Home News శ్రీ రాముని జన్మస్థలంలోనే మందిరం నిర్మాణం జరుగుతుంది : శ్రీ మోహన్ భాగవత్

శ్రీ రాముని జన్మస్థలంలోనే మందిరం నిర్మాణం జరుగుతుంది : శ్రీ మోహన్ భాగవత్

0
SHARE

ధర్మసంసద్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన పెజావర్ పీఠాధిపతి పూజ్య విశ్వేశతీర్థజీ మహారాజ్ ఏడాదిలోగానే అయోధ్యలో శ్రీరామ#vsమందిర నిర్మాణం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఇంతకుముందు కూడా ఉడిపి ధర్మసంసద్ లలో చేసిన ఏ సంకల్పమైనా సాకారమైంది. 1969లో అంటరానితనాన్ని తొలగించాలని సంకల్పిస్తే, 1985 సంసద్ లో శ్రీరామజన్మభూమి తాళాలు తెరవాలని సంకల్పించారు. ఆ రెండూ పూర్తి అయినట్లే ఈ మూడవ సంకల్పం కూడా పూర్తి అవుతుంది. ధర్మసంసద్ లో పాల్గొన్న సాధుసంతులు అందరూ ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరతాళ ధ్వనులు చేశారు. అంతరానితనాన్ని కాలకూటవిషంతో పోల్చిన పెజావర్ స్వామి దీనిని సమాజం నుండి తొలగించాల్సిందేనని అన్నారు. అలాగే దేశంలో అల్పసంఖ్యాక, అధికసంఖ్యాక ప్రజలనే భేదభావం తొలగిపోవాలని, ఇందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన అన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ మాట్లాడుతూ హిందూ సమాజం సునిశ్చితమైన విజయం దిశగా అడుగులు వేస్తున్నదని అన్నారు. ప్రపంచంలో హిందువులకు గౌరవం పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితిలో మన సమాజంలో సమరసత భావన చాలా అవసరమని అన్నారు. “అందరికీ ఒకే మందిరం, శ్మశానం, నీటి వనరు” ఉండాలని, ఇదే అభివృద్ధి మంత్రమని ఆయన అన్నారు. గోసంరక్షణ గురించి ప్రస్తావిస్తూ ఇది సమాజ సంకల్పమని, ఎవరో దుష్ప్రచారం చేస్తారని దానిని వదులుకోవలసిన అవసరం లేదని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఉద్యమం సాగించిన వారి ఆకాంక్షలకు అనుగుణంగా , వారు దేశం మొత్తం నుండి సేకరించి తెచ్చిన ఇటుకలతోనే , వారి నాయకత్వంలోనే భవ్య మందిర నిర్మాణం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే హిందూ సమాజపు కల సాకారం అవుతుందని అన్నారు.

సమావేశాన్ని ప్రారంభించిన జైన సాధువు శ్రీ వీరేంద్ర హెగ్డే మాట్లాడుతూ హిందూ సమాజం అతిపురాతనమైనదని అన్నారు. అనేక కుట్రలు, కుతంత్రాలు, దాడుల తరువాత కూడా హిందూ సమాజాన్ని సమాప్తం చేయలేకపోయారని, హిందువుదే అంతిమ విజయమని ఆయన అన్నారు.

విశ్వహిందూ పరిషత్ కార్యాధ్యక్షులు డా. ప్రవీణ్ భాయ్ తొగాడియా మాట్లాడుతూ మఠ మందిరాలను స్వాధీనం చేసుకోవడం, లేదా ధ్వంసం చేయడం ఏ మాత్రం సహించరాని విషయమని అన్నారు. అంతరానితనాన్ని సమాజం వదిలించుకోవాల్సిందేనని అన్నారు. గోరక్ష, రామమందిర నిర్మాణ సంకల్పాలను హిందూ సమాజం త్వరగా పూర్తిచేసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్, పూజ్య గోవిందా దేవ గిరిజీ మహరాజ్, డా. పరమానంద్ జీ , స్వామి నిర్మలానంద్ జీ, పరమార్థ్ నికేతన్ కు చెందిన పూజ్య చిదానందజీ హిందూ సమాజం నిర్ణయాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకునే సమయం ఆసన్నమైనదని, ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడే అది లభిస్తుందని అన్నారు.

పరమపూజ్య శివస్వామి అధ్యక్షతన జరిగిన రెండవ సమావేశంలో మాట్లాడుతూ స్వామి చిన్మయానందజీ రాబోయే రోజుల్లో పెద్దయెత్తున జనజాగరణ కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. ప్రతి హిందువు ఉగాది నుండి హనుమాన్ జయంతి (18 మార్చ్ నుండి 31 మార్చ్ ,2018 వరకు) తమ ఇష్ట దైవానికి సంబంధించి ప్రతిరోజూ కనీసం 108 సార్లు జపం చేయాలని పిలుపునిచ్చారు. 31 మార్చ్, 2018 హనుమాన్ జయంతి రోజున తమకు దగ్గరలోని దేవాలయంలో సమావేశమై సామూహిక హారతిని నిర్వహించి మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయేట్లు అనుగ్రహించాలని భగవంతుణ్ణి ప్రార్థించాలి. దేశ భవితవ్యం మార్చడంలో ఇలాంటి జనజాగరణ కార్యక్రమాల ప్రభావం ఎంతగానో ఉంటుంది. దీనివల్ల జాతీయ భావన, సామూహిక శక్తి పెంపొందుతాయి. తరువాతి ధర్మసంసద్ భవ్య రామమందిరంలో, రామ్ లలా అధ్యక్షతన జరగాలని స్వామీజీ అన్నారు. ధర్మసంసద్ లో పాల్గొన్న సాధుసంతులు అంతా `జైశ్రీరామ్’ అంటూ స్వామీజీ ప్రతిపాదనకు తమ మద్దతు తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న జ్యేష్ట పీఠాధిపతి డా. రామ్ విలాస్ దాస్ వేదాంతి, తమిళనాడుకు చెందిన అరుణాచల్ జీ మహరాజ్, స్వామి మహేంద్రనాథ్ జీ, ఆంధ్రప్రదేశ్ నుండి పరిపూర్ణానందజీ మొదలైన సాధుసంతులు కూడా జనజాగరణ వల్ల జాగృతమయ్యే జన శక్తి వల్ల భవ్య రామమందిర నిర్మాణం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పూజ్య విశ్వేశ తీర్థజీ, పూజ్య వీరేంద్ర హెగ్డే, స్వామి చిదానందజీ, స్వామి చిన్మయానందజీ, సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, డా. ప్రవీణ్ భాయ్ తొగాడియా తదితర ప్రముఖులు, సాధుసంతులు దీపప్రజ్వలన ద్వారా ధర్మసంసద్ ప్రారంభించారు. ఈ ధర్మసంసద్ లో 3వేల మందికి పైగా సాధుసంతులు పాల్గొన్నారు. గురుకులానికి చెందిన విద్యార్ధినులు వేదమంత్రోచ్ఛారణ ద్వారా మహిళా సాధికారతకు కొత్త మార్గాన్ని చూపారు.

డా. సురేంద్ర కుమార్ జైన్

సంయుక్త కార్యదర్శి, విశ్వహిందూ పరిషత్