Home Hyderabad Mukti Sangram ఆశయం కోసం బాధల్ని సహించక తప్పదు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-21)

ఆశయం కోసం బాధల్ని సహించక తప్పదు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-21)

0
SHARE

ప్రజావ్యతిరేకమైన చర్యగా “రయ్యత్‌”ను నిషేధించి తన అసలు స్వభావాన్ని బహిర్గతం చేసుకుంది. అందువల్ల నా కర్తవ్యాన్ని నిర్వహించాననే అనుకొంటున్నాను. ఇంతకు పూర్వం ఇలాంటి ఇబ్బందులు చాలా వచ్చినా ఎదుర్కొన్నాను. ఆశయం కోసం బాధల్ని సహించక తప్పదు.” నర్సింగరావుగారి మాటల వలన షోయీబ్ ప్రభావితుడైనా ప్రభుత్వ నిరంకుశాధికారం ముందు ఓటమిని అంగీకరించకూడదనుకున్నాడు.

“స్వతంత్రమైన పత్రికా రచన” అనే ఉద్యమాన్ని ఎన్ని కష్టాలైన సహించి, కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. ఈ సామంత రాజ్యం తన దమన నీతితో ప్రజావాణిని అణచివేయాలని ప్రయత్నించినా తాను రచనా సైనికుడిగా నిలబడి పోరాడాలని అనుకున్నాడు. ఆ నిశ్చయంతోనే షోయీబ్ శ్రీ నర్సింగరావుతో ఇలా చెప్పాడు. “పండిట్! ఒక విధంగా ప్రభుత్వం తన పతనానికే నాంది పలికింది. ఇలాంటి విషమ సమయంలోనే ప్రజావాణిని మరింత నిర్భయంగా వినిపించవలసిన అవసరం ఉంది. “రయ్యత్‌” లేని కొరతను తీర్చాలని నా ఆశయం. “ఇమరోజ్‌”   పేరుతో ఒక దినపత్రిక కోసం డిక్లరేషన్ సంపాదించాను.

మీరు నన్ను ఆశీర్వదించి, కావలసిన డబ్బు సమకూర్చిపెడితే ఈ పత్రికా రచన ఉద్యమాన్ని నేను కొనసాగిస్తాను.” శ్రీ నర్సింగరావు తన సహకారం ఉంటుందని వాగ్దానం చేశారు. అయితే హైద్రాబాద్ సంస్థానంతో ఏ రోజుకారోజు ప్రజా జీవితం అన్యాయాలకు లోనవుతూ ఉన్నదని, షోయీబ్ సంస్థానం నుండి వెళ్ళిపోయి ఇతర ప్రాంతాల నుండి పత్రికను నడిపించడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వంతో  ముఖాముఖీ పోరాడే దానికంటే దూరంగా ఉంటూ తన ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చునని షోయీబ్‌ని ఆయన కోరారు. కాని షోయీబ్ తాను హైద్రాబాద్‌లోనే ఉంటూ పత్రికను వెలువరించాలనే కృతనిశ్చయాన్ని ప్రకటించారు.

ప్రభుత్వోద్యోగం – నిరాకరణ
పై సంఘటనకు పూర్వం దాదాపు రెండు సంవత్సరాల క్రితం షోయీబ్ “రయ్యత్‌” కార్యాలయానికి వచ్చి నర్సింగరావుగారితో తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాను రయ్యత్ దినపత్రికలో పనిచేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఆ రోజులలో జాతీయ భావాలని నిర్భయంగా ప్రకటిస్తున్న ఉర్దూ దినపత్రిక రయ్యత్. నిజాం సంస్థానంలో ఆనాటి అధికారిక భాష ఉర్దూ. పత్రికలు చాలా వరకు ఉర్దూలోనే వెలువడుతుండేవి. శ్రీ ముందుముల నర్సింగరావుకు పత్రికా సంపాదకుడిగా పత్రికా లోకంలో ప్రముఖస్థానం ఉండేది.

