- వెనుకబడిన, గిరిజన బాలలే లక్ష్యం.. జిల్లాల నుంచి పిల్లల తరలింపు
- ఆశ్రయం, చదువు పేరిట వల.. ఒకే గదిలో 16 మంది మైనర్ల నివాసం
- క్రైస్తవ బోధనలు .. నిర్వాహకులు కడపకు చెందిన దంపతులు
రాచకొండలో మరో మత మార్పిడి ముఠా గుట్టు రట్టయింది. వెనుకబడిన, గిరిజన బాలబాలికలే లక్ష్యంగా మత మార్పిడి చేస్తోందీ ముఠా. మేడిపల్లి ఠాణా పరిధిలో పర్వతాపూర్‌లోని ఒక ఆశ్రమంలో విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో 9 మంది బాలబాలికలను రక్షించారు. వారిలో నలుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు.
వీరంతా 14 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. ఇటీవల 17మందిని మైనర్లను అక్రమంగా ఇస్లాం మతంలోకి మారుస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల వ్యవధిలోనే మరో ముఠా బాగోతం బయటపడటం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం కడపకు జిల్లాకు దంపతులు మూడు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చారు.
మూడు నెలల క్రితం పర్వతాపూర్‌కు మకాం మార్చారు. అక్కడ ‘నజరత్ ఆర్ఫన్ చిల్డ్రన్ అండ్ హోం’ నిర్వహిస్తున్నారు. వీరు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సూర్యాపేట, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వెనుకబడిన, గిరిజన మైనర్లకు ఉచితంగా ఆశ్రయం కల్పించి చదువు చెప్పిస్తామని నమ్మించి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అనంతరం వారిని హిందూమతం నుంచి క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు ఆ హోంపై దాడి చేసి 9మంది మైనర్లను రక్షించారు.
అప్పటికే హోం నిర్వాహకులు 16 మంది మైనర్లను అక్కడ చేర్చుకొని మత మార్పిడి చేసి క్రైస్తవ బోధనలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హోం నిర్వాహకులైన దంపతులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. 16 మంది మైనర్లను హోం నిర్వాహకులు ఒకే గదిలో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఒకే గదిలో ఇంతమంది బాలలను ఉంచడం జువైనల్ చట్టం ప్రకారం నేరమని పోలీసులు తెలిపారు. అక్కడి క్రైస్తవ గ్రంథాలను, ఆ మతానికి సంబంధించిన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)