Home Interviews లక్షలాది ముస్లిములు అయోధ్యలోకరసేవకు సిద్ధంగా ఉన్నారు – ఇంద్రేష్ కుమార్

లక్షలాది ముస్లిములు అయోధ్యలోకరసేవకు సిద్ధంగా ఉన్నారు – ఇంద్రేష్ కుమార్

0
SHARE

డిసెంబర్ 2002 లో ప్రారంభమయిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ (MRM) ఇప్పుడు 25 రాష్ట్రాల్లో ఉంది. మొత్తం 10,000 మంది కార్యకర్తలు ఉన్నారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున మదరసాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేసేట్లుగా ముస్లిం మతపెద్దలకు చెప్పడం, ముస్లింలు కూడా ఆవులను పెంచుకునేట్లు ఒప్పించడం వంటివి మంచ్ కార్యకలాపాలలో కొన్ని. ఈసారి రంజాన్ సందర్భంగా `గోమాంస పార్టీలు వద్దు – ఆవుపాల పార్టీలే మేలు’’ ప్రచారోద్యమాన్ని తలపెట్టింది. మంచ్ మార్గదర్శకులైన ఇంద్రేష్ కుమార్ తో ఇంటర్వ్యూ –

తలాక్ ఆచారంపై ముస్లిం రాష్ట్రీయ మంచ్ దృష్టి ఏమిటి ?

తలాక్, నికాహ్ హలాల (మొదటి భర్త వద్దకు వెళ్ళేందుకు మరొకరిని పెళ్లి చేసుకోవాల్సిన పద్దతి), మెహర్ (పెళ్ళికి ముందు భర్త ఇచ్చే డబ్బు), బహుభార్యత్వం, అధిక సంతానం వంటి పద్దతులకు వ్యతిరేకంగా, ముస్లిం మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడాలని ఎంతో ఆలోచన తరువాత ముస్లిం రాష్ట్రీయ మంచ్ నిర్ణయించింది. తాము పిల్లల్ని కనే యంత్రాలం  కాదని ముస్లిం మహిళలు భావిస్తున్నారు. మరోవైపు  ముస్లిం పురుషులు అత్యవసర పరిస్థితుల్లో కాకుండా కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం విడాకుల మార్గం ఎంచుకుంటున్నారు. అలా విడాకులు ఇచ్చిన మహిళకు ఎలాంటి మనోవర్తి ఇవ్వడం లేదు.

1985లో షాబాను కేసులో తీర్పు వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సంతుష్టీకరణకు పాల్పడి ఉండకపోతే ముస్లిం మహిళలకు న్యాయం జరిగి ఉండేది. కానీ అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మహిళల ప్రగతికి కాకుండా ముస్లిముల సంతుష్టీకరణకే ప్రాధాన్యతనిచ్చింది. దీనితో ముస్లిం మహిళలకు అన్యాయం జరిగింది. (షాబాను కేసులో విడాకులు కోరుకున్న ఆమె భర్త ఆమెకు మనోవర్తి చెల్లించాలని కోర్ట్ తీర్పు చెప్పింది. కానీ ఇది ఇస్లాం పై దాడి అంటూ సంప్రదాయ ముస్లిములు మండిపడ్డారు. ఎన్నికల  ప్రయోజనాలు ఆశించి కాంగ్రెస్ ఆ తీర్పును నీరుకార్చింది.)

ఇప్పుడు ముస్లిం మహిళలు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. మతంతో ఏ సంబంధం లేని, సామాజిక సమస్యలైన తలాక్, హలాల, బహుభార్యత్వం, బహు సంతానం మొదలైనవాటిని MRM పూర్తిగా వ్యతిరేకిస్తున్నది.

ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారు?

ప్రతి సమాజంలో వివిధ కాలాల్లో కొన్ని దురాచారాలు, కురీతులు వస్తుంటాయి. సనాతన ధర్మంలో కూడా అలాంటివి వచ్చాయి. వాటిని తొలగించుకునేందుకు సమాజం మొత్తం ప్రయత్నించింది. అప్పుడు కూడా కొందరు ఈ సంస్కరణలు మత, రాజకీయ ప్రయోజనాల కోసమేనని భావించారు. అయినా అందరి మంచి కోసం ఆ సంస్కరణలు కొనసాగించారు. ఒక వేళ అది (తలాక్) మతపరమైన విషయం అయితే తాము జోక్యం చేసుకునేవారమే  కాదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. అది ఒక సామాజిక సమస్య అని పదేపదే నిరూపితమైంది. కోర్టు ప్రస్తుతం తలాక్ గురించి పరిశీలిస్తోంది. దీని తరువాత హలాల , మనోవర్తి, బహుభార్యత్వం మొదలైన అంశాలను కూడా పరిశీలిస్తుంది.

