Home News స్వదేశీ జాగరణ్ మంచ్ – తీర్మానం 1 – ప్రపంచీకరణకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది

స్వదేశీ జాగరణ్ మంచ్ – తీర్మానం 1 – ప్రపంచీకరణకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది

0
SHARE

స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మే 20,21-2017లలో గౌహతి లో జరిగాయి.

వాటిలో ఆమోదించిన తీర్మానం 1 –

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వపు పదవీకాలంలో సగానికి పైగా పూర్తి అయిపోయింది. కాబట్టి సమకాలీన జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం గురించి అంచనా వేసేందుకు ఇది సరైన సమయం. 2008లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం నుండి ప్రపంచం ఇంకా బయట పడలేదు. దాని ప్రభావం  ప్రపంచంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరచే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే  ఉంది. యూరోప్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. జపాన్ ఆర్థిక మాంద్యంతో సతమతమవుతోంది. చైనా ఆర్థిక ప్రగతి కుంటుపడుతోంది.

UNCTAD తాజా రిపోర్ట్ ప్రకారం ప్రపంచపు GDP వృద్ధి రేటు 3 శాతం ఉంటే, అంతర్జాతీయ వాణిజ్యపు పెరుగుదల రేటు మాత్రం 1.5 శాతమే ఉంది.  ఇలాంటి పరిస్థితి గత 25 ఏళ్లలో ఎప్పుడు లేదు. అంటే నేడు అంతర్జాతీయ వృద్ధి దేశీయ అభివృద్ధికి దోహదం చేయడం కాకుండా, దేశీయ వృద్ధే అంతర్జాతీయ ప్రగతిని ముందుకు తీసుకువెళుతోందన్నమాట. `అమెరికా ముందు’ అన్న డొనాల్డ్ ట్రంప్ నినాదం విజయవంతమవడం, యూరోపియన్ యూనియన్ నుండి ఇంగ్లండ్ వైదొలగడం ప్రపంచీకరణ అంతానికి సూచనలు.  ఫ్రాన్స్, జర్మనీ లలో ఎన్నికలు కూడా వైశ్వీకరణపై చర్చను తీవ్రం చేశాయి. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన పడింది. దానితో అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చైనా భావిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా ఎలా వ్యవహరించిందో ఇప్పుడు చైనా సరిగ్గా అలా ప్రవర్తిస్తోంది. అమెరికాను పక్కకు తొలగించి అంతర్జాతీయ నాయకత్వాన్ని చేపట్టాలని ప్రయత్నిస్తోంది. దావోస్ ప్రపంచ ఆర్థిక సమావేశంలో, అలాగే ఇటీవల జరిగిన బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్ సమావేశంలో కూడా చైనా అధ్యక్షుని ప్రసంగం ప్రపంచీకరణను ప్రోత్సహించే విధంగానే ఉంది. దీనిని బట్టి ప్రపంచీకరణకు కొత్త ఊపిరులు ఊదడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది.

“అంతర్జాతీయవాదం కేవలం ఒక తాత్కాలికమైన దశ. జాతీయవాదమే స్థిరమైనది’’ అన్న  దత్తోపంత్  థేంగ్డే మాటలు నిజమవుతున్నాయి. తీవ్రమైన ప్రపంచీకరణ అంతరించి, అంతర్జాతీయ వాణిజ్యపు అవకాశాలు తగ్గుతున్న విషయాన్ని గమనించి భారత్ అందుకు అనువుగా అడుగులు వేయాలి.

GDP, పారిశ్రామిక ప్రగతి వంటి ఇతర ఆర్థిక సూచీల అంచనా పద్ధతిలో మార్పులు చేసిన తరువాత GDP వృద్ధి 7.1 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. నేడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కానీ ఇప్పటికీ ఉపాధి కల్పన ఒక సవాలుగానే మిగిలిపోయింది. తాజా నివేదికల ప్రకారం సంవత్సర కాలంలో ఉపాధి అవకాశాలు కేవలం 1 శాతం మాత్రమే పెరిగాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. IT రంగంలో కూడా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. నోట్ల రద్దు తరువాత పెద్ద ఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగినా ఋణ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. దేశీయ పెట్టుబడులు పెరగలేదు. ప్రభుత్వం అనేక కొత్త  రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించింది. గత ఏడాది FDI దాదాపు 56 మిలియన్ డాలర్లకు చేరిన అదంతా ఎక్కువ శాతం పెద్దగా ప్రతిఫలం ఇవ్వని రంగాలకే పరిమితమయ్యింది. ముఖ్యంగా ఇ – వాణిజ్యంలోనే ఉంది. ఇందులో కూడా 50 శాతానికి పైగా పెట్టుబడి మారిషస్, సింగపూర్ ల నుండే వస్తోంది. అయితే ఈ దేశాలు హవాలా కార్యకలాపాలకు పెట్టింది పేరు. అలాగే పెట్టుబడి కూడా ప్రైవేట్ రంగం లోనే ఎక్కువగా వస్తోంది. కొత్త పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయి. అలాగే విదేశీ పెట్టుబడులతో వస్తున్న మరొక ఇబ్బంది ఏమిటంటే సాంకేతిక పరిజ్ఞానం లో వచ్చే మార్పులవల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.

స్థానికంగా తయారయ్యే వస్తువుల కొనుగోలుకే ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం ద్వారా ప్రభుత్వం చూపుతున్న జాతీయ భావనను స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రశంసిస్తోంది. కానీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు బదులు దేశీయ పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన సమయం వచ్చింది. అంతర్జాతీయంగా ప్రపంచీకరణకు ప్రతికూలంగా వీస్తున్న పవనాలను దృష్టిలో పెట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ట పరచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్ చేస్తోంది. భారతీయ యువ శక్తి వృధా కాకుండా చూసుకోవడం ఇప్పుడు పెద్ద సవాలు. అతిపెద్ద దేశీయ మార్కెట్ మనకు అపారమైన అవకాశం. కనుక విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పించడానికి బదులు దేశీయ మార్కెట్ ను సక్రమంగా ఉపయోగించుకునే విధంగా ఆర్థిక నమూనాను రూపొందించుకోవాలి. నేడు కోట్లాది ఉద్యోగాల అవసరం ఉన్నప్పుడూ ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఆలోచించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కోరుతోంది. అన్నీ అంతర్జాతీయ, వాణిజ్య ఒప్పందాలను పునర్ సమీక్షించి వాటిని మన ప్రయోజనాలకు తగినట్లుగా మలుచుకునే ప్రయత్నం జరగాలి.