సత్యాన్వేషణ కమిటీ నివేదిక:
సామాజిక సమరసతా వేదిక, ఆంధ్ర ప్రదెశ్
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరకపఱ్ఱు గ్రామస్థులు చేసిన షెడ్యూల్డ్ కులస్థుల సామాజిక బహిష్కరణను ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, అన్యాయం, అమానుషం మరియు చట్టవిరుద్ధం.
గరకపఱ్ఱు గ్రామ కోనేరు ఒడ్డున మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు మరియు కాటమరాయుడు విగ్రహాలు ఉన్నాయి. వాటి పక్కనే అంబేడ్కర్ విగ్రహాన్ని స్థాపించాలనుకున్నారు అక్కడి SC కులస్థులు. ఊరి పెద్దలు మాత్రము ఆ విగ్రహాన్ని వాళ్ళ కాలనీలోనే పెట్టుకోమని సలహానిచ్చారు. కానీ ఆ కులాల వారు మత్రము ఆ కోనేరు ఒడ్డుపైన ఉన్న విగ్రహాల పక్కనే స్థాపించాలని పట్టుబట్టారు. వారు తమ మాట విననందుకు మిగతా అగ్రకులాల వారందరినీ పిలిపించి వీళ్లని వెలివెయ్యాలని నిర్ణయించారు.
అంబేడ్కర్ కేవలం SC కులాల నాయకుడే కాదు. జాతీయ నాయకుడు. ఆతని విగ్రహాన్ని వాళ్ళ కాలనీలోనే ప్రతిష్ఠించుకోమనడం సబబు కాదు. ఇందుకూరి బాలరాజు స్థానీయ SC కులస్థులతో మంచి సంబంధాలు పెట్టుకొని వారి అభివృద్ధికై పనిచేసినప్పటికీ తన, ఊరి పెద్దల కుల తారతమ్య బేధ భావనలే ఈ అవాంచిత సంఘటనకు కారణం.
ఈ పరిస్థితి యొక్క ఉద్రిక్తతను సరిగ్గా అంచనా వేయలేకపోయారు స్థానీయ రెవెన్యూ మరియు పోలీసు అధికారులు. అందువలన తమ రాజ్యాంగ బాధ్యతలను వారు విధిపూర్వకంగా నిర్వర్తించలేకపోయారు.
కోరుతున్నవిః
1) వెలివేయబడ్డ SC కులాల వారికి ప్రభుత్వమే ఆర్థిక, సామాజిక సహాయాలందజేయాలి
2) గ్రామస్థులు తత్క్షణమే SC కులాలపై విధించిన వెలివేతను వెనక్కు తీసుకోవాలి
3) గ్రామస్థులే స్వయంగా మిగతా విగ్రహాలకు పక్కనే అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించేందుకు ముందుకువచ్చి నడపాలి.
ఊరి పెద్దలు, నాయకులు ప్రతిష్ఠ, అహంకారానికి పోకుండా గరకపఱ్ఱు గ్రామంలో సామాజికంగా వివిధ కులవర్గాలలో సమరసతా నెలకొనేలా కృషి చెయ్యాలని సామజిక సమరసతా వేదిక వారు అర్థిస్తున్నారు. సామాజిక సమరసతా ద్వారానే గ్రామంలో అభివృద్ధి, పురోగతిని సాధించగలుగుతాము.
మరి కొన్ని అంశాలుః
1) ఏప్రిల్ 23న కోనేరు ఒడ్డున ఉన్న మిగిలిన విగ్రహాల పక్కనే అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
2) 24న రాత్రి ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది.
3) స్థానీయ SC కులస్థులు శాంతియుతంగా ధర్నా, ప్రదర్శనలను చేస్తున్నారు.
4) ఏప్రిల్, మే, జూన్ – మూడు నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం నుండి సుముఖత లేకుండా ఉన్నది
5) జూన్ 26న రాష్ట్రీయ ఎస్.సీ కమిషన్ సభ్యులు శ్రీరాములు వచ్చి చూసారు. ఆ తరువాత 28న రాత్రి ఇందుకూరి బలరామరాజు, మరి యిద్దరును అరస్టు చేసారు.
6) గరకపఱ్ఱు గ్రామ ఎస్.సీ కాలనీలో బహుళంగా క్రైస్తవులు ఉన్నారు. అందువలన ఇప్పుడు క్రైస్తవ, కాంగ్రెస్, వామపక్ష కూటమి కలిసి ‘ఈ బాధాకరమైన సంఘటనల వెనుక RSS, BJP ఉన్నాయ’ని అసత్య, ద్వేషపూరిత ప్రచారం కొనసాగిస్తున్నారు.
7) జూన్ 29న SC/ST హక్కుల సంక్షేమ వేదిక యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి. బూసిరాజు గారు ఆ గ్రామానికి వేంచేసి ఇరుపక్షాలవారిని సంప్రదించారు. ఎస్.సీ నాయకులను ఈ సంఘటనల వెనుక RSSకు గల సంబంధాలను నిరూపించమని సాక్ష్యాలను కోరగా అందరూ మౌనం వహించారు.
MGK మూర్తి, IAS(R), సమరసతా వేదిక రాష్ట్రీయ అధ్యక్షులు,
ప్రతాపరాజు, సామాజిక సమరసతా వేదిక పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు,
రామకృష్ణ, సామాజిక సమరసతా వేదిక జిల్లా కార్యదర్శి