Home Telugu రోదసిపై ఇస్రో మార్క్

రోదసిపై ఇస్రో మార్క్

0
SHARE

రోదసి పరిశోధనలో భారత్ మరో కొత్త రికార్డు సృష్టించింది. అగ్రదేశాలు సైతం చేయలేని సాహసాన్ని మన శాస్తవ్రేత్తలు సుసాధ్యం చేసి భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టారు. దీంతో రోదసిలో తివర్ణ పతాకం మరోమారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తూ, 17 ఏళ్ల కలను శాస్తవ్రేత్తలు సాకారం చేశారు. దీంతో షార్‌నుంచి మున్ముందు భారీ ప్రయోగాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కదనాశ్వం జిఎస్‌ఎల్‌వి మార్క్ 3-డి1 భారీ ప్రయోగం తొలి ప్రయత్నంలోనే విజయబావుటా ఎగరేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగించిన జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని జిఎస్‌ఎల్‌వి- మార్క్ 3 వాహక నౌక విజయవంతంగా మోసుకెళ్లింది. దీంతో ఇస్రో తొలి భారీ ప్రయోగ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, క్రయోజనిక్ ప్రయోగాల్లో ఐదోసారి రికార్డు సృష్టించింది.

నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం సాయంత్రం సరిగ్గా 5 గంటల 28 నిమిషాలకు రెండో ప్రయోగ వేదిక నుండి జిఎస్‌ఎల్‌వి మార్క్ 3-డి1 రాకెట్ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. జిఎస్‌ఎల్‌వి మార్క్ 3-డి1 వాహక నౌక జీశాట్-19 ఉపగ్రహాన్ని 16.20 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్తవ్రేత్తలతో కలసి ఉత్కంఠగా ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ రాకెట్ మూడు దశలను సునాయసనంగా పూర్తి చేసుకొన్న అనంతరం విజయాన్ని విక్టరీ గుర్తుతో అధికారికంగా ప్రకటించారు. అనంతరం శాస్తవ్రేత్తలను ఆలింగనం చేసుకొని సంతోషాన్ని పంచుకున్నారు. ఈ రాకెట్ ద్వారా 3,136 కిలోల బరువుగల జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా (పెరిజి) 170 కిమీ, భూమికి దూరంగా (అపోజి) 35,975కిమీ ఎత్తులో జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (భూ బదిలీ కక్ష్యలో) ప్రవేశపెట్టారు. అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఉపగ్రహ నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకొని ఉపగ్రహంలో నింపిన అపోజి మోటార్లను మండించి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపర్చారు. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకుపాకాయి. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో 17 ఏళ్లగా మనం కన్న కలలు సాకారమవ్వడమే కాకుండా, దేశ సమాచార వ్యవస్థ మరింత బలోపేతమైంది. ఇస్రో శాస్తవ్రేత్తలు భారీ కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి అత్యంత భారీ రాకెట్‌ను మన భూభాగం నుంచి తొలిసారి ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలో కెఎ బ్యాండు, కెయూ బ్యాండు ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. దీనిద్వారా హైస్పీడు ఇంటర్ నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 4జి టెక్నాలజి మరింత మెరుగుపడుతోంది. దీని సేవలు పదేళ్లపాటు అందుతాయి. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలు చేపట్టేందుకు మార్క్ 3 రాకెట్ ద్వారా నాలుగు టన్నుల బరువుగల జీశాట్-19 ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో తొలిసారిగా ప్రయోగించింది. ఈ ఏడాది వరుసగా మూడో ప్రయోగం విజయం కాగా, జిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో వరుసగా ఐదో ప్రయోగం విజయవంతమైంది. జిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మన శాస్తవ్రేత్తలు రూపకల్పన చేసి విజయం సాధిస్తున్నారు. ఈ ప్రయోగ విజయంతో ప్రపంచ దేశాలు సైతం భారత్‌వైపు చూస్తున్నాయి. అంతేకాకుండా మున్ముందు భారీ రాకెట్ ప్రయోగాలకు మార్గం సుగమమైంది.

దేశం గర్వించదగ్గ చారిత్రాత్మక ప్రయోగం. ఎంతో బరువైన జీఎస్‌ఎల్‌వి మార్క్ 3డీ1 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రోకు హృదయపూర్వక అభినందనలు.

– ప్రణబ్ ముఖర్జీ, రాష్టప్రతి

అంతరిక్ష పరిశోధనల్లో మన శాస్తవ్రేత్తల నిబద్ధతకు ఇది తార్కాణం. దేశం గర్వించదగ్గ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు అభినందనలు. ఈ విజయాల పరంపర కొనసాగాలి.

– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

(ఆంధ్రభూమి సౌజన్యం తో)