Home News బలహీన వర్గాలకు బలమై నిలిచిన బాబూజీ

బలహీన వర్గాలకు బలమై నిలిచిన బాబూజీ

0
SHARE

మన దేశంలో బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ, దళితుల హక్కుల కోసం పోరాటం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. జాతి యావత్తూ స్మరించుకునే గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రాం. ‘బాబూజీ’ అని అణగారిన వర్గాల వారు ప్రేమగా పిలుచుకునే జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 5, 1908న బిహార్‌లోని అర్రా పట్టణానికి దగ్గరలో ఉన్న చంద్వాలో జన్మించారు. ఈ రోజును సమతా దివస్‌గా జరుపుకుంటారు. స్వాతంత్ర్య సమర యోధుడు అయిన బాబు జగ్జీవన్‌రామ్ రాజకీయ నాయకుడిగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేయడమే కాకుండా దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. దేశం స్వాతంత్య్రానికి చేరువైనప్పుడు 1946లో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా జగ్జీవన్ రాం గుర్తింపు పొందారు. తన రాజకీయ జీవితంలో సుమారు 50 ఏళ్లపాటు పార్లమెంటు సభ్యునిగా పనిచేసి, అత్యధిక కాలం ఎంపీగా ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. వీరు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాలలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఎవరి మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టినా దాన్ని అంకితభావంతో నిర్వహించారు.

జగ్జీవన్ రాం కేంద్ర మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా, ఆహార-వ్యవసాయశాఖ మంత్రిగా, రక్షణమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే మొదటి హరిత విప్లవం వచ్చింది. ఆ సమయంలో ఈ విప్లవానికి వారు అందించిన సహాయ సహకారాలు ఎనలేనివి. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఆయన రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన వ్యూహాత్మక చతురత ప్రశంసనీయం కాగా, బంగ్లాదేశ్ ఏర్పాటులో ఆయన పాత్రను ఎవరూ మరువలేరు.

బాబూజీ కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయులుగా ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ ఆయనను ఏంతో నిరాశపరిచింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ పోకడలపై తిరుగుబాటు ధోరణిని కనబరిచారు. 1977లో కాంగ్రెస్ నుంచి విడిపోయి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించారు. ఎమర్జెన్సీ అనంతర ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఈ పార్టీని ప్రత్యామ్నాయంగా చూసేవారు. అయితే జై ప్రకాష్ నారాయణ్ అభ్యర్థన మేరకు జనతా పార్టీతో జట్టు కట్టడమే మేలని భావించారు. జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ప్రