Home News ఎందరికో స్ఫూర్తి రాంభావు హల్దేకర్‌జి

ఎందరికో స్ఫూర్తి రాంభావు హల్దేకర్‌జి

0
SHARE
రాంభావు హల్దేకర్‌జి

రాంభావు హల్దేకర్‌జి జీవితాన్ని చూసి ప్రేరణ పొంది ఎందరో స్వయంసేవకులు కార్యకర్తలయ్యారు. కొందరు జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ప్రచారకులుగా కూడా వచ్చారు. సిక్కిం మాజీ గవర్నర్‌ వి.రామారావు గారు మాట్లాడుతూ ‘రాంభావు హల్దేకర్‌జి మాకు గురువు లాంటివారు. శాఖ తర్వాత మా చదువుల గురించి పట్టించుకునేవారు. వారి సాన్నిహిత్యం వలనే నేను ఈ స్థాయికి ఎదగగలిగాను’ అన్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగరరావు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వీరందరు హల్దేకర్‌జీ సాన్నిహిత్యాన్ని మార్గదర్శనాన్ని పొందినవారే.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ జ్యేష్ఠ ప్రచారకులలో ఒకరైన రాంభావ్‌ హల్దేకర్‌జి స్వర్గస్తులయి 23 ఫిబ్రవరికి ఒక సంవత్సరం పూర్తయింది. మొదటి వర్ధంతి సందర్భంగా వారికి నా హృదయ పూర్వక శ్రద్ధాంజలి.

సమాజ హితం

మానవ జీవితం క్షణ భంగురం. దేశం చిరంతనం, శాశ్వతం. ఇతరుల హితం గురించి జీవించడమే మానవ జీవనానికి సార్థకత. భారతీయ సంస్కృతి మనిషికి ఇంతటి ఉన్నతమైన ధ్యేయాన్ని ఇచ్చింది. మానవతలోని ధర్మాన్ని మేల్కొలపడానికి ఈ భూమి ఎందరో మహా పురుషులకు జన్మ నిచ్చింది. మహాపురుషులు తమ మాతృభూమి ఋణం తీర్చుకోవడానికి వ్యక్తి జీవితం నుండి సమాజ జీవితం వైపు పయనించి సమాజ హితానికై తమ పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. ఈ ప్రయత్నంలో తమ ఇళ్ళను వదిలి దేశ కార్యానికై వచ్చేశారు.

త్యజేదేకం కుల స్యార్థ, గ్రామ స్యార్థే కులం త్యజేత్‌ |

గ్రామం జన పద స్యార్థే, ఆత్మార్థే పృథివీం త్యజేత్‌ ||

కుల రక్షణ కొరకు, అంటే ఒక ఇంటిలో ఉన్న పరివారాన్ని రక్షించడం కోసం ఒక వ్యక్తిని విడిచిపెట్టవచ్చు. అలాగే ఒక గ్రామాన్ని రక్షించడం కోసం ఒక కుటుంబాన్ని త్యాగం చేయవచ్చు. ఒక దేశాన్ని రక్షించడం కోసం ఒక గ్రామాన్ని వదలుకోవచ్చు. ఇక ఆత్మరక్షణ కోసం ఈ సమస్త భూమండలాన్ని త్యాగం చేయవచ్చు.

విశ్వకళ్యాణం కోసం సంత్‌ జ్ఞానేశ్వర్‌ తపస్సు చేశాడు. సమర్థ రామదాసు ఈ ప్రపంచమే నా ఇల్లు అంటూ ప్రజలలో ఐక్యతను నిర్మించడానికి కృషి చేశాడు.

ఇక స్వామి వివేకానందుడు కాళీ మాత దయతో జ్ఞాన, భక్తి వైరాగ్యాలతో తన ఇంటిని వదిలి సమాజ ఉద్ధరణకై జాతికి అంకితమయ్యాడు. హైందవ ధర్మోన్నతికై విదేశాలలో కూడ పర్యటించాడు.

ఇక డాక్టర్‌ కేశవరావు బలిరాం హెడ్గేవార్‌ వైద్య వృత్తిని అభ్యసించారు. వైద్యుడిగా వారు సుఖమైన జీవితం కొనసాగించవచ్చు. కాని హిందూ సమాజ సంఘటనకై తన కుటుంబాన్ని వదులుకున్నారు. సంఘకార్య విస్తరణకై ఎందరో ప్రచారకులను తయారు చేశారు. అందులో శ్రీ గురూజి ఒకరు. ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగిన శ్రీ గురూజి డాక్టర్జీ ప్రేరణతో సంఘ కార్యవిస్తరణకు నడుం బిగించారు.

భగినీ నివేదిత సమాజ సేవ కోసం తన ఇంటిని, దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చింది.

