ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ఆమోదించడం పట్ల బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. ఇదే అంశంపై బిజెపి నేతలు కూడా ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, బిజెపి గ్రేటర్ హైదరాబాద్ కమిటీలు వేర్వేరుగా హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించాయి. ర్యాలీగా బయలుదేరిన బీసీ విద్యార్థులను ఎక్కడికక్కడే అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి కలెక్టరేట్‌కు చేరుకున్న ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు భగ్నం చేశారు. ఇదే అంశంపై సోమవారం ఆందోళనకు దిగిన బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, గ్రేటర్ హైదరాబాద్ నగర నాయకులు వెంకట్‌రెడ్డి, భవర్లాల్ వర్మ, రాజశేఖర్‌రెడ్డి, మహిలా మోర్చా నాయకురాళ్లు గోనెల నిర్మల, అరుణ జ్యోతి, గీత తదితరులను పోలీసులు అరెస్టు చేసి బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిండంవల్ల తమకు అన్యాయం జరుగుతుందని నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్, కొత్తపేట, చిక్కడపల్లి నుంచి వేర్వేరుగా ర్యాలీలు కలెక్టరేట్‌కు బయలుదేరగా పోలీసులు లాఠీలు ఝుళిపించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యసహా 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి ఉంటే మైనార్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లను 12 శాతం పెంచి, బీసీలకు పెంచకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందని కృష్ణయ్య విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో జనాభా ప్రకారం 25శాతం నుంచి 52శాతానికి రిజర్వేషన్లు పెంచేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
ఉపసంహరించే వరకు పోరాటం :బిజెపి
ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించటం అన్యాయమని, దేశంలో మతపరమైన రిజర్వేషన్లు ఎక్కడా లేవని బిజెపి నేతలు మండిపడ్డారు. బిజెపి గ్రేటర్ హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం ఆగదన్నారు. బిజెపి నగర అధ్యక్షుడు, ఏమ్మెల్సీ ఎన్ రాంచందర్రావుమాట్లాడుతూ వైఎస్ హయంలో ముస్లింకు 5శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని కోర్టు కొట్టేసి కేవలం నాలుగు శాతానికి పరిమితం చేసిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెరాస ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
(ఆంధ్రభూమి సౌజన్యం తో)