స్వదేశీ భాష, స్వదేశీ వస్తు వాడకం ద్వారానే దేశం అభివృద్ధి : స్వదేశీ స్వావలంబన సదస్సులో వక్తలు

    0
    SHARE

    స్వదేశీ స్వావలంబన రాష్ట్ర సభ కేశవ మెమోరియల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా….. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ప్రాంత కార్యకారిణి సదస్యులు అస్నదానం సుబ్రహ్మణ్యం జ్యోతిప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ భావన ప్రాముఖ్యత, స్వదేశీ జాగరణమంచ్‌ ప్రాముఖ్యతను వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌తో ఏ స్థాయికి వెళ్లిందో కూలంకషంగా వివరించారు. ఆ తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద పెద్ద కంపెనీలు నెలకొల్పుతున్న నేపథ్యంలో గ్రామాల వరకు అవి విస్తరించినా, ఉపాధి పెద్ద సంఖ్యలో దొరకడం లేదన్నారు. దేశ ప్రగతి అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే సరిపోదని, ఉపాధి కల్పిస్తూ వుంటే నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగం కూడా ఇదే విధానంలో కొనసాగుతోందని, అలా కాకుండా చిన్న తరహా, సూక్ష్మతరహా పరిశ్రమలు నెలకొల్పి, ఉపాధి సృష్టించాలని సూచించారు. ఈ విధానం కోసం యువతే ముందుకు రావాలని ఆకాంక్షించారు.

    ఇక సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని గురజాడ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. మన దేశవృద్ధి చిన్న పిల్లల ద్వారానే ప్రారంభం కావాలని, చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి పనులు చేయడం, నేర్పడం ద్వారా చదువుతూ సంపాదించు అనే నినాదంతో స్వయం ఉపాధి అన్న ఆలోచన సరళి వస్తుందన్నారు. ఈ పద్ధతి ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    అఖిల భారత స్వదేశీ జాగరణమంచ్‌ కోకన్వీనర్‌ ఆర్‌. సుందరం మాట్లాడుతూ..జనాభా పెరగడం అనేది అభివృద్ధికి ఏమాత్రం విరోధం కాదని స్పష్టం చేశారు. జనాభా ఎంత ఎక్కువ వున్నా… ఉపాధికి కొదవలేదని, దీనికి సంబంధించిన ఆధారాలన్నీ వున్నాయన్నారు. ఆర్థిక విధాన మార్పులకు నిదర్శనమే స్వదేశీయని వివరించారు. 1905 లో స్వదేశీ విద్యపై సమాలోచనలు జరిగాయని, తిలక్‌, సావర్కర్‌ లాంటి వారు స్వదేశీ ఉద్యమాలకు మూల స్తంభాలని అన్నారు. దీనదయాళ్‌, దత్తోపంథ్‌ ఠేంగ్డే బాధ్యతలు తీసుకొని స్వదేశీని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. స్వయం సమృద్ధి, ఆత్మనిర్భర భారత్‌ లాంటివి స్వదేశీ ఆర్థిక విధానం పట్ల అవగాహనను, ఆలోచనలను మరింత పెంచాయని అన్నారు.

    కొత్త కొత్త విధానపరమైన నిర్ణయాలు, మార్పులు ఆర్థిక ఆలోచనలకు దారితీస్తాయని, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కి కేవలం స్వదేశీ పరిజ్ఞానమే కారణమని, ప్రపంచానికి దార్శనికతను చూపిందని, ఇది కేవలం భారత్‌కి మాత్రమే సాధ్యమైందన్నారు. జపాన్‌, చైనా కంటే ఉపాధి కల్పనా రంగంలో భారత్‌ ముందుందని, మూడు సంవత్సరాల క్రితమే స్వదేశీ జాగరణ మంచ్‌ స్వావలంభి భారత్‌ అభియాన్‌ కార్యక్రమం తీసుకున్నామని, ఇదే ప్రత్యక్ష తార్కాణమని తెలిపారు.

    రెండో కాలాంశం లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం మాట్లాడుతూ చేనేత మగ్గం నేసే పోచంపల్లి డిజైన్లకు కూర్పు కష్టమైన పని అని, దానిని చేసి చూపే యంత్రాన్ని తాను తయారు చేయడం జరిగిందని, దానికి నేపథ్యం వాళ్ళ అమ్మగారు పడిన కష్టమును చూడలేక ఆసుయంత్రాన్ని 1992లో శాస్త్ర సాంకేతికత తోడు లేకుండానే తనదైన శైలిలో పలుమార్లు నేర్చుకొని ఐదు భాగాలు తయారు చేశానని వెల్లడించారు. దానికి ఏడు సంవత్సరముల నిర్విరామ కృషితోనే స్వదేశీ పరిజ్ఞానంతోనే కనిపెట్టడం జరిగిందని, ప్రస్తుతం ఆ యంత్రం సహాయంతో గంటన్నరలో ఒక చీరను చుట్టడం వీలయిందని తెలిపారు.

    ఈ ఆసు యంత్రం ఏ ఒక్క కుటుంబానికే పరిమితం కాకుండా చాలా కుటుంబాలకి ఉపయోగపడే విధంగా సృష్టిస్తూ ఉన్నానని ఇప్పటివరకు దాదాపు 2020 ఆసుయంత్రాలను చేనేత మిత్రుల సహకారాలతో తయారు చేశానని చెప్పారు. పది మగ్గాల నడపలేని స్థితిలో ఉన్న చేనేత కార్మికులు ప్రస్తుతం పోచంపల్లిలో 100 మగ్గాలపై అవలీలగా నడిపిస్థితికి ఈ ఆసు యంత్రంద్వారా సాధ్యమైందని తాను చేసిన సర్వేలో తేలిందన్నారు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడమే కాకుండా 2017 వ సంవత్సరంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకోవడం క్షేత్రస్థాయిలో ఉన్న తనను గుర్తించడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఎవరి ప్రోత్సాహం లేకుండా నేరుగా పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేయడం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిదర్శనం అన్నారు. ఉద్యోగం పొందడం కంటే ఉపాధి చూపించే ఒక పారిశ్రామికవేత్తగా వ్యాపారస్తులుగా ఎదగడమే అసలైన ఆర్థిక స్వావలంబన అన్నాను. చేనేత కుటుంబాలన్నింటికీ చేయుతని వ్వడమే తను లక్ష్యంగా ఎంచుకొని పనిచేస్తున్నానని తెలిపారు.

    తర్వాత సుధాకర్ గందేజి గారు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో స్థిరపడ్డ తాను ఇంజనీరింగ్ ఐ ఐ టి ఢిల్లీలో పూర్తి చేశానని, పూర్వకాలంలో బ్యాంకుల్లో టైపింగ్ మిషన్లు ఉండేవని ప్రస్తుతం డేటా సమాచారం ఎంట్రీ అంతా కూడా కంప్యూటర్ ఆధారంగానే తయారు చేయగలుగుతున్నారని, అప్పటి వ్యవస్థకు ఇప్పటి వ్యవస్థకి తేడాలను గుర్తించామని తెలిపారు. సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో నూతన ఒరవడులను సృష్టించి పెద్దపెద్ద ప్రాజెక్టులను పొందానని తమ సంస్థ కేవలం 16 మంది ఉద్యోగులతో ప్రారంభమై ప్రస్తుతం 3000 మందికి చేరుకున్నామన్నారు.

    అఖిలభారత సంఘర్షణ వాహిని ప్రముఖ్ అన్నదా శంకర్ పాణిగ్రహి మాట్లాడుతూ దేశ ఆర్థిక సమృద్ధికి ఎందరో మహానుభావులు కృషి చేశారని అందులో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ముఖ్యులని తెలిపారు. భారత్ లో శక్తి ఉత్పాదనకు గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, తర్వాత మహారాష్ట్రలో అమెరికా దేశ సహకారంతో శక్తి ఉత్పాదన ప్రారంభమైందని, ప్రస్తుతం స్వదేశీ వ్యవస్థలో జిందాల్, రిలయన్స్, టాటా గ్రూప్స్ ల సహకారంతో నేడు దేశంలో శక్తి ఉత్పాదనలో ఎంతో శక్తివంతంగా ఎక్కువ శక్తివంతంగా ఏర్పడ్డామని తెలిపారు.

    30 సంవత్సరాల క్రితం సేంద్రీయ వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి వ్యవసాయ విధానంతో మహారాష్ట్ర లో సేవాగ్రం గ్రామం నుండి అల్ కబీర్ గ్రామం వరకు ఆనాడు స్వదేశీ వ్యక్తులతో పాదయాత్ర ద్వారా స్వదేశీ జాగరణ మంచ్ కార్యక్రమం చేపట్టిందని గుర్తు చేశారు. రోజురోజుకి బీడీలు,సిగరెట్లు త్రాగేవారు పెరుగుతున్న క్రమంలో బీడిల తయారీని అడ్డుకొని సిగరెట్ల తయారీని ప్రోత్సహిస్తున్న నాటి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ స్వదేశీ జాగరణ మంచ్ ఆనాడు “బీడీ బచావో” కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం సిగరెట్ల తయారీ ఉత్పత్తి పెరగడం ద్వారా కేవలం 4 లక్షల మందికి ఉపాధి దొరికితే అదే బీడీ తయారీ ద్వారా నాలుగు కోట్ల మందికి ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఉద్యమం చేపట్టి నేటికీ బీడీ తయారీదారులను సజీవంగా ఉంచామని దానికి స్వదేశీ జాగరణ మంచ్ ఉద్యమమే కీలకమని అన్నారు.

    టెక్స్టైల్, టైలరింగ్ రంగాల్లో సైతం రోజూ వారి దినసరి కూలీలు తమ తమ రాష్ట్రాల్లో కుట్టు మిషన్ల ద్వారా ఉపాధిలో ఉండేవారని, దేశ విదేశాలకు ఎగుమతులు చేసే వారిని, అప్పట్లోనే స్వదేశీ విజ్ఞానంతో ఉత్పత్తి అయ్యేవని, కానీ ప్రస్తుతం లెదార్, రెడిమెడ్ తో వస్త్ర ఉత్పత్తి పెరగడం ద్వారా దినసరి కూలీలు తగ్గుముఖం పట్టడం మళ్ళీ పునర్ వైభవ స్థితికి వచ్చేలా స్వావలంభి భారత్ అభియాన్ ఉపాధి వైపు మార్గాలు చూపిందని తెలిపారు. జపాన్ దేశం హిరోషిమా, నాగసాకిల దుర్ఘటనల తర్వాత మళ్లీ నిల దొక్కుకుందంటే కేవలం దేశభక్తిపై ప్రేమ ద్వారా మాత్రమే దేశ అభివృద్ధికి సాధ్యమయ్యి నేడు ప్రపంచంలో ఎదిగిందని ఆనాడే దత్త పంత్ టెంగ్డే జీ తెలిపారని, భారత్ సైతం దేశాభివృద్ధిలో ముందుకు సాగాలంటే దేశంపై ప్రేమ భక్తియే తోడ్పడతాయని తెలిపారు. 16 వేల కోట్ల టర్నోవర్తో, ప్రతి సంవత్సరం లిజ్జత్ పాపడ్ యాజమాన్యం 60 వేల మందికి ఉపాధిని కల్పించి అగ్రగామిగా నిలిచిందని, కాబట్టి ఉపాధి పొందడమే కాకుండా ఉపాధి చూపే విధంగా మన యువత ఎదగాలని తెలిపారు. స్వదేశీ భాష, స్వదేశీ వస్తు వాడకం ద్వారానే దేశం అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

    స్వదేశీ జాగరణ మంచ్ దక్షిణ మధ్య క్షేత్ర సంయోజక్ జగదీశ్ మాట్లాడుతూ భారత దేశంలో 3.2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగులు, 4.5 కోట్ల ప్రైవేటు రంగంలో ఉద్యోగులు ఉన్నారని 45% పైగా వ్యవసాయ రంగం 14 శాతం చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నారని కేవలం ఉపాధి పొందడమే తమ లక్ష్యం కాదని ఉపాధిని సృష్టించే వ్యక్తులుగా తయారు కావాలని 140 కోట్ల భారత ప్రజలకు ఉద్యోగాలు సాధ్యం కావని స్వయం ఉపాధి వైపు యువత సాగాలని తెలిపారు. ప్రస్తుతం చాలామంది యువత సంపాదించుకుంటూ చదువుకునే పరిస్థితుల్లో లేరని, ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారని, ఇది తప్పకుండా మారాలని కోరారు.

    నైపుణ్యం ఉంటే దేనిని సాధించవచ్చునని తెలియజేస్తూ ఇంటింటికి బట్టలమ్మిన ఎనిమిదో తరగతి విద్యార్థి ధీరు బాయ్ అంబానీ ప్రస్తుతం దేశంలో ఆ కుటుంబం ఏ స్థాయిలో ఉందో వారి యొక్క కుమారులు దేశాభివృద్ధికి ఇలా కీలకమయ్యారు ఉదాహరణగా చూడాలని యువత కూడా అదే మార్గంలో పనిచేస్తూ చదువుకునే విధానం చేసుకోవాలని అన్నారు. అలాగే సేంద్రియ వ్యవసాయ విధానంలో ఒకే పంటతో కాకుండా పలు రకాల పంటలతో పండిస్తే వ్యవసాయ రంగం బాగుపడుతుందని గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం అతి ముఖ్యమైనదని అన్నారు. సమాజంలో సహకారం, వికేంద్రీకరణ అత్యంత ప్రాధాన్యతనిస్తాయని స్వావలంబి భారత్ అభియాన్ ప్రతి గ్రామ గ్రామానికి చేరేలా కృషి చేస్తుందని తెలిపారు.