కొద్దిరోజుల క్రితం మీడియాలో వచ్చిన – మన పొరుగు దేశపు అవాంఛనీయ, అనాగరికతా తత్త్వ పూర్వక వార్త ఏమంటే.. ‘పాకిస్తాన్‌లోని సింధు రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘనలు, బలవంతపు మతమార్పిడులు యథేచ్ఛగా జరుగుతున్నాయి’ అని. సీతారామ్ ఏచూరి వంటి వామపక్షవాదులు, జాతీయవాద స్పృహే లేని కుహనా లౌకికవాది రాహుల్ గాంధీ, గోబెల్ ప్రచార మార్గాగ్రేసర అరుంధతీ రాయ్, అవకాశవాద రాజకీయ ఉద్దండులైన ములాయం సింగ్, లాలూప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీలు, కుర్చీ దిగిపోతూ దేశంలోని మెజారిటీ మతస్తులను కించపరుస్తూ మాట్లాడిన మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ బాపతు వాళ్లు నిరంతరం తిడుతూ వుండే ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్ దళ్, ఆర్యసమాజ్, విశ్వహిందూ పరిషత్, దుర్గావాహని.. ఇంకా ఎవరో హిందువులు పుట్టించిన పు కారు కాదు ఇది. భారత జాతీయవాద ముఖ్యమంత్రులు కానే కాదు, నిప్పులాంటి నిజాల్ని చెప్పే కొన్ని జాతీయవాద ప్రింటు మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు అసలే కాదు.
మరి ఎవరు..? సాక్షాత్తూ ఎక్కడో కొన్ని వేల మైళ్ల దూరంలో వున్న, హిందూ-మహ్మదీయ మతతత్త్వాలను గురించి ఏ మాత్రం తెలియని, వాటితో సంబంధం లేని అమెరికా పార్లమెంటేరియన్ల బృందం వ్యక్తం చేసిన ఆందోళన ఇది. అది కూడా అధికారికం గాను, లిఖితపూర్వకం గాను. ఈ కట్టెదుటి కరకు నిజాన్ని అధ్యయనం చేసి మరీ అమెరికా విదేశాంగ శాఖకు తెలియజేసింది ఆ పార్లమెంటేరియన్ల బృందం. ఇంకా ముందుకు వెళ్లి- ‘అమెరికా పాకిస్తాన్‌తో జరిపే చర్చల్లో ఈ అంశానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వాల’ని ఆ బృందం మరీ విజ్ఞప్తి చేసింది. ఆమేరకు అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల విభాగం తాత్కాలిక కార్యదర్శి అలైస్ జి.వెల్స్‌తోపాటు క లసి ఆ బృందం పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారికి ఈనెల 17న లేఖ కూడా రాసింది. ‘సింధు రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిపోతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నాయకత్వపు మార్పిడి జరిగినందున పాకిస్తాన్ పట్ల అనుసరించే విధానంపై అమెరికా సమీక్ష జరపాలని భావిస్తున్నాం. ఇక మీదట పాక్ ప్రభుత్వంతో మీరు జరిపే చర్చలలో మానవ హక్కులతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు తగినంత ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం’’ అని బ్రాడ్ షెర్మన్ నేతృత్వంలోని పార్లమెంటేరియన్ల బృందం ఆ లేఖలో పేర్కొంది. ఇలాంటి విషయాలేవీ చాలా పత్రికలలో కనిపించవు. ‘దేశంలో అసహనం పెరిగిపోయింది’, ‘మైనారిటీలు అభద్రతతో అల్లాడిపోతున్నారు’, ‘మైనారిటీలకు దిక్కేది?’, ‘హిందువులు సహనం పాటించాలి’.. అంటూ మాధ్యమాలలో అంతులేని కథనాలు.
ఇక, దాదాపు అన్ని రాజకీయ పార్టీలదీ ఒకటే ధ్యాస. ‘హిందువుల ఓట్లు ఎలాగూ చీల్తాయి.. మైనారిటీ ఓట్లే నిర్ణాయక బలం’. అవి అన్నీ గంపగుత్తగా తమ వాంఛిత లేక ప్రేరేపిత రాజకీయ పక్షానికే దక్కాలి. అందుకు ఏకైక మార్గం హిందువులను ఆక్షేపించడం, విమర్శించడం, హైందవేతరులకు అభిరుచికరంగా వార్తలు, వ్యాసాలు రాయటం, రాయించటం. ఇలాంటి వార్తలు మీడియాలో తరచూ వస్తున్నా ఏ హిందువూ కిమ్మనడు. ఏ కమ్యూనిస్టు నాయకుడినీ నిలదీయడు. ఏ మానవహక్కుల సంఘాల నేతనూ- ‘దీనికేమంటావు..? ప్రపంచ మానవుల్లారా! కార్మిక శ్రామిక కర్షకుల్లారా ఏకం కండి అంటూ గంటల తరబడి ఊదరగొడుతూ ఉద్ఘాటించే నీవు పాకిస్తాన్‌లోని మానవహక్కుల ఉల్లంఘన, మతోన్మాద చర్యలు, హింస గురించి ఎందుకు మాట్లాడవు?’ అని ఏ సగటు హిందువూ ప్రశ్నించడు.
తస్లీమా నస్రీన్ ఒక రచయిత్రిగా ఆమధ్య హైదరాబాద్ వస్తే కొందరు మైనారిటీ మత ఛాందసవాదులు నిండుసభలో కఠిన కర్కశ అసభ్య పదజాలంతో దాడిచేస్తే ఏ హిందువూ నిరసన తెలియపరచడు. ఉగ్రవాదులైన మెమెన్, అఫ్జల్‌గురు, బుర్హాన్ వనీలను సమర్ధిస్తే ఏ హిందువూ కోపగించుకోడు, బజారుకెక్కడు. ‘నా కంఠం మీద కత్తి పెట్టినా భారత్‌మాతాకీ జై’ అనే ప్రసక్తే లేదన్న ఒక మహానాయకుడికి కూడా ఇఫ్తార్ విందు ఇస్తాడు హిందువు. ‘అవును.. దేశంలో అసహనం, అభద్రత పెరిగిపోతున్నాయి కదూ అల్పసంఖ్యాకుల విషయంలో! గొప్ప మానవతావాదపు పోజులిచ్చే నేతల్లారా.. ఇప్పడే ఏమిటి? అనాదిగా మీలాంటి వారందరూ ఇదే రోకటి పాట పాడుతున్నారు.
ఎక్కడో వేల మైళ్ల దూరాన వున్న టర్కీ దేశపు ముస్లిం రాజును ఆంగ్లేయులు పదవీచ్యుతుణ్ణి చేస్తే ఇక్కడి కేరళలో మోప్లా మహమ్మదీయులు హిందువులను ఊచకోత కోశారు. ‘గాయపడ్డ మనస్సు ఏమైనా చేస్తుంది. హిందువులే నోరు మూసుకు పడుండాలి అన్నాడు’ కరంచంద్ గాంధీ. స్వామీ శ్రద్ధానందకు అనుచరుడుగా నటిస్తూనే ఆ మహాత్ముడు అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో పాశవికంగా పొడిచి చంపాడు ఒక మహ్మదీయుడు. మొన్న యాభై ఏళ్లనాడు కూడా హిందువుల సహనానికి పరీక్షే జరిగింది. కాశ్మీర్ హజ్రత్‌బల్ మసీదులోని మహ్మద్ ప్రవక్త శిరోజం మాయమైపోతే అది హిందువుల నేరం, ఘోరం అంటూ శివాలెత్తి అక్కడి ముసల్మానులు గాజు పెంకులతోను, పౌరహత్యా కాండతోను, రక్షకభటుల మీద దాడులతోను, జమ్ము-శ్రీనగర్‌ను రక్తంతో ముంచెత్తినపుడు కూడా యావద్భారత హిందువులు సహనం వహించారు. పైగా ఆ దురాగతం యావద్భారత దేశానికే జరిగిన నష్టం అన్నాడు పండిట్ నెహ్రూ ప్రధాని హోదాలో. చివరకు ఆ శిరోజాన్ని అపహరించిన వ్యక్తి ఒక మహమ్మదీయుడన్న చేదు నిజం బయపడ్డాకైనా ఏ హిందువూ కూడా మైనారిటీలను కనీసం క్షమాపణ అడగలేదు. ‘అవును, దేశంలో అసహనం, అభద్రత క్రమేపీ పెరుగుతున్నాయి’ కదూ!
రామాయణాన్ని ‘విషవృక్షం’ అన్నది కుతర్కంతో ఒక కుహనా మేధావిని. ‘సీత జోస్యం’ పేరుతో రామాయణాన్ని అపహాస్యం చేసాడు ఒకనాటి సంపాదక మహాశయుడు. పాంచాలీ-పార్ధసారథులకు అక్రమ భావ మానసిక సం బంధం అంటగట్టాడు- ఒక సాహిత్యపు పోజుల మోజుల రచయిత. వీళ్లనెవర్నీ ఏ సగటు హిందువూ విసుక్కోలేదు, విమర్శించలేదు, వీధిలోకి లాగలేదు, ఏ ఖండనోద్యమమూ చేయలేదు. ఏ ఆందోళనా చేపట్టలేదు. పవిత్ర వైవాహిక ధర్మమార్గ జీవనాన్ని స్వీయ సౌఖ్యైక ప్రధానమైన (స్వీయ సౌఖ్యవాదం)తో అవమానించిన ఒక కలాన్ని బలపరుస్తూ ‘‘అతను చెప్పేది కాదు… అతని వచన రచనా విన్యాసాన్ని, వాక్య శిల్పాన్ని మాత్రమే చూడండి’’ అని అంటూ ఇప్పటికీ అతనికి జయంతి-వర్ధంతి ఉత్సవాలు చేస్తున్న కొందరు సాహితీ అధ్యయనపరులే విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో ఆచార్యులుగాను, ప్రాచార్యులుగాను పదవుల సోపానాల మీదుగా పైపైకి పోతుంటే చేష్టలుడిగి చూస్తున్నది అమాయకపు హిందూ అక్షరాస్యులే.
‘అవును దేశంలో అసహనం, అభద్రత పెరిగిపోతున్నాయి’ కదూ! కుహనా లౌకికవాదుల్లారా? రోజూ వందల సంఖ్యలో నోరు లేని ఆవులు దీనంగా, మ్లానంగా కబేళాలకు మళ్లిపోతుంటే- చూస్తూ ఊరుకుంటున్న హిందువుల వల్లనే దేశంలో అసహనం, అభద్రత పెరిగిపోతున్నాయి కదూ! కావాలని నిజం చూడని కమ్యూనిస్టుల్లారా! నిన్నటికి నిన్న కర్నాటక ముఖ్యమంత్రి- ‘అవును.. నేను కావాలనుకుంటే ఇప్పటికిప్పుడే ఆవును కోసుకుతింటాను.. ఎవరొస్తారో చూస్తాను. రండి’’ అని బెదిరించినా ప్రతిస్పందించని సగటు హిందువులే ఎక్కువగా వున్న ఈ దేశంలో ‘అసహనం పెరిగిపోతోంది.. భద్రత లేదు’ అనగలుగుతారు ఏ అన్సారీ అయినా. ‘అబద్ధంవా సబద్ధంవా రావణేవ కుంతీపుత్రః’ అన్నట్టు ఏ సంకోచం లేకుండా, అన్యాయంగానైనా, ఆపద్ధర్మంగానైనా, అధర్మంగానైనా సరే ఇలాగే మాట్లాడడం కొందరికి అలవాటైనా- హిందువులు మాత్రం మౌనవ్రతం పాటిస్తారు.
తప్పు ఎవరు చేసినా ఏ పత్రికైనా సరే దాపరికం గాని, పక్షపాతం గాని లేకుండా రాయాలి. పత్రికా రచనకు, సంపాదకత్వానికి ప్రామాణికంగా నిలిచిన ముట్నూరి కృష్ణారావుగారి గురించి, వారి ‘కృష్ణా పత్రిక’ గురించి గత శతాబ్దంలోని ప్రఖ్యాత వ్యాస రచయిత పురాణం సూరిశాస్ర్తీ 1923 సంవత్సరాది ‘కృష్ణా పత్రిక’ సంచికలో ‘కృష్ణారాయుడు-కృష్ణాపత్రిక’ అనే వ్యాసం రాసారు. అందులో వారు ఆదర్శవంతమైన పత్రిక లక్షణాలను వివరిస్తూ ‘ఎలాంటి ఆటంకాలనైనా, లాభనష్టాలనైనా, ప్రభు, సంఘ విద్వేషాన్నైనా (వ్యతిరేకతనైనా) ధీరతతో ఓర్చి, అవిచ్ఛిన్నంగా నియత కాలానుగమనం కలవై, కాలప్రవాహాన్ని అనువర్తించి కూడా నిజ సంప్రదాయ పరతను విడవకుండాను, ప్రభువుల అసూయాదరాలను, ప్రజల తారుణికావేశాలను పాటింపకుండాను నిజ సత్త్వ ప్రభావాలను నిలుపుకున్న సద్గుణమే పత్రికలకు ఉండాల్సిన మొదటి గుణం’ అన్నారు. మరి ఈ సూక్తిని నేడు మాధ్యమాలలో పాటిస్తున్నవారు ఎందరు?
– శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం సెల్: 98497 79290
(ఆంధ్రభూమి సౌజన్యం తో)