Home Telugu బోనమెత్తిన లష్కర్

బోనమెత్తిన లష్కర్

0
SHARE

మహంకాళి అమ్మవారి బోనాల సంబురం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం లష్కర్ బోనాలను ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. సింకిందరాబాద్‌లో ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, పెద్ద పెద్ద హోర్డింగులు, విద్దుత్ దీపాలంకరణలతో పండుగ శోభ సంతరించుకుంది. తొలి బోనం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు సమర్పించుకోగా, గవర్నర్ సతీసమేతంగా ఉత్సవాలకు హాజరయ్యారు. సిఎం కేసిఆర్ భార్య శోభ, కుమార్తె ఎంపీ కవిత అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

అమ్మా బయలెల్లినాదో..

అమ్మ బయలెల్లినాదో.. అమ్మ తల్లీ బయలెల్లినాదో నినాదాలతో లష్కర్ మార్మోగిపోయంది. ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో సికంద్రాబాద్ ఉజ్జయనీ మహంకాళి ఆలయం ప్రాంతం ఆదివారం అమ్మ నామస్మరణతో తరించింది. బోనాలు సంబురాలతో అశేష భక్త జనవాహిని పులకించిపోయంది. జంట నగరాలతో పాటు రాష్టవ్య్రాప్తంగా లక్షలాది మంది బోనాలు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మకు బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకొన్నారు. చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా సికిందరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఫలహారం బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. చీకటిపడే సమయానికి రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య, కళ్లు మిరుమిట్లు గొలిపే వర్ణాలతో డప్పు వాయిద్యాలతో ఫలహారం బండ్ల ఊరేగింపులు చూడముచ్చటగా కొనసాగాయి. పలుచోట్ల మంత్రి తలసాని తీన్మార్ స్టెప్‌లు వేసి తమ అనుచరుల్లో ఆనందాన్ని రెట్టింపు చేయటంతోపాటు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఉదయం అమ్మవారిని దర్శించుకున్న వారిలో ముఖ్యమంత్రి సతీమణి శోభ, గవర్నర్ నర్సింహన్ దంపతులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, స్పీకర్ మధుసూదానాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్‌లతోపాటు ఎంపిలు కవిత, మల్లారెడ్డి, కేశవరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌తోపాటు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సాయన్న, మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షడ్కర్, సర్వేసత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, జీహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి దంపతులు, టిడిపి నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఎన్. శ్రీనివాస్, కూనా వెంకటేష్ గౌడ్, మేకల సారంగపాణి, నగర అధ్యక్షులు నేతలు ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు, క్రీడాకారిణి పివి.సింధు ఉన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి :ఎంపి కవిత

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులను ఆదుకోవడానికి వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకున్నట్టు నిజామాబాద్ ఎంపి కె. కవిత అన్నారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి దిశలో పయనించే విధంగా అమ్మవారు అనుగ్రహాన్ని, ఆశీస్సులను అందించాలని కోరినట్టు ఆమె తెలిపారు.

ఎప్పటికపుడు పర్యవేక్షణ

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దేవాలయ ఆవరణలోనే ఉదయం నుంచి తిష్టవేసి భక్తులకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను ఎప్పటికపుడు పర్యవేక్షించారు. మధ్యాహ్నం తర్వాత సికిందరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారికి బోనాలు, తొట్టెలు, టెంకాయలను సమర్పించి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఉత్సవాలు ఆనందోత్సవాలకు ప్రతీకగా జరిగేందుకు, ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు అడుగడుగునా నిఘాను ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా కన్పించిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు చారిత్రక దేవాలయాలకు వచ్చిన ఊరేగింపులను పోలీసు అధికారులకు ఎప్పటికపుడు పర్యవేక్షించారు. పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, అదనపు ట్రాఫిక్ కమిషనర్ రవీందర్, అదనపు క్రైం కమిషనర్ జితేందర్, నార్త్‌జోన్ డిసిపి సుమతి బందోబస్తును పర్యవేక్షించారు.

దొంగల హల్‌చల్

లష్కర్ బోనాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని పోలీసులు చెబుతున్నా దొంగలు తమ పని తాము చేసుకుపోయారు. ఉదయం 11 గంటల సమయంలో అమ్మవారికి బోనం, టెంకాయ సమర్పించేందుకు క్యూలైన్‌లో ఉన్న మహిళా భక్తులను టార్గెట్ చేసి కొందరు గుర్తుతెలియని యువకులు వారి మెడలో నుంచి ఆభరణాలను తస్కరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.

నేడు రంగం

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయని మహంకాళి దేవాలయంలో బోనాల ఘట్టం ముగియడంతో సోమవారం ఉదయం రంగం కార్యక్రమం కొనసాగనుంది. రాష్ట్ర, దేశ భవిష్యవాణిని స్వర్ణలత వినిపించనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు రంగం కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. అనంతరం అంబారి ఉరేగింపును నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. ఈ అంబారి ఉరేగింపు సికింద్రాబాద్ అమ్మవారి దేవాలయం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మెట్టుగూడ వరకు కొనసాగుతుంది.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)