చాపేకర్ సోదరులు పూణేలోని చేంచువాడాకు చెందిన విప్లవ త్రయం. వీరి పేర్లు దామోదర్ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్, వాసుదేవ హరి చాపేకర్. ఒకే కుటుంబం నుండి ముగ్గురు అన్నదమ్ములు భరతమాత సంకెళ్లు తెంచడానికి ఉరిశిక్షను కూడా చిరునవ్వుతో స్వీకరించారు.
1896లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో తీవ్రమైన ప్లేగు వ్యాధి ప్రబలి వేలమంది ప్రజలు చనిపోగా చాలామంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. దాంతో బ్రిటీష్ ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్లేగు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యాధి నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి వాల్టర్ చార్లెస్ ర్యాండ్‌ను కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. అయితే ర్యాండ్ వైద్యులకు బదులుగా కొంతమంది సైన్యాన్ని తనకు మధ్దతుగా తీసుకుని వెళ్లి ప్రజలపై విరుచుకుపడ్డారు. బహిరంగంగానే మహిళలతో సహా అందరినీ పరీక్షల పేరుతో తనిఖీ చేస్తూ మతపరమైన చిహ్నాలను, ప్రదేశాలను ధ్వంసం చేశారు. బ్రిటిష్ వారి దురాగతాలన్నింటినీ బాలగంగాధర్ తిలక్ తన పత్రికలో రాశారు. బాలగంగాధర్ తిలక్ ద్వారా ప్రేరణ పొందిన ఈ చాపేకర్ సోదరులు ర్యాండ్ పై తగిన చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా ర్యాండ్‌ను చంపాలని నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా ఒక పథకం పన్నారు. అదే సమయంలో ఇంగ్లాండును పరిపాలించే విక్టోరియా మహారాణికి 60 సంవత్సరాలు నిండాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బ్రిటిష్ పాలకులు భారతదేశం అంతటా ఉత్సవాలు జరిపారు. పూణేలో కూడా 1897 జూన్ 22లో ఆ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంలో ర్యాండ్‌ను కాల్చి చంపాలని చాపేకర్ సోదరులు పథకం వేశారు. ఉత్సవాలకు హాజరై తిరుగు ప్రయాణమైన ర్యాండ్‌ను, అతని వెంటనున్న లెప్టినెంట్ అయిస్టర్‌ను కాల్చివేశారు చాపేకర్ సోదరులు. లెఫ్టినెంట్ అయిస్టర్ అక్కడికక్కడే చనిపోగా ర్యాండ్ కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వ విచారణలో చాపేకర్ సోదరులు ఈ హత్య చేసినట్లు తేలింది. వారు దామోదర్ చాపేకర్‌ను అరెస్టు చేశారు. అతన్ని దోషిగా నిర్ధారించిన కోర్టు 1898 ఏప్రిల్ 18న దామోదర్‌ను ఉరి తీసింది. ఆ సమయానికి అతని వయస్సు 27 సంవత్సరాలు. ఆ తర్వాత దామోదర్ సోదరుడైన బాలకృష్ణ కూడా పట్టుబడ్డాడు. 1899 మే8న వాసుదేవ చాపేకర్‌ను, మే12న బాలకృష్ణ చాపేకర్‌లను ఉరి తీశారు. అప్పుడు వాసుదేవ చాపేకర్ వయసు కేవలం 18 సంవత్సరాలు, బాలకృష్ణ చాపేకర్ వయస్సు 24 ఏళ్లు. అంతే కాకుండా ర్యాండ్ హత్యకు కేసరి పత్రికలో ప్రచురితమైన వ్యాసం… అందుకు బాలగంగాధర్ తిలక్ కారణమైనందున తిలక్‌ను కూడా బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు నిర్భంధంలో ఉంచింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉరికంబాన్ని సైతం ముద్దాడిన ఈ సోదరుల ప్రాణత్యాగం దేశవ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన అనేక విప్లవ కార్యకలాపాలకు స్ఫూర్తినిచ్చింది.