Home News హైదరాబాద్ లో అక్రమ పెళ్ళిళ్ళు చేస్తున్న మూఠాతో పాటు 8 మంది అరబ్ షేక్ లు...

హైదరాబాద్ లో అక్రమ పెళ్ళిళ్ళు చేస్తున్న మూఠాతో పాటు 8 మంది అరబ్ షేక్ లు అరెస్ట్

0
SHARE
  • పెళ్లి పేరుతో దారుణాలు
  • రూ.లక్షలు పెట్టి పాతబస్తీ బాలికలు, యువతుల కొనుగోలు
  • ఆపై ఎడారి దేశాలకు తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం
  • ఎనిమిది మంది అరబ్‌ షేక్‌లకు అరదండాలు
  • సహకరించిన ఖాజీలు, దళారులు సహా 20 మంది జైలుకు

‘నిఖా’ పేరుతో బాలికలను పెళ్లి చేసుకుని… కొద్దిరోజులు ఇక్కడే వైవాహిక జీవితం కొనసాగించి… తర్వాత వారిని అరబ్‌ దేశాలకు తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది షేక్‌లను దక్షిణ మండలం పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వీరికి సహకరించిన ముంబయి ప్రధాన ఖాజీతో పాటు… మరో ఇద్దరు ఖాజీలు, ఐదుగురు బ్రోకర్లు, నలుగురు లాడ్జి యజమానులనూ అదుపులోకి తీసుకున్నారు. గోప్యంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని ఛేదించి, 12 మంది బాలికలను కాపాడినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారమిక్కడ విలేకరులకు తెలిపారు.

హైదరాబాద్‌ పాతబస్తీ బాలికలను పెళ్లి చేసుకునేందుకు 15 రోజుల క్రితం ఐదుగురు ఒమన్‌ షేక్‌లు అల్‌-సల్‌హి-తాలిబ్‌, మియాహీ హబీబ్‌ అలీ, నసీర్‌ ఖలీఫా, అల్‌-ఖాసీమీ హసన్‌, ఖతర్‌ వాసులు ఒమర్‌ మహ్మద్‌, హమద్‌ జబీర్‌, సఫేల్‌దిలన్‌ మహమ్మద్‌లు వేర్వేరుగా నగరానికి చేరుకున్నారు. పాతబస్తీలోని లాడ్జిల్లో దిగారు. బాలికలను పెళ్లి చేసుకుని తమ దేశాలకు తీసుకెళ్తామంటూ లాడ్జి యజమానులు, వివాహం జరిపించే ఖాజీలను సంప్రదించారు. రూ.3-10 లక్షల వరకూ నగదు ముట్టజెపుతామని, బాలికలను తీసుకురావాలని కోరారు. దీంతో వీరు స్థానిక దళారులతో కలిసి చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, మొగల్‌పురా, శాలిబండ ప్రాంతాలకు చెందిన పేద బాలికలను లాడ్జిలకు తీసుకొచ్చి, షేక్‌లతో మాట్లాడిస్తున్నారు. ఈ తతంగం నచ్చని ఓ బాలిక… ఐదురోజుల క్రితం పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యాన మూడు బృందాలు రంగంలోకి దిగాయి. మంగళవారం ఓ లాడ్జిలో ఒమన్‌ షేక్‌ హబీబ్‌ అలీ పెళ్లి చేసుకుంటుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నాలుగు లాడ్జిల్లోనూ తనిఖీలు నిర్వహించి ఒమన్‌, ఖతర్‌ షేక్‌లు, బ్రోకర్లు, లాడ్జిల యజమానులను అరెస్ట్‌ చేశారు.

ఆటో, అంబాసిడర్‌ వాలా.. ఇన్నోవా వాలా..

దుబాయ్‌ షేక్‌లు హైదరాబాద్‌, ముంబయి, పుణె, దిల్లీలకు రాకముందే గల్ఫ్‌లోని ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. వారు ఆయా నగరాల్లోని స్థానిక బ్రోకర్లతో మాట్లాడి… షేక్‌ల ఆర్థిక సామర్థ్యాన్ని సంకేత పదాలతో సూచిస్తున్నారు. ‘ఆటోవాలా, అంబాసిడర్‌కార్‌ వాలా’ అని చెబితే, చార్మినార్‌, చంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లోని లాడ్జిల్లో వారికి ఆశ్రయం కల్పించాలి. ‘ఇన్నోవా వాలా’ అంటే.. స్టార్‌ హోటళ్లు, రిసార్టుల్లో సౌకర్యాలు కల్పించాలి. తీరా షేక్‌లు వచ్చాక… వారి వ్యవహారాలను చూసుకునేందుకు హైదరాబాద్‌లో 35 మంది బ్రోకర్లు, పాతిక మంది మహిళలున్నట్టు తెలుస్తోంది. షేక్‌లకు బాలికలను, యువతులను చూపించడం.. నచ్చితే వివాహం చేసుకోవడానికి వారి తల్లిదండ్రులను ఒప్పించడం.. తర్వాత ఖాజీల వద్దకు తీసుకెళ్లి వివాహం జరిపించడం వీరి పని! ఇందుకు వీరు షేక్‌ల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారు. ఇలా పాతబస్తీలో నెలకు 10-20 వివాహాలు జరిపిస్తున్నారు. పెళ్లి కూతుర్లు మైనర్లయితే, వారి వయసును వీరే ఎక్కువచేసి చూపుతున్నారు.

సంప్రదాయబద్ధంగా నిఖా.. ఖాజీల ధ్రువీకరణ

పాతబస్తీలో 20 మందికిపైగా బాల్య వివాహాలు, రెండో పెళ్లిళ్లు చేసే ఖాజీలున్నారు. ఈ తంతుకు వీరు రూ.1-2 లక్షలు తీసుకుంటున్నారు. ఒమన్‌, ఖతర్‌ షేక్‌లకు పెళ్లిళ్లు చేసిన ఖాజీ హబీబ్‌ లీ, అలీఅబ్దుల్లా రఫియాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డబ్బు తీసుకుని దేశవ్యాప్తంగా విదేశీ వివాహాలు జరిపిస్తున్న ముంబయి ప్రధాన ఖాజీ ఫరీద్‌ అహమద్‌ఖాన్‌ను అక్కడే అరెస్ట్‌ చేశారు. ఫరీద్‌ ఇప్పటికే వేల సంఖ్యలో దుబాయ్‌ షేక్‌లకు నిఖాలు జరిపించాడు. సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించానంటూ రాయబార కార్యాలయాలకు ‘వివాహ ధ్రువీకరణ’ పత్రాలను ఇస్తున్నాడు. దొంగ పెళ్లిళ్లను చట్టబద్ధం చేసుకుని, బాలికలను దుబాయ్‌ తీసుకెళ్లేందుకు ఫరీద్‌ ఇచ్చిన పత్రాలు షేక్‌లకు ఉపయోగపడుతున్నాయి. ఈ వివాహాలపై అనుమానం రాకుండా… ముంబయిలోని గల్ఫ్‌ దేశాల రాయబార కార్యాలయాల అధికారులతో ఫరీద్‌ సత్సంబంధాలు నెరపుతున్నట్లు కొత్వాల్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆయన పాతబస్తీకి చెందిన బాలికను ఒమర్‌షేక్‌తో వివాహం జరిపించినట్టు ధ్రువీకరణ పత్రం ఇవ్వడమే కాకుండా… ఆమె ఒమన్‌ ప్రయాణానికి ఆటంకం లేకుండా కోల్‌కతాలోని కేంద్ర హోంశాఖ కార్యాలయం పేరున నకిలీ ధ్రువపత్రం కూడా సృష్టించాడని వివరించారు.

ఇలా పట్టుకున్నారు…

దుబాయ్‌ షేక్‌ల రాకపై బాలిక ఇచ్చిన సమాచారంతో దక్షిణ మండలం పోలీసులు అప్రమత్తమయ్యారు. సాధారణ దుస్తుల్లో వారున్న ప్రాంతాలకు వెళ్లి ఆయా స్థలాలను భౌగోళిక అనుసంధానం (జియో ట్యాగింగ్‌) చేశారు. మూడు రోజులపాటు బ్రోకర్లు బాలికలను తీసుకెళ్తున్నప్పుడు, షేక్‌లతో భేటీ తర్వాత ఇంటికి పంపుతున్నప్పుడు వీడియోలు తీశారు. పెళ్లి చేస్తున్నట్లు సమాచారం రాగానే డీసీపీ వి.సత్యనారాయణ, ఫలక్‌నుమా ఏసీపీ తాజుద్దీన్‌, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌రెడ్డిలు బృందాలుగా విడిపోయారు. ఎఫ్‌.కె.ప్లాజా, గాలిబ్‌ రెసిడెన్సీ, ఎం.జె.అనాజ్‌ గెస్ట్‌హౌస్‌, విన్‌సిటీ డెవలపర్స్‌ హోటల్‌లో దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది షేక్‌లతో పాటు… బ్రోకర్లు సికిందర్‌ఖాన్‌, గౌసియాబేగం, మహ్మద్‌ అసీఫ్‌, హబీబ్‌ఖాన్‌, అహమద్‌, లాడ్జిల యజమానులను అరెస్ట్‌ చేశారు. అరబ్‌ షేక్‌లను విచారించగా… తాము ఒప్పంద వివాహం చేసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. వీరితోపాటు 35 మంది దళారులు, నలుగురు లాడ్జి యజమానులు, తొమ్మిది మంది ఖాజీలపై ‘సస్పెక్ట్‌ షీట్లు’ తెరిచినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు.

ఈనాడు సౌజన్యం తో