Home News నదుల పునరుజ్జీవానికి ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ నేతృత్వంలో ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’

నదుల పునరుజ్జీవానికి ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ నేతృత్వంలో ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’

0
SHARE
  • తిరువనంతపురం నుంచి దిల్లీ వరకూ యాత్ర
  • సెప్టెంబరు 3 నుంచి ప్రారంభం…
  • ఆ నెల 13న అమరావతి, 14న హైదరాబాద్‌కు రాక

మరో ఉద్యమం! మానవ జీవన వికాసానికీ… సంస్కృతి, నాగరికతలు వెల్లివిరియడానికి మూలమైన నదులను పరిరక్షించుకునేందుకు, కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకూ సాగే మహోద్యమం!

ఇదేమీ నిరసన కాదు. ఆందోళనా కాదు. నదులు ఎండిపోతుండటంపై జనాన్ని జాగృతంచేసే ప్రచారం. నీళ్లను వాడే ప్రతి ఒక్కరూ ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’లో భాగస్వాములవ్వాలి.- జగ్గీ వాసుదేవ్‌

నదుల పరివాహక ప్రాంతాల చుట్టూ చెట్లను నాటడం ద్వారా జీవనదులు అంతరించిపోకుండా కాపాడుకోవచ్చంటూ, ప్రజలకు అవగాహన కలిగించేందుకు ‘ఇషా ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ దీనిని చేపడుతున్నారు.

గోదావరి అధిక భాగం ఎడారిని తలపిస్తోంది. గంగమ్మ పరిస్థితి మరీ ఘోరం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ నది ఉందని ప్రపంచ వన్య నిధుల సంస్థ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో చాలా జీవనదులు ఇప్పుడు ఏడాదిలో కొన్నినెలలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. మరెన్నో ఉపనదులు తమ ఉనికినే కోల్పోయాయి. కావేరి, నర్మదా నదులు 40-60% కుంచించుకుపోయి, క్రమంగా జలకళను కోల్పోతున్నాయి. తగినంత ప్రవాహం లేక ఏడాదిలో నాలుగు నెలలు అసలు సముద్రం దరికైనా పోవడంలేదు. మరోవైపు… 1947తో పోల్చితే, ప్రస్తుతం ఒక్కొక్కరికి అందుబాటులో ఉన్న నీళ్లు 75% తగ్గిపోవడం గమనార్హం. ఇషా ఫౌండేషన్‌ పరిశోధకుల అంచనా ప్రకారం, పరిస్థితి ఇలాగే కొనసాగితే… 2030 నాటికి దేశంలోని జలావసరాలకు కటకట ఏర్పడుతుంది. కేవలం 50% నీరే అందుబాటులో ఉంటుంది. దేశంలో నాలుగోవంతు భూభాగం ఎడారిగా మారిపోయే ప్రమాదముంది. ఈ పరిస్థితిని మార్చి, జీవ నదులను కాపాడుకోవాలంటే.. ప్రతి ఒక్కరికీ నదుల ఆవశ్యకత పట్ల అవగాహన తప్పనిసరి. అందుకే… ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, ప్రజల భాగస్వామ్యంతో జగ్గీ వాసుదేవ్‌ ‘నదుల కోసం ప్రచారం (ర్యాలీ ఫర్‌ రివర్స్‌)’ చేపడుతున్నారు.

కోయంబత్తూర్‌లో ఆరంభమై…

సెప్టెంబరు 3న కోయంబత్తూర్‌లో ప్రారంభమయ్యే ఈ ర్యాలీ… కన్యాకుమారి, తిరువనంతపురం, మధురై తిరుచురాపల్లి, మధురై, బెంగళూరు, చెన్నై మీదుగా సాగుతుంది. సెప్టెంబరు 13న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి, 14న హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ముంబయి మీదుగా అక్టోబరు 1న హరిద్వార్‌కు చేరుకుని, 2న దిల్లీలో ముగుస్తుంది. 13 రాష్ట్రాలు, 6,560 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రచార యాత్రలో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ పాల్గొంటారు. 20 ప్రధాన నగరాల్లో నిర్వహించే వైవిధ్య కార్యక్రమాల్లో శేఖర్‌కపూర్‌, తమన్నా, రాకేశ్‌ ఓంప్రకాశ్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, జూహీచావ్లా తదితర సినీ ప్రముఖులు, ప్రభుత్వ నేతలు కూడా భాగస్వాములవుతారు. దిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి ‘‘నదుల పునరుజ్జీవ విధానపత్రం’’ సమర్పించడంతో ఈ ర్యాలీ ముగుస్తుంది.

ఏం చేయవచ్చు?

* ప్రతి నదికీ రెండు వైపులా కిలోమీటరు మేర మొక్కలు, చెట్లను నాటడం ద్వారా జలవనరులను పరిరక్షించుకోవచ్చని ‘ఇషా’ పరిశోధకులు భావిస్తున్నారు.

* నదీ పరివాహకంలోని ప్రభుత్వ స్థలాల్లో స్థానికంగా బాగా ఎదిగే మొక్కలను నాటడం, తవ్వకాలు నిలిపివేయాలి.

* పరివాహకంలోని ప్రైవేటు స్థలాల్లో పండ్ల మొక్కలను పెంచాలి.

మూడు దశల్లో…

‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ మూడు దశల్లో సాగుతుంది.

1) ప్రభుత్వ విభాగాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలవారికి, నదులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉండటం పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కలిగిస్తారు.

2) నదుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో పటిష్ఠ విధానపత్రాన్ని రూపొందిస్తారు.

3) దానిని సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేస్తారు.

* 80009 80009 ఫోన్‌ నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా ఎవరైనా ఈ కార్యక్రమానికి తమ మద్దతు తెలపవచ్చు. పాల్గొనవచ్చు.

(ఈనాడు సౌజన్యం తో)