ఆ రోజులలో రయ్యత్‌కు ఉపసంపాదకుడి అవసరం ఉందని ప్రకటన వెలువడింది. ఆ ఉద్యోగం కోసం షోయీబ్ వచ్చాడు. టేబుల్‌పై ఉన్న పత్రికలో ఒక వార్తను చూసి సంపాదకీయాన్ని రాసి ఇమ్మన్నారు సంపాదకులు. షోయీబ్ సంపాదకీయాన్ని కొద్ది సమయంలోనే రాసి ఇచ్చాడు. ఒక ఇంగ్లీషు వార్తను ఇచ్చి, ఉర్దూలోకి అనువదించమన్నారు. ఆ పని కూడా ఆయన సంతృప్తికరంగా చేశాడు. అభిప్రాయాలు, శైలి, భాషా సమన్వయం సరిగ్గా కుదిరింది. ఆ విధంగా ప్రాథమిక పరీక్ష ముగిసింది.

ఆ తర్వాత సంపాదకులు శ్రీ నర్సింగరావు తన పత్రిక వైఖరి గురించి చెబుతూ ఇలా అన్నారు. “మీరు ఉపసంపాదకులుగా మీ పనిని నిర్వహించగలుగుతారు. కానీ “రయ్యత్‌” జాతీయభావాలుగల పత్రిక. మీరు రాయిష్టు (రాడికల్ హ్యూమనిస్టు) అభిప్రాయాలు గల వ్యక్తులు. మీ వ్యాసాలను నేను తాజ్ వారపత్రికలో చదివాను. అందువల్ల మీ పాలసీతో ఏకీభవించి పని చేయగలుగుతారా?” షోయీబ్ సమాధానంగా తాను రయ్యత్‌లో పనిచేసినంతకాలం ఎలాంటి భేదభావాన్ని ప్రకటించనని చెప్పాడు.

పత్రికా రచయితగా పొందే వేతనం కూడా చాలా నిరుత్సాహంగా ఉంటుందని, షోయీబ్ ప్రభుత్వోద్యోగంలో చేరటం మంచిదని శ్రీ నర్సింగరావుగారు సలహా ఇస్తూ “మీరు ముస్లిం అభ్యర్థిగా, ఉస్మానియా పట్టభద్రుడిగా నిజాం ప్రభుత్వంలో సునాయాసంగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. మీ నాన్నగారు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టరుగా ఉన్నారు. చిన్నాన్న ఫారెస్టు విభాగంలో అధికారి. పైగా మీరు వివాహితుడనని, ఒక కూతురు కూడా ఉందని చెబుతున్నారు. నేను ఇవ్వబోయే నెలసరి జీతం 50 రూపాయలు మీకు ఏం సరిపోతాయి? ఈ ఆర్థికమైన ఇబ్బందిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి” అని ఆయన స్పష్టీకరించారు.

షోయీబ్ నిరుత్సాహం చెందకుండా తాను ప్రభుత్వోద్యోగం చెయ్యనని ఈ స్వల్ప వేతనం తనకు ఇష్టమేనని చెప్పాడు. ఆ తర్వాత షోయీబ్ “రయ్యత్‌” ఉపసంపాదకునిగా ఉద్యోగంలో చేరిపోయాడు. కొంతకాలంలోనే షోయీబ్ తన ప్రతిభావ్యుత్పత్తులను నిరూపించుకున్నాడు. పత్రికా రచనపట్ల అతనికున్న అపరిమితమైన శ్రద్ధాసక్తులను చూసి సంపాదకుడు ముగ్ధుడైపోయాడు. తత్ఫలితంగా షోయీబ్ జీతం 75 రూపాయలకు పెరిగింది. రయ్యత్‌లో ఉద్యోగిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా షోయీబ్ తన ఆత్మీయతను వృద్ధిచేసుకున్నాడు. అందువల్ల ఆ పత్రిక మూతపడే సందర్భంలో ఆయన అంతగా చలించిపోయాడు.

Souce: Vijaya Kranthi