భగవద్గీతలోని పదవ అధ్యాయం విభూతి యోగంలో భగవాన్‌ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు – ‘ప్రతి వ్యక్తిలో ఒక దివ్యమైన తేజస్సు ఉంటుంది. కాని ఏ వ్యక్తిలో ఈ దివ్యాంశ ప్రకటితమౌతుందో ఆ వ్యక్తి జీవనం ఉదాత్త ధ్యేయ మార్గంలో కొనసాగుతుంది.

సంఘ శాఖలలో ఎన్నో దేశభక్తి గీతాలు నేర్పిస్తారు. ఆ గీతాల వలన స్వయంసేవకులు ప్రేరణ పొందేవారు. అలాగే వ్యక్తి నిర్మాణం జరిగేది. ఈ విధంగా వికసించిన కొన్ని జీవితాలు భారతమాత సేవకు అంకితమయ్యాయి. సంఘ కార్యపద్ధతిలో ఎందరో ప్రచారకులు సంఘ కార్య విస్తరణకై తమ జీవితాలను త్యాగం చేశారు. ఇలాంటి సమర్పిత, దేవదుర్లభ కార్యకర్తల వల్ల సంఘ వటవృక్షం దేశమంతటా విస్తరించింది. అటువంటి కార్యకర్తలలో ఒకరు స్వర్గీయ రాంభావు హల్దేకర్‌.

రాంభావు హల్దేకర్‌

రాంభావు హల్దేకర్‌ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా, అజంతా సమీపాన గల ఒక గ్రామంలో 5 ఫిబ్రవరి 1930లో జన్మించారు. ఔరంగాబాద్‌లోనే హైస్కూల్‌ చదువు పూర్తి చేశారు. ఆ తరువాత శాఖకు వెళ్ళడం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో బి.ఎస్సి. పూర్తి చేశారు. సంఘ ప్రేరణతో ఉద్యోగం, పెళ్ళి అనే విషయాలను పక్కన పెట్టారు. భారతమాత సేవ అన్నిటికన్నా ముఖ్యమని నిర్ణయించుకున్నారు. తన ఆహార అలవాట్లు, భాష, జీవన విధానం వేరుగా ఉన్నా, ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా తనను తాను మలచుకున్నారు. తెలుగు నేర్చుకున్నారు. రాంభావు హల్దేకర్‌జీలోని అత్యంత సుగుణం కార్యకర్తల పట్ల ఆత్మీయత కలిగి ఉండటం. దీనివల్ల ఎందరో స్వయంసేవకులు రాంభావు హల్దేకర్‌జీకి సన్నిహితులయ్యారు. తెలుగు ప్రాంతాలలో సంఘకార్య విస్తరణకు పునాది వేసింది వీరే. సంఘ కార్యంలో ఎన్ని అవరోధాలు ఏర్పడినా చాకచక్యంతో అధిగమించేవారు. నిరాశను దరికి రానిచ్చేవారు కాదు.

ఎందరికో స్ఫూర్తి

వీరి జీవితాన్ని చూసి ప్రేరణ పొంది ఎందరో స్వయంసేవకులు కార్యకర్తలయ్యారు. కొందరు జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ప్రచారకులుగా కూడా వచ్చారు. సిక్కిం మాజీ గవర్నర్‌ వి.రామారావు గారు మాట్లాడుతూ ‘రాంభావు హల్దేకర్‌జి మాకు గురువు లాంటివారు. శాఖ తర్వాత మా చదువుల గురించి పట్టించుకునేవారు. వారి సాన్నిహిత్యం వలనే నేను ఈ స్థాయికి ఎదగగలిగాను’ అన్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగరరావు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వీరందరు హల్దేకర్‌జీ సాన్నిహిత్యాన్ని మార్గదర్శనాన్ని పొందినవారే.

హల్దేకర్‌జి ప్రతి సంవత్సరం తను పుట్టిన ఊరికి వెళ్ళి అక్కడి మట్టిని నుదుటిన దిద్దుకొని ‘ఈ మట్టి నాకు దేశ సేవ చేసే భాగ్యం కలిగించింది’ అనేవారు. వారి కుటుంబ కులదేవత పూజలు చేసేవారు. వారి కులదేవత శ్రీ రేణుకా మాత దర్శనంకై ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. 1952 నుండి 2015 వరకు ఈ నియమంలో భంగం కలుగలేదు.

హల్దేకర్‌జి తన పర్యటన గురించి ముందుగానే స్థానికులకు తెలియజేసేవారు. నాందేడ్‌ జిల్లా కార్యకర్తలు అందరు ఈ సమయంలో కలుసుకొని దేవి దర్శనం చేసుకుని విభిన్న భాషలలోని సంఘ గీతాలు ఆలపించి ప్రేరణ పొందేవారు. రాంభావుజి క్రమ శిక్షణా యుతమైన జీవనం గడిపేవారు. అది వారి ప్రత్యేకత. కార్యక్రమ నిర్వహణలో విషయాలను చాలా సరళంగా, చక్కటి ఉదాహరణలతో తెలియ చెప్పేవారు. బైఠక్‌లలో హాస్యం, చమత్కారం చేయడం వారి శైలి. బైఠక్‌లన్నీ ఉల్లాసంగా జరిగేవి.

