Home Telugu డోక్లామ్లో చైనా కు చెక్! టెంట్లు వేసుకుంటున్న మన సైన్యం

డోక్లామ్లో చైనా కు చెక్! టెంట్లు వేసుకుంటున్న మన సైన్యం

0
SHARE
  • -అవసరమైతే యుద్ధానికి సిద్ధం!
  • -వ్యూహం మార్చిన ఇండియా..
  • -డోక్లామ్‌లో టెంట్లు వేసుకుంటున్న సైన్యం
  • -అవసరమైన సామగ్రి సరఫరా చేస్తున్నామన్న రక్షణశాఖ

భారత్-చైనా-భూటాన్ ట్రైజంక్షన్‌లో చైనా బెదిరింపులకు భయపడి వెనుకకు తగ్గే ప్రసక్తే లేదని భారత సైన్యం తేల్చి చెప్పింది. వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో టెంట్లు వేసుకొని సుదీర్ఘకాలం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నది. డోక్లామ్‌లోని భారత సైన్యానికి అవసరమైన సరుకుల రవాణా సాఫీగా కొనసాగుతున్నదని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొంటామని ధీమా వ్యక్తంచేశాయి. వెనుకకు తగ్గితేనే చర్చలు జరుపుతామన్న చైనా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనన్న గట్టి సంకేతాలు పంపినట్టయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దు సమస్యపై మరోవైపు చైనా కూడా ఏమాత్రం వెనుకకు తగ్గడం లేదు. రాజీ ప్రసక్తే లేదని, బంతి భారత్ కోర్టులో ఉన్నదని తేల్చి చెప్తున్నది. భారత్ తన సైన్యాన్ని వెనుకకు తీసుకుంటే తప్ప చర్చలకు తావు లేదని స్పష్టం చేస్తున్నది. ఇలా సరిహద్దు సమస్యలు ఏర్పడినప్పుడు వివిధ స్థాయిల్లో చర్చలు జరుపాలని, ఫ్లాగ్ మీటింగుల ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్, చైనా 2012లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో 19 సార్లు చర్చలు జరిగాయి.

అయితే గత మూడు వారాలుగా రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నా పరిష్కారం చూపే దిశగా అడుగులు పడటం లేదు. ఈశాన్య రాష్ర్టాలను భారత్‌లోని మిగతా భూభాగానికి కలిపే కీలక ప్రాంతమైన ట్రైజంక్షన్ వరకు రోడ్డు నిర్మించాలని చైనా ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చైనా రోడ్డు నిర్మాణం పూర్తయితే సైనికపరంగా ఆ దేశానికి ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. అయితే రక్షణ పరంగా, పాలనాపరంగా భారత్‌కు ఎన్నో సమస్యలు ఏర్పడుతాయి. ఈ నేపథ్యంలో చైనా తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునేవరకు పరిస్థితిలో మార్పు ఉండదని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు తాజా ఉద్రిక్తతలపై చర్చించేందుకు భూటాన్, చైనా సిద్ధమయ్యాయి. డోక్లామ్ ప్రాంతం భూటాన్ సరిహద్దులో ఉన్నది. ఈ ప్రాంతాన్ని భారత్ డోకాలా అని పిలుస్తుండగా, చైనా డోంగ్లాంగ్‌గా వ్యవహరిస్తున్నది. ప్రస్తుతం భూటాన్‌కు చైనాతో ఎటువంటి సంబంధాలు లేవు. భారత్‌తో సఖ్యంగా ఉంటూ ద్వైపాక్షిక, రక్షణ రంగ సహాయాన్ని పొందుతున్నది.

ఇది చైనాకు కంటగింపుగా మారింది. సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో.. డోక్లామ్ నుంచి వెనక్కి తగ్గకూడదని భారత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అక్కడే సుదీర్ఘంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది. సైన్యానికి అవసరమైన సామగ్రిని పంపేందుకు ఆర్మీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. డోంగ్లాంగ్ తమ ప్రాంతమని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని తాము పదే పదే హెచ్చరిస్తున్నా, భారత్ ససేమిరా అంటుండటం చైనాకు మింగుడుపడడంలేదు. పైగా అక్కడ టెంట్లు వేసుకుని సుదీర్ఘంగా ఇక్కడే ఉంటామన్న సంకేతాలు ఇవ్వడంతో డ్రాగన్ దేశం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నది. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నాలుగోవారానికి చేరింది. డోక్లాంలో రక్షణ పరంగా స్థిరంగా నిలబడిన భారత్, దౌత్యపరంగా మిత్రదేశాలన్నింటినీ ఏకం చేస్తున్నది. మీరు స్థిరంగా ఉండండి. మీరు ఎదురుతిరిగేవరకు వాళ్లు గట్టిగాతోస్తూనే ఉంటారు. వాళ్లకు సెంటిమెంట్లేమీ లేవు. వారిని నిలువరించడానికి అంతర్జాతీయ నిబంధనలు సరిపోవు అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా గురించి చెప్పిన మాటలు ఇక్కడ గమనార్హం.

భారత ఆర్మీకి త్వరలో 1.85లక్షల అత్యాధునిక తుపాకులు

దేశీయంగా రూపొందించిన తుపాకులను ఆర్మీ తిరస్కరించిన నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాల కొనుగోలు ప్రక్రియను కేంద్రప్రభుత్వం వేగవంతం చేసింది. కాలంచెల్లిన ఇన్సాస్ తుపాకుల స్థానంలో 1.85లక్షల హైకాలిబర్ తుపాకుల కొనుగోలుకు సిద్ధమైంది. సరిహద్దుల్లో అవసరాల కోసం 65వేల అత్యాధునిక తుపాకులు తక్షణమే కావాలన్న ఆర్మీ ఒత్తిడిమేరకు 20 ఆయుధ కంపెనీలతో ప్రభుత్వం చర్చించింది. వీలైనంత వేగంగా ఆయుధాలు దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. భారత ఆర్మీ తీవ్రమైన ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నది. గత నెలలో ఇచాపోర్ ప్రభుత్వ కర్మాగారం నుంచి వచ్చిన తుపాకులను తీసుకునేందుకు సైనికులు విముఖత వ్యక్తంచేశారు. నాణ్యతలేమి, తక్కువ పేలుడుసామర్థ్యం ఉన్న ఆ తుపాకులు తమ అవసరాలు తీర్చలేవని ఆర్మీ కూడా పేర్కొన్నది . బరువు తక్కువగా ఉండి 500 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఆధునిక తుపాకులు అవసరమని స్పష్టంచేసింది. దీంతో ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు సిద్ధమైంది.

(నమస్తే తెలంగాణ సౌజన్యం తో)