కోట్లాది మంది ముస్లిం మహిళలకు స్వేచ్చను ప్రసాదించే విధంగా కోర్ట్ ఇలాంటి అంశాలన్నిటిని క్రమక్రమంగా తీసుకోవాలి. ఖురాన్ షరీఫ్ కూడా తలాక్ ఒక గునా (నేరం) అంటుంది. యహ్ మాలిక్ – ఈశ్వర్ – ఖుదా కొ నా పసంద్ హై (తలాక్ భగవంతునికి కూడా అంగీకారం కాదు).

ముస్లిం మహిళలకు న్యాయం చేకూర్చేందుకు MRM చేస్తున్న కృషి ఏమిటి?

ప్రతి జిల్లాలో 10 మంది విడాకులవల్ల వదిలివేయబడిన మహిళలు, వారి పిల్లలను దత్తత తీసుకోవాలని MRM విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా ముంబైలో మేము 30 -32 మంది మహిళలను ఎంపిక చేసి వారికి నర్స్ శిక్షణ ఇప్పించాము. అలా వారు ఆర్థిక స్వావలంబన సాధించుకోగలిగారు.

తలాక్, బహుభార్యత్వం, మనోవర్తి, బహు సంతానం మొదలైన విషయాల్లో ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా నిబంధనలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు ముస్లిం మహిళల ఆరోగ్యం బాగుపడుతుంది, అలాగే వారి పిల్లలకు మెరుగైన ఆలనపాలన లభిస్తాయి.

2017-18 సంవత్సరం సామాజిక విప్లవాన్ని తెచ్చే ఒక మలుపు అని నేను భావిస్తాను. వివేకం, జ్ఞానం ఆధారంగా సామాజిక దురాచారాలను తొలగించవచ్చును. కొన్ని దశాబ్దాల క్రితం సనాతన ధర్మ అనుయాయులు ఇదే చేశారు.

ఉమ్మడి పౌర స్మృతి పట్ల ముస్లిం మత పెద్దల అభ్యంతరాల మాటేమిటి?

ప్రస్తుతం మన దేశంలో ఒక జాతీయ చట్టం అమలులో ఉంది. అది ఉమ్మడి పౌర స్మృతే. వివాహాలు, పుట్టిన రోజు పండగలు, వివిధ మతస్తులు జరుపుకునే పండుగల విషయంలో రాజ్యాంగం జోక్యం చేసుకోదు. అలా జోక్యం చేసుకుంటున్నదనే వాదన కొద్దిమంది మతమౌఢ్య  నాయకులది మాత్రమే. వాళ్ళకి భారత్ ఒకటిగా నిలబడటం ఇష్టం ఉండదు. అలాగే పేదరికం, నిరక్షరాస్యతల నుండి బయటపడడం అంతకన్నా సహించలేరు.

వాళ్ళు చేసేది మజ్ హబ్ కీ హిఫాజత్ (మత సంరక్షణ) కాదు. మతం పేరు మీద జనాన్ని విడగొట్టడం. వారికి విదేశాల నుండి నిధులు అందుతాయి. ఈ ముల్లాలు, మౌల్వీలు, వారికి సంబంధించిన సంస్థల అకౌంట్లను పరిశీలిస్తే వాళ్ళు ఇలాంటి అమానవీయమైన కార్యకలాపాలకు ఎందుకు పాల్పడుతున్నారో అర్ధమవుతుంది.

ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నే తీసుకోండి . అది 1975 లో ఏర్పడింది. ఇలాంటి సంస్థ మరే దేశంలోనూ కనిపించదు. ఇస్లాం ప్రకారం చూసిన ఇది పూర్తిగా మత నిబంధనలకు విరుద్ధమైనది. ఇందులో అనేక దోషాలు, లోపాలు ఉన్నాయి. చట్టపరంగా చూసినా ఇది రాజ్యాంగ వ్యతిరేకం.

