Home News పుస్తకాల పల్లె…

పుస్తకాల పల్లె…

0
SHARE

మనం సంపాదించిన ఆస్తులు కరిగిపోవచ్చు, అనుబంధాలు కూడా కొన్నిసార్లు చెదిరిపోవచ్చు. కాని విజ్ఞానం అలా కాదు. ఒకసారి నేర్చుకున్నామంటే ఆ విషయం మనం తనువు చాలిరచేరత వరకు మనతోనే ఉంటుంది. మనల్ని జీవితాంతం నడిపిస్తూ ఉంటుంది. అంతటి విజ్ఞానాన్ని మనకు అందించేవి పుస్తకాలు మాత్రమే.

ఒక మంచి పుస్తకం ఉంటే చాలు పదివేల మంది మిత్రులు మనతో ఉన్నట్లే లెక్క. పుస్తక పఠనం మనకు కేవలం విజ్ఞానాన్నే కాదు మనసుకు ప్రశాంతతను కూడా అందిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి చాలా మంది పుస్తక పఠనానికి దూరమవుతున్నారన్నది వాస్తవం. అరచేతిలో అమరిపోయే సెల్‌ఫోన్‌ చెక్కర్లు కొడుతుంటే ఇక పుస్తకం ఎందుకు ? అనేవారు కూడా లేకపోలేదు. ‘పుస్తకం హస్త భూషణం’ అనే నానుడి కాస్తా నేడు ‘సెల్‌ఫోన్‌ హస్త భూషణం’ అయింది. అయితే ఈ తరుణంలో పుస్తకం విలువను భవిష్యత్తు తరాలకు అందించే భాద్యత మన మీదే ఉంది.

పిల్లల్లో పఠనాసక్తి నానాటికి తగ్గిపోతోంది. ఎంతసేపూ కంప్యూటర్లు, సెల్‌ఫోన్లతో యువతీ, యువకులు పుస్తకాన్ని మరిచిపోతున్నారు. తమకున్న విజ్ఞానాన్ని కేవలం ర్యాంకులకే పరిమితం చేస్తున్నారు.

పల్లె నిండా పుస్తకాలే…

మామూలుగా అయితే పఠనాసక్తి ఉన్నవాళ్లు పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో ఒక గదిని పుస్తకాలతో నింపేస్తారు. దాన్ని రీడింగ్‌రూమ్‌ అని పిలుచుకుంటారు. మనకు లైబ్రరీల గురించి కూడా తెలుసు. ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద లైబ్రరీలున్నాయి. అవన్నీ ఒక పెద్ద హాలుకే పరిమితం అయి ఉంటాయి. అయితే ఒక ఊరినిండా పుస్తకాలుంటే మరి ఆ ఊరిని ఏమని పిలవాలి ? పుస్తకాల పల్లె అనొచ్చు కదా ! వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా అటువంటి ఊరు మనదేశంలోనే ఉంది. దాని గురించి తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని ఓ హిల్‌ స్టేషన్‌ అది. చుట్టూ పచ్చని చెట్లతో ఎటుచూసినా కొండలు, స్ట్రాబెర్రీ తోటలు, పర్వతాల మధ్య నుంచి సన్నగా జాలువారే జలపాతాలు… మహాబలేశ్వర్‌ దగ్గరలో నిత్యం ప్రకృతి రమణీయతతో ఉండే ఆ ప్రాంతం పేరు భిలారా. ఒకప్పుడు ఈ ప్రాంతం బ్రిటీష్‌ వారికి వేసవి విడిది. ఇది పర్యాటక ప్రదేశంగానే కాదు దేశంలోనే మొట్టమొదటి పుస్తకాల పల్లెగా కూడా రికార్డులకెక్కింది.

నేటి సమాజంలో సోషల్‌ మీడియా వాడకం వల్ల బుక్‌రీడింగ్‌ కాస్తా అటకెక్కింది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పుస్తక పఠనమనేది కనుమరుగైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. పుస్తకం తన ఉనికిని ఎన్నటికీ కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర సర్కార్‌ ‘పుస్తకాల పల్లె’ అనే పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే భిలార్‌ అనే ప్రాంతాన్ని ఎన్నుకుంది. ముందుగా పుస్తకాల విశిష్టతను తెలిపేలా ఆ ఊరంతా అందంగా పెయింటింగ్స్‌ వేయించారు. ఆ ప్రాంతంలో ఎక్కడ అడుగు పెట్టినా సరే పుస్తక రూపం వెంటాడుతూ ఉంటుంది.

భిలార్‌ గ్రామ జనాభా సుమారు పదివేలు. ప్రస్తుతం ఆ గ్రామంలో పుస్తకాలు మాత్రం పదివేలకు పైగా ఉన్నాయి. అంటే మనిషికొక పుస్తకం ఉందన్నమాట. సుమారు 25 చోట్ల రీడింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా కథలు, సాహిత్యం, చరిత్ర, సామాజిక అంశాలు, జీవిత గాథలు, చిన్న పిల్లల పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలను చదవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. అయితే పుస్తకాలను పాడుచేయకుండా ఇతరుల కోసం జాగ్రత్తగా ఉంచాలనేది మాత్రం ఇక్కడి నిబంధన.

