నిరంతరం కష్టపడాలే గాని ఎంత చిన్న పనిలో ఉన్నప్పటికీ ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చు. అదే మాటను నిరూపిస్తున్నారు బిహార్‌కు చెందిన మహిళ. ఆమె వీధులు శుభ్రం చేసే పని చేస్తూ తన కుమారులను మంచి చదువులు చదివించి, ఉన్నత స్థానంలో నిలిపారు. ఆమె పదవీ విరమణ రోజున ఆ కుమారులు తన పాదాలను స్పృశించి, తనను, తన కష్టాన్ని నలుగురి ముందు స్మరిస్తే ఉబ్బితబ్బిబ్బయ్యారు. జీవితమంతా పడిన తన కష్టం మొత్తాన్ని మరచిపోయారు. ఆమె గురించే ఈ వారం దారిదీపాలు.
సుమిత్రాదేవి జార్ఖండ్‌లోని రాజ్‌రప్ప సిసిఎల్ టౌన్‌షిప్‌లో 30 ఏళ్ళుగా వీధులు శుభ్రం చేస్తూ ఉండేది. కాని ఆమె పదవీ విరమణ అంత ప్రత్యేకంగా ఉంటుందని, ఆమె చివరి పనిదినం రోజు ప్రజలు ఆమెను అంతగా గౌరవిస్తారని కాలనీలో ఎవరూ ఊహించలేదు.
ఆమె చివరి పని దినం నాడు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆమెకు వీడ్కోలు చెప్పేందుకు తోటి సిబ్బంది, పొరుగువారు కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అందులో ఏ ప్రత్యేకతా లేదు. అవి ఏ నాలుగవ తరగతి ఉద్యోగికైనా చేసే సాధారణ వీడ్కోలు ఏర్పాట్లే. కాని అప్పుడే సందడి మొదలైంది. అకస్మాత్తుగా అక్కడికి మూడు కార్లు రావడంతో కార్యక్రమ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆ కార్లు అక్కడికి ఎందుకు వస్తున్నాయో తెలియక కార్యక్రమానికి వచ్చినవారు కాసేపు అయోమయంలో పడిపోయారు. ఎందుకు వచ్చాయో తెలిశాక ఆశ్చర్యపోవడం వారి వంతైంది.
మొదటగా వచ్చిన బుగ్గకారు అందరినీ ఆకర్షించింది. అందులోనించి దిగివచ్చిన అతను సుమిత్రాదేవి పాదాలకు నమస్కరించాడు. ఆయన బిహార్‌లోని సివాన్ జిల్లాకు కలెక్టర్. పేరు మహేంద్ర కుమార్. అప్పుడు సుమిత్రాదేవి అతనిని తన మూడవ కుమారుడుగా పరిచయం చేసింది. ఇప్పుడు అందరూ మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
అంతలోనే మరో రెండు కార్లలో వచ్చిన మరో ఇద్దరు పెద్ద మనుషులు ఆమెకు పాదనమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ ఇద్దరు సుమిత్రా దేవి మొదటి, రెండవ కుమారులు.
సుమిత్రాదేవి పెద్ద కుమారుడు వీరేంద్రకుమార్ రైల్వే ఇంజనీరు కాగా, రెండో కుమారుడు ధీరేంద్రకుమార్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక బీహార్ సివాన్ జిల్లా ప్రస్తుత కలెక్టర్ ఆమె మూడవ కుమారుడు.
భావోద్వేగంలో సుమిత్ర
తన ముగ్గురు కుమారులు తన పాదాలు స్పృశించి నమస్కరిస్తుండగా తల్లి సుమిత్రాదేవి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆమె చాలా సంతోషిస్తున్నట్లు ఆమె ఆనంద బాష్పాలే చెప్పాయి. ఇదంతా చూసి పదవీ విరమణ సందర్భంగా ఆమెను సన్మానించ డానికి అక్కడ చేరిన సుమిత్రాదేవి పై అధికారులు, తోటి సిబ్బంది ఆశ్చర్యచకితులయ్యారు.
