9 మంది పాక్ సైనికులు హతం..
దాయాది పోస్టులపై భీకర కాల్పులు
సరిహద్దు మరోసారి రగిలింది. దాయాది దేశం పాకిస్థాన్‌ను భారత దెబ్బకు దెబ్బ తీసింది. ముగ్గురు సహచరుల వీర మరణానికి సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని సైనిక పోస్టుల పోస్టులపై కౌంటర్ ఎటాక్ చేసింది. భారీ స్థాయిలో గుళ్ల వర్షం కురిపించింది.120 ఎంఎం మోర్టార్లు, మిషన్గన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో తొమ్మిదిమంది పాక్ జవాన్లు హతమయ్యారు. వీరిలో కెప్టెన్ స్థాయి అధికారి కూడా ఉండడం గమనార్హం. పాక్ బలగాలు మంగళవారం జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు మరణించారు. వారిలో ఒకరి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరకడాన్ని భారతసైన్యం తీవ్రంగా పరిగణించింది. దెబ్బకుదెబ్బ తీసింది. అయితే భారత కాల్పుల్లో తమ సైనికులు ముగ్గురే మరణించారని పాక్ ప్రకటించింది. మరో పదిమంది సాధారణ పౌరులు మరణించారని పేర్కొంది. భారత సైన్యం ప్రయోగించిన షెల్స్ ఓ ప్రయివేట్ బస్సు, అంబులెన్స్‌పై పడ్డాయని ఈ ఘటనలో పదిమంది మరణించారని పేర్కొంది. కవ్వింపు చర్యలు లేకుండానే భారత బలగాలు కాల్పులకు దిగాయని ఆరోపించింది. తాము దీటుగా తిప్పికొట్టామని, తమ సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు భారత జవాన్లు మరణించారని చెప్పింది. అయితే దీనిని భారత సైన్యం ధ్రువీకరించలేదు. కాగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా భారత బలగాలు ఏకపక్షంగా కాల్పులకు దిగిందని ఆరోపించారు. వారి ఉల్లంఘనకు ఇదే నిదర్శనమని చెప్పారు.
అమరులకు ఘన నివాళి
పాక్ సైనికుల కాల్పుల్లో మంగళవారం వీరమరణం జవాన్లు మనోజ్ కుమార్ కుశ్వాహ, ప్రభుసింగ్, శశాంక్ కుమార్ సింగ్‌లకు సైన్యం ఘన నివాళులర్పించింది. బాదామీబాగ్ కంటోన్మెంట్లో సైనిక ఉన్నతాధికారులంతా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
మన సైన్యంపై నమ్మకముంచండి: రాజ్‌నాథ్
కాగా.. మన సైన్యంపై నమ్మకముంచాలంటూ ప్రజలకు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశంలోని భద్రత వ్యవస్థపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా భారత పాక్ సరిహద్దు దగ్గరి పరిస్థితిని సమీక్షించారు. జాతీయ భద్రత సలహాదారు అజిత డోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
డీజీఎంవోల హాట్‌లైన్ చర్చలు
సరిహద్దులో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతుండడంతో ఇరు దేశాల డీజీఎంవోల మధ్య బుధవారం సాయంత్రం చర్చలు జరిగాయి. ముందుగా షెడ్యూల్ లేకుండా ఈ హాట్‌లైన్ చర్చలు జరగడం గమనార్హం. ఈ భేటీ కోసం పాక్ సైన్యమే విజ్ఞప్తి చేసిందని భారత సైన్యం వెల్లడించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడిచే ఎటువంటి చర్యనైనా తాము తీవ్రంగా తిప్పికొడతామని పాక్ డీజీఎంవోకు స్పష్టం చేసినట్లు తెలిపింది. అంతేకాక భారతలోకి చొరబడేందుకు పీవోకేలోని ముష్కరమూకలు యత్నించే అంశాన్ని కూడా భారత డీజీఎంవో పాక్ దృష్టికి తీసుకెళ్లినట్లు సైన్యం ప్రకటించింది. కాగా భారత కాల్పుల్లో సాధారణ పౌరులు మరణించడంపై డీజీఎంవో రణబీర్‌సింగ్ విచారం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన ప్రాంతాలపైనే తాము కాల్పులు జరిపామని పేర్కొన్నారు. పాక్ కాల్పుల్లో భారతవైపు కూడా సాధారణపౌరులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించాయి. భింబేర్ గలీ, కృష్ణా ఘటి, నౌషెరా సెక్టార్లలోని భారత పోస్టులపై కాల్పులకు తెగబడ్డాయి.