లైబ్రరీలో చదువుకోడానికి కుర్చీలు, టేబుల్స్‌ని స్థానికులే ఇచ్చారు. కొందరు తమ ఇళ్లలో సైతం లైబ్రరీలను ఏర్పాటు చేసుకునేందుకు ముందు కొచ్చారు. ఇలాగైనా తమ గ్రామం ఆక్షరాస్యతలో ముందుండాలన్నదే వారి అభిలాష. మొదటగా మాతభాషను పటిష్టం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ తొలినాళ్లలో పుస్తకాలన్నీ స్థానిక భాష అయినా మరాఠీలోనే ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం పర్యాటకుల కోసం ఇంగ్లీష్‌, హిందీ భాషలతో కలిపి మొత్తం పదిహేను వేలకి పైగా పుస్తకాలు అందు బాటులో ఉన్నాయి. కొత్తవాళ్లు ఈ లైబ్రరీలను గుర్తిం చేందుకు వీలుగా సాహిత్యం, కవిత్వం, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమం, చరిత్ర, పర్యావరణం, జానపద సాహిత్యం, పండుగలు, ఆత్మకథలకి సంబంధించిన చిత్రాలను లైబ్రరీ గోడలపై తీర్చిదిద్దారు.

మాట్లాడే గ్రంథాలయాలు..

గ్రంథాలయం అనగానే అల్మారా నిండా పుస్తకాలు, పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌తో అదొక నిశ్శబ్ద ప్రపంచంలా అనిపిస్తుంది. మరి మనుషులే పుస్తకాలై మనతో మనుసు విప్పి మాట్లాడితే.. కథల్ని, బాధల్ని, సంతోషాల్ని, సామాజిక అంశాల్ని మనతో షేర్‌ చేసుకోగలిగితే..

ప్రస్తుత కాలంలో మనుషులతో మనుషులు మనసువిప్పి మాట్లాడుకోవడమే మానేశారు. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుంది. కానీ వాటితో పాటు మనుషుల అనుభవాలు చదవగలిగితే జీవితమే బోధపడుతుంది కదా ! ఈ ఉద్దేశంతోనే హ్యుమన్‌ లైబ్రరీ మొదలైంది. ఇక్కడ మనుషులే పుస్తకాలు..

సాధారణంగా లైబ్రరీలలో సైలెంట్‌గా ఉంటే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంశంపై మాట్లాడే అవకాశం లభిస్తుంది. తాము చెప్పదలుచుకున్న విషయాన్ని ఇతర రీడర్స్‌తో కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏది మాట్లాడినా సరే వాదన లేకుండా సున్నితంగా చెప్పాలి సుమా ! మీరు చదువుకున్న బుక్స్‌కి సంబంధించి కానీ, సామాజిక అంశాల గురించి కానీ ఏదైనా షేర్‌ చేసుకోవచ్చు. విదేశాలలో ఎక్కువగా ఉన్న ఈ లైబ్రరీలు మనదేశంలోకి కూడా వచ్చాయి. తొలిసారిగా ఇండోర్‌ కేంద్రంగా ఏర్పడింది. ఇందులో మనుషులే పుస్తకాలు. ఇక్కడికొచ్చే వారితో మాట్లాడడం, వారి కథల్ని, వ్యథల్ని వినడం, వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం.. ఇదే వీరి పని. ఒక్కొక్కరికీ ముప్ఫై నిమిషాల సమయం ఉంటుంది. వన్‌ టు వన్‌ పద్ధతిలో తమ అనుభవాలను షేర్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌ హ్యూమన్‌ లైబ్రరీలో అలాంటివారు ముప్ఫై మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరినీ ఒక్కో పుస్తకం పేరుతో పిలుస్తారు. వచ్చిన వాళ్లతో ఇంటరాక్ట్‌ అయి వాళ్లలో జీవితంపై ఒక నమ్మకాన్ని కలిగిస్తారు.

తమ దగ్గరికొచ్చే పాఠకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే హ్యూమన్‌ లైబ్రరీ లక్ష్యం. నలుగురితో మాట్లాడుతూ తమ సందేహాలను తీర్చుకోవడం. వివిధ సమస్యలను ఎదుర్కొనే విధంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం ఈ లైబ్రరీల కర్తవ్యం. ఈ హ్యూమన్‌ లైబ్రరీ ఈవెంట్‌ను నెలలో ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అలాగని ఇది నీతికథలు చెప్పే వేదిక ఎంత మాత్రం కాదు. రకరకాల టెన్షన్లతో వచ్చే రీడర్లను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న వినూత్నమైన ప్రయత్నం.

ఆ స్ఫూర్తితోనే…

బ్రిటన్‌లో హేయ్‌ ఆన్‌ వేయ్‌ అనే పట్టణానికి ఒక విశిష్టత ఉంది. 1962లో అక్కడ ఓ చిన్న పుస్తకాల షాపు వెలసింది. దాని స్ఫూర్తితో చుట్టుపక్కల లెక్కలేనన్ని బుక్‌షాప్స్‌ అవతరించాయి. దాంతో ఆ ఊరు ‘టౌన్‌ ఆఫ్‌ బుక్స్‌’గా ప్రసిద్ధి చెందింది. పురాతన పుస్తకాలతో పాటు, సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలకు ప్రపంచ వ్యాప్తంగా రెండవ అతి పెద్ద మార్కెట్‌గా హేయ్‌ ఆన్‌ వేయ్‌ పేరొందింది. దీని స్ఫూర్తితోనే భిలార్‌ గ్రామాన్ని పుస్తకాల పల్లెగా తీర్చిదిద్దారు. ఇది విజయవంతం అయితే దేశవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలన్నీ పుస్తక పఠన కేంద్రాలుగా రూపాంతరం చెందుతా యనడంలో సందేహం లేదు.

– విజేత

(జాగృతి సౌజన్యం తో)