దృష్టి సకారాత్మకం

రాంభావ్‌జి ఎప్పుడైనా సరే సమస్యల గురించి ప్రస్తావించేవారు కాదు. ఏ విషయమైనా సకారాత్మ కంగా వివరించేవారు. ఒక పని చేయడానికి కార్యకర్తలకు ప్రేరణ అవసరం. అలాంటి ప్రేరణ కలిగించే సంఘటనలను కార్యకర్తలకు వివరించే వారు. ‘దీపం ఎంత పెద్దగా ఉంటే వెలుతురు అంత ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ దూరం ప్రసరిస్తుందని వారెప్పుడూ చెప్పేవారు. సమస్యలు అసంఖ్యాకంగా ఉన్నా వాటిని పరిష్కరించగలిగే సమాధానాలు అంతకన్న ఎక్కువగా ఉంటాయి. సమస్య పరిష్కారానికి విశాలమైన మనస్సు అవసరం.

ఇక రాంభావుజి స్మరణ శక్తి అమోఘం. 60 సంవత్సరాల క్రితం నాటి కార్యకర్తల పేర్లు కూడా వారికి గుర్తుండేవి. తన చివరి రోజులలో తనను కలువడానికి వచ్చిన గ్రామస్తులతో ఆ గ్రామంలోని ఫలానా వ్యక్తి బాగున్నాడా? ఫలానా వ్యక్తి ఇప్పటికీ మన సంబధంలో ఉన్నాడా? అని ఆరా తీసేవారు. పేర్లతో సహా గుర్తుంచుకునేవారు. రాంభావ్‌జీకి ఎన్నో సంఘ గీతాలు కంఠస్థం ఉండేవి. తన ప్రసంగాలలో సంఘ గీతాలను ప్రస్తావించేవారు.

చివరి దశలో కూడా..

రాంభావ్‌జి పర్యటనలు చేయడానికి వారి శరీరం సహకరించలేని దశకు వచ్చింది. అప్పుడు వారు తన మనస్సుకు పని కల్పించారు. ఆఖరి శ్వాస వరకు కార్యకర్త, సామాజిక స్థితి, కార్యచింతన.. ఈ దిశలోనే వారి ఆలోచనలు సాగేవి. 2005 వరకు క్షేత్ర ప్రచారక్‌ బాధ్యతలో నిరంతరం పర్యటనలు కొనసాగేవి. వయస్సు 75 రాగానే వారి పర్యటనలను కుదించారు. కేవలం తెలుగు ప్రాంతాలలో మాత్రమే పర్యటనలు జరిగేవి. శ్రీ గురూజీ జన్మశతాబ్ది సందర్భంలో కలకత్తా పర్యటించారు. ఇక ఈ ప్రాంతంలోని నగర కేంద్రాల శాఖల పర్యటన, నగర కార్యకారిణి, కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధం. ఈ యోజనను రాంభావ్‌జి సఫలం చేశారు.

గ్రంథ రచన

జిల్లా ప్రచారక్‌గా పనిచేసిన 100 స్థానాలలో పర్యటించారు. ఈ పర్యటనలో 450 గ్రామాలలో పర్యటించారు. ఇక కాళ్ళు సహకరించలేదు. అప్పుడు పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు. ముగ్గురు సర్‌ సంఘచాలకుల గురించి మూడు గ్రంథాలను మరాఠి నుండి తెలుగులోకి అనువదించి, ప్రచురిం చారు. అవి గో.వి.దండేకర్‌ రాసిన ‘వాదకాలిత్‌ దీపస్థంభ్‌’, మృణాళిని జోషి రాసిన ‘శ్రీ గురూజి’, శరద్‌ హెబ్బాల్‌కర్‌ రాసిన ‘బాలాసాహెబ్‌ దేవరస్‌’. ఈ గ్రంథాల ప్రచురణ పూర్తయిన తరువాత వాటిని అందరు కార్యకర్తలకు అందేలా కృషి చేశారు.

ఆ తరువాత వారి శరీరం పూర్తిగా అలసి పోయింది. సమాజ హితం కోసం తన శరీరాన్ని కొవ్వొత్తిలా కరిగించిన శ్రీ రాంభావ్‌ హల్దేకర్‌జి 23 ఫివ్రవరి 2017న తుది శ్వాస విడిచారు.

వీరి స్మరణలో ‘రాష్ట్ర విభూతి రాంభావు హల్దేకర్‌’ పుస్తకం ప్రచురితమైంది. ఈ పుస్తక ఆవిష్కరణ ఔరంగాబాద్‌లోని శంభాజీ నగర్‌లో జనవరి 12న జరిగింది.

– సునీతా హల్దేకర్‌, రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత సంపర్క ప్రముఖ్‌

(జాగృతి సౌజన్యం తో)