ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అంటే కేవలం హింసాయుత చర్యలను ఎదుర్కోవడం మాత్రమే కాదని, ఉగ్రవాద సంస్థలు కీలక ఆయుధాలుగా ఉపయోగిస్తున్న సమాచార వ్యవస్థను, సైబర్ భద్రతను ఎదుర్కోవడం 21వ శతాబ్దంలో కీలక సవాళ్లుగా మారనున్నాయని దిల్లీలోని నెహ్రు మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ డైరెక్టర్ శక్తి సిన్హా చెప్పారు. సోషల్ కాజ్, ఇండియా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జూన్ 4,2017, నాడు ”21వ శతాబ్దంలో ఉగ్రవాదం – భారతదేశానికి సవాళ్లు” అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని మనమే ఎదుర్కోవాలని, మరెవరో మనకోసం పోరాడతారని ఎదురు చూడరాదని స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటం మాటలకే పరిమితమని, ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మన ఎత్తుగడలను మనమే ప్రాంతీయంగా ఏర్పరచు కోవాలని తెలిపారు. ముఖ్యంగా పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగు పరచుకొని నిఘా సమా చారాన్ని, వనరులను పంచుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సహకారంతో నేడు అస్సాంలో ఉగ్రవాదం తలవంచిందని ఆయన గుర్తు చేశారు.
ఉగ్రవాద సంస్థలు సోషల్ మీడియాను విసృతంగా ఉపయోగించుకొంటున్నాయని ఆయన హెచ్చరించారు. యువతలో ఉద్రేకతను నింపడం కోసం, యువతను తమలో చేర్చుకోవడం కోసం, నిధుల సేకరణకు, నిఘా సమాచారం సేకరించడానికి, చివరకు ప్రజలలో భయభ్రాంతులను కలిగించడానికి కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొంటున్నాయని చెప్పారు. అయితే సోషల్ మీడియాపై నియంత్రణలో, ఉగ్రవాద సంస్థల ప్రచారాన్ని కట్టడి చేయడంలో, తిప్పి కొట్టడంలో భారత్ ఘోరంగా విఫలమవుతున్నదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
మన దేశంలో సైబర్ భద్రత వ్యవస్థలనేవి లేకపోవడంతో భారతదేశం తీవ్ర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని శక్తి సిన్హా హెచ్చరించారు. 21వ శతాబ్దపు సవాళ్ళు మనం ఎప్పుడూ విజయం సాధిస్తున్న దేశాల మధ్య యుద్ధాల వంటివి కావని, నేడు హింస మరింత ప్రమాదకరంగా, క్రూరంగా జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదం ఏవో సిద్ధాంతాల ప్రాతిపదికన ఏర్పడుతున్నట్లు చెబుతున్న నిర్వచనాలను ఆయన కొట్టి పారేస్తూ కేవలం కొన్ని రాజకీయ లక్ష్యాల కోసమే వ్యూహాత్మకంగా చేపట్టే ఆయుధమే ఉగ్రవాదం అని సిన్హా స్పష్టం చేశారు. ఈ పేరుతో మారణ హోమం సృష్టిస్తున్నారని, ‘మావోయిస్టులు వర్గ శత్రువులు’ పేరుతో సాగించిన దారుణమైన మారణ హోమం, ‘తమిళ్ ఈలం’ పేరుతో ఎల్‌టిటిఇ సాగించిన ఆత్మాహుతి దాడులు, హత్యాకాండ, తాలిబన్లు సాగించిన క్రూరమైన హింసాకాండలు ఒక ఎత్తయితే కేవలం ప్రచారం కోసమే ఐఎస్ హత్యాకాండలు సాగిస్తున్నదని చెప్పారు.
ప్రపంచంలోని అనేక ఉగ్రవాద సంస్థలను అమెరికా, ఇతర పశ్చిమ దేశాలే సృష్టించాయని, కమ్యూనిజంపై పోరాటం పేరుతో వాటిని ప్రోత్సహించాయని, అయితే ఇప్పుడు అవి ఆ దేశాల అదుపు కూడా తప్పి పోయాయని అన్నారు. మనదేశంలో అస్థిరత సృష్టించడం కోసం చైనా గతంలో ఎన్నడూ లేనంత బలంగా నేడు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నదని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్ చర్యలను మనం ప్రపంచానికి వెల్లడి చేసి, ఆ దేశం తల వంచుకొనేటట్లు చేయవలసిందే అని ఆయన చెప్పారు.
మన దేశంలో ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తూ వస్తున్న పాకిస్థాన్ నేడు తానే ప్రమాదానికి గురవుతున్నదని, అయితే ఆ దేశానికి ఉగ్రవాదాన్ని అదుపు చేసే నిజాయితీ లేదన్నారు. ఉదాహరణకు ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను అదుపు చేయడం కోసం ఎన్ఐఏ ఒక రోజు జరిపిన దాడులలో 4 మిలియన్ డాలర్లను పట్టుకోగా, పాకిస్తాన్ ఒక సంవత్సరం అంతా 15 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి చేసిన దాడులలో కేవలం 3 బిలియన్ డాలర్లు మాత్రమే పట్టుకో గలిగినది అన్నారు.
ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ మేజర్ జనరల్ డా. ధ వ్ సి కటోచ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు వాదుల కార్యకలాపాలను, దేశంలో వామపక్షుల తీవ్ర వాదాన్ని కట్టడి చేయగల సామర్థ్యం మన సాయుధ దళాలకు ఉన్నా భారతదేశం ఘర్షణల నివారణ చర్యలు తీసుకోలేక పోతున్నదని విచారం వ్యక్తం చేశారు. అందుకు పరిపాలన, రాజకీయ వర్గాలలో ఉన్న స్వార్థపర శక్తులే కారణం అని ఆయన విమర్శిం చారు. ఉదాహరణకు కల్లోలిత ప్రాంతాలలో లెక్క లేకుండా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టవచ్చని, ఆ ఖర్చుకు ఎవరికీ జవాబుదారీ కానవసరం లేదన్నారు.
మరో వంక తీవ్రవాద సంస్థలు వ్యాప్తి చేస్తున్న భావజాలాలు ప్రతిగా ప్రజలకు ప్రత్యామ్న్యాయ భావజాలాన్ని అందించే ప్రయత్నం మనం చేయడం లేదని ఆయన గుర్తు చేశారు. ఆ విధంగా చేయడం ద్వారా వారి మూలలను కట్టడి చేయగలమని స్పష్టం చేశారు.
1950 నుండే భారతదేశం ఉగ్రవాద ప్రమాదాలు ఎదుర్కొంటున్నదని, ఈ ప్రమాదంపై వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ అవసరం అని ఐక్యరాజ్య సమితి వేదికలపైనా అంటూనే ఉన్నా 1991 వరకు ఎవరూ పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు.
కాశ్మీర్ ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేయడంలో పేరు పొందారని, అయితే 1971 యుద్ధం తరువాత స్థానిక ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టి, 1980 ప్రాంతం నుండి వారిని రెచ్చగొట్టి అల్లర్లు చేయించడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదని అన్నారు. ఈ చర్యను మనం గుర్తించక పోవడంతో నివారణ చర్యలు కూడా చేపట్టలేక పోయామని తెలిపారు. ప్రజలలో జాతీయ భావం కలిగించడం, మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేటట్లు చేయడం ద్వారానే ఉగ్రవాద సవాళ్ళను ఎదుర్కోగలమని ఆయన స్పష్టం చేశారు.
జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మాజీ సలహాదారుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అజ్మేడ్ జాకీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది మన సైన్యం అని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నదని చెప్పారు. ప్రపంచంలోనే అద్భుతమైన శిక్షణ మన సైనికులకు ఉన్నదని, మనమీద కలబడితే జీవితాంతం గుర్తుంచుకొనే విధంగా శత్రువులకు గుణపాఠం చెప్పగలని పేర్కొన్నారు.
మాజీ డిజిపి కె.అరవిందరావు ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ”ప్రపంచ ఉగ్రవాదం : సవాళ్లు, విధానపర అంశాలు” గ్రంథాన్ని ఆవిష్కరించారు.
(జాగృతి సౌజన్యం తో)