తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో జరిగిన అవకతవకల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ఏప్రిల్ 27 నాడు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో విద్యార్థుల సంతాప ర్యాలీ, శ్రద్ధాంజలి సభ సభ నిర్వహించడం జరిగింది. ఇందులో జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆశిష్ చౌహాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చౌహన్ మాట్లాడుతూ తెలంగాణలో ఇంటర్ ఫలితాలు అవకతవకల వల్ల 19 మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షలమంది విద్యార్థుల ఫలితాలు తారుమారు అయ్యాయని ఇది ప్రభుత్వ అసమర్థతే అని అన్నారు.
ఈనెల 18వ తేదీన ఫలితాలు విడుదల చేస్తే మూడు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది, అధికారుల వైఫల్యం వల్ల చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. సంవత్సరమంతా కష్టపడి చదివిన విద్యార్థులు ఇలాంటి సున్నా మార్కులు వేయడం వల్ల మరియు ఇతర అవకతవకల వల్ల విద్యార్థులను ఈ ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుభవం లేని ఔట్సోర్సింగ్ గ్లోబర్ ఎరీనా అనే సంస్థకు అప్పగించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం, ఒకరోజు 40 పేపర్లు వాల్యుయేషన్ చేయాలంటే 78 పేపర్లు వాల్యుయేషన్ చేయడం అంటే ఫలితాలపై ఎంత శ్రద్ధ వహించారొ అర్థమవుతుందని అన్నారు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఫలితాలు వెలువడడం జరిగిందని తద్వారా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఆత్మహత్యలపై ప్రభుత్వం అసలు స్పందించడం లేదని ఈ అవకతవకలకు కారణమైన వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఫలితాలకు బాధ్యత వహిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఎన్నికలు, రాజకీయ వలసలు ప్రజాప్రతినిధులను కొనుక్కోవడం లో ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఫలితాలు ప్రకటించడంలో లేదని అన్నారు.