రక్షణరంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. దేశ రక్షణ అవసరాల కోసం రూపొందించిన అగ్ని ప్రైమ్ క్షిపణిని ఒడిషాలోని డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. బుధవారం ఉదయం ఈ ప్రయోగం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఖండాంతర అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి.అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సార్‌ల నుంచి సేకరించిన డేటాను పరిశీలించిన రక్షణ అధికారులు అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు మీడియాకు తెలిపారు.
రక్షణ శాఖ కీలక అధికారులు, డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు, ఆర్మీలోని ముఖ్య అధికారులు అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగాన్ని దగ్గరుండి పరిశీలించారు. అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ రంగాన్ని ఈ క్షిపణి మరింత బలోపేతం చేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. గత ఏడాది జూన్‌లో అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగాత్మకంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.