ఇటీవల MRM కార్యకర్తలు రామ మందిర నిర్మాణం కోసం అయోధ్యకు ఇటుకలు తీసుకువెళ్లారు. ఆ కార్యక్రమం గురించి చెప్పండి.

ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. వాళ్ళు కేవలం MRM కార్యకర్తలు కారు. ఈ దేశంలో నివశిస్తున్న ముస్లిములు. మనం ఈ సంఘటనకు  మతం రంగు పూయకూడదు. ముందు అయోధ్యకు సంబంధించి కొన్ని విషయాలు అర్ధం చేసుకోవాలి. మీర్ బాకీ అనే తన సేనానితో మొగల్ బాద్షా బాబర్ ఈ దేశాన్ని ఆక్రమించాలని దండెత్తి వచ్చాడు. తన దురాక్రమణలో భాగంగా అయోధ్యలో రామ మందిరంతో సహా అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఈశ్వరుడైనా, అల్లా అయినా ఒకటే. స్వర్గం, నరకం అందరికీ ఒకటే. వాటిని వేరుగా చూడకూడదు. కానీ బాబర్ రామ మందిరాన్ని ధ్వంసం చేశాడు. అక్కడ సరైన మసీదు కట్టలేదు.

అక్కడ కట్టిన చిన్న కట్టడానికి కూడా ఖుదా పేరు పెట్టలేదు. దురాక్రమణదారుడైన బాబర్ పేరు పెట్టారు. అయోధ్యలోని ఏ ఒక్కరు అక్కడ నమాజ్ చేయలేదు. నిజానికి అక్కడ కూల్చివేయబడినది మసీదు కాదు. పురాతన కాలం నుండి అక్కడ ఉన్న మందిరాన్నే కూల్చారు, నాశనం చేశారు. ఆ స్థలం రామ్ లలాకు చెందినదని కోర్టు తేల్చింది కూడా. కనుక దానిని విభజించడానికి గాని, మరొకరికి ఇవ్వడానికిగాని వీలులేదు.

రామ మందిరాన్ని ముస్లిములు అంగీకరిస్తారా ?

హిందుస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోని ముస్లిములంతా ఒకప్పుడు మతం మార్చబడినవారే. వారి పూర్వీకులు హిందువులే. అయోధ్యలో రామ మందిరం నిర్మించాల్సిందేనని, అక్కడ మసీదు కడితే అది నపాక్ (శుద్ధం కానిది) అవుతుందని చాలామంది ముస్లిములు భావిస్తున్నారు. ఎందుకంటే అది వివాదాస్పద స్థలం – రామ జన్మభూమి – లో కట్టినదే అవుతుంది. అలాగే ఈ మసీదుకు బాబర్ పేరు పెట్టడానికి లేదు. ఎందుకంటే అతను ఒక రాజు మాత్రమే, దేవుడు కాదు. మసీదులకు ఖుదా (దేవుడు) పేరు పెట్టే పద్దతి ఉంది. కనుక కొద్దిమంది మతమౌఢ్యుల కోసం ఇస్లాం నిబంధనలకు నీళ్ళువదులుతారా? నిజమైన, ఆలోచనపరులైన ముస్లిములు ఈ విషయాలను అంగీకరిస్తారు.

అందుకనే ఈనాడు కరసేవ చేసి రామ మందిరాన్ని నిర్మించడానికి లక్షలాది ముస్లిములు ముందుకు వస్తున్నారు. మసీదు కట్టుకోదలుచుకుంటే మరెక్కడైనా కట్టుకోవచ్చును. అన్ని మత సంబంధమైన ప్రదేశాలలో అందరికీ ప్రవేశం కల్పించాల్సిన రోజు వచ్చేసింది. అలాంటి ప్రదేశాలే ఉండాలని నా అభిప్రాయం. అప్పుడు అందరూ అందరి పండుగల్లో పాలుపంచుకుంటారు. మాతమార్పిడులు, తీవ్రవాదం, మతకలహాలు, విభజన, ద్వేషం వంటివాటికి తావుండదు. అటువంటి వాటినుండి బయటపడేందుకే భగవంతుడు ఇలాంటి వివాదాల రూపంలో ఒక అవకాశాన్ని ఇచ్చాడని భావించాలి .

ఎకనామిక్ టైమ్స్ సౌజన్యంతో...