‘సార్! ముప్ఫై ఏళ్ళ నుంచి నేను ఈ కాలనీ వీధులు శుభ్రం చేశాను. ఈ రోజు నా కుమారులు మీలాగే పెద్ద సాహెబ్‌లు అయ్యారు’ అంటూ ఉద్వేగానికి గురైన సుమిత్ర తన కుమారులను పై అధికారులకు పరిచయం చేసింది.
మా అమ్మ ఎంతో త్యాగం చేసింది
అటువంటి ధీరమహిళతో కలసి పనిచేయడం తమకు గర్వకారణమని తోటి ఉద్యోగులు పేర్కొనగా, తమ తల్లి తమను విజయపథంలో నడిపించిన గాథను ముగ్గురు కుమారులు అక్కడి సభికులతో పంచుకున్నారు.
‘మా అమ్మ మా కోసం ఎంతో త్యాగం చేసింది. మమ్మల్ని ఎప్పుడూ కుంగిపోనీయలేదు. బాగా చదువుకోవాలని, బాగా చదివితే ఏ ఆఫీసులోనైనా మంచి ఆఫీసర్లు కావచ్చుననీ మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహించేది. ఆమె నా తల్లి కావడం నాకు గర్వకారణం’ అని సివాన్ జిల్లా కలెక్టర్ మహేంద్ర కుమార్ చెప్పారు.
తమను మంచి చదువులు చదివించటం కోసం ఆమె ఎంతో కష్టపడి పనిచేసిందని సుమిత్రాదేవి మిగతా కుమారులు పేర్కొన్నారు. తమ తల్లి కష్టాన్ని చూసిన తరువాత సమాజానికి ఏదైనా మేలు చేయాలని తాము నిర్ణయించుకున్నామని ముగ్గురు కుమారులూ తెలిపారు.
అయినా ఆ పని మానలేదు
తన కుమారులు పెద్ద చదువులు చదివి, ఉన్నతోద్యోగాలు చేస్తున్నప్పటికీ సుమిత్రాదేవి మాత్రం వీధులు శుభ్రం చేయడం మానలేదు. ఉద్యోగాన్ని వదిలిపెట్టలేదు. దానికి బదులు ఆమె తన పనిని చాలా అంకితభావంతో కష్టపడి చేసింది. ‘నా పిల్లల్ని చదివించేందుకు ఈ ఉద్యోగమే నాకు ఆసరాగా నిలిచింది. నా కలలు నిజం చేసిన ఈ ఉద్యోగాన్ని ఎలా వదిలిపెడతాను?’ అంటూ సుమిత్రాదేవి తన మనోభావాలు పంచుకున్నారు.
కష్టేఫలి!
తమను పెద్ద ఆఫీసర్లుగా చేసిన తమ తల్లి తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్న సందర్భంలో సివాన్ జిల్లా కలెక్టరు మహేంద్రకుమార్ చాలా ఉద్వేగానికి గురయ్యారు. తను ఈ స్థాయికి రావడానికి తన తల్లి ఎంతో కష్టించిందని, ఆమె తనకు ఆదర్శమని అన్నారు.
చిన్న ఉద్యోగి అయిన తమ నాలుగవ తరగతి స¬ద్యోగి జీవితంలో ఇంత సాధించినందుకు సహోద్యోగులు గర్వపడుతున్నారు.
జిల్లా కలెక్టరు అయిన సుమిత్రాదేవి మూడవ కుమారుడు ఇచ్చిన భావోద్వేగ సందేశాన్ని సమావేశంలో పాల్గొన్న అందరూ ప్రశంసించారు.
‘జీవితంలో ఏ ఉద్యోగమూ కష్టం కాదు. నిజాయితీగా కష్టపడి పనిచేస్తే అన్నీ సాధ్యమే. మా తల్లి, మేము మా జీవితాల్లో చాలా కష్టకాలం ఎదుర్కొన్నాము. అయినప్పటికీ ఆమె మాకు ఇబ్బందులు తెలియనీయలేదు. నిరాశ మా దరిచేరనీయలేదు. ఆమె కష్టానికి తగినట్లు మేమంతా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మేం గర్విస్తున్నాం’ అన్నారు.
– రాంసి నడిమింటి
(జాగృతి సౌజన్యం తో)