసీలు మండిపడ్డారు.