భోజ్‌శాల సర్వేలో బయటపడ్డ వాసుకి, శంకరుడి విగ్రహాలు

    0
    SHARE

    మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) నిర్వహిస్తున్న సర్వే 93 వ రోజు సర్వే ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా తమ తవ్వకాల్లో హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని చిహ్నాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. 93 వ రోజు నిర్వహించిన సర్వేలో శంకరుడి విగ్రహం, ఏడు తలల వాసుకీ నాగ విగ్రహం, కలశంతో పాటు తొమ్మిది రాతి అవశేషాలను కూడా దర్యాప్తు బృందం కనుగొంది. ఈ విషయాన్ని ప్రధాన పిటిషనర్‌ గోపాల్‌ శర్మ ప్రకటించారు. వీటితో పాటు ఆరు అచ్చు ముక్కలు కూడా లభించాయని, వాటిని ఏఎస్‌ఐ బృందం భద్రపరిచిందని పేర్కొన్నారు. మరోవైపు భోజ్‌శాల భూమి నుంచి రాళ్లు బయటపడటంతో అక్కడ మసీదు లేదని, కానీ సరస్వతీ మందిరం వుందని తెలుస్తోంది.

    ఇవన్నీ అవశేషాలు బయటపడుతున్నా… ముస్లిం పక్షంలో వుండే అబ్దుల: సమాద్‌ ఖాన్‌ ఓ కొత్త తప్పుడు కథనాన్ని తెరపైకి తెచ్చాడు. భోజ్‌శాల ఈశాన్య మూలలో వున్న కట్టడాలు కొత్తగా కట్టారంటూ వితండ వాదనకు దిగారు. ఇప్పటి వరకు జరిపిన తవ్వకాలలో హనుమంతుని విగ్రహాలు, స్తంభాలు, అక్కడి గోడలపై శ్రీరాముడు, కృష్ణుడు, పరశురాముడు, శివుని బొమ్మలను పురావస్తు శాఖ గుర్తించింది. నిపుణులు అక్కడి స్తంభాలు, గోడలను శుభ్రం చేసిన తర్వాత ఇవి మరింత స్పష్టంగా కనిపించాయి. అసలు ఇక్కడ సరస్వతీ ఆలయమే వుండేదని పురావస్తు శాఖ శాస్త్రవేత్త కేకే మహ్మద్‌ కొన్ని రోజుల క్రిందటే ప్రకటించారు. ముస్లిం పక్షం కమల్‌ మసీదు అని పిలిచే భోజ్‌శాల నిజానికి మసీదు కాదని, సరస్వతీ దేవాలయమని స్పష్టం చేశారు.