సామాజిక సేవా భావం భారతీయ మూలాల్లోనే ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ జి భగవత్ పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో మెలకువలు నేర్పించడమే కాకుండా జీవితానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఉండాలని సూచించారు. జీఎంఆర్ సంస్థ 25 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. సాయం పొందిన వారు ఇతరులకు సాయం చేయాలని, నైపుణ్యం సాధించిన వారు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జీఎంఆర్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వరలక్ష్మి ఫౌండేషన్ రజతోత్సవం, ఢిల్లీ విమానాశ్రయం ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, జయంత్ సిన్హా కూడా పాల్గొన్నారు. తమ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, సామాజికాభివృద్ధి, సాధికారిత రంగాల్లో చేసిన కృషిని జీఎంఆర్ సంస్థల అధ్యక్షుడు గ్రంధి మల్లికార్జునరావు గుర్తు చేశారు. సామాజిక సేవ అనేది తమ డీఎన్‌ఏలోనే ఉందని ఆయన అన్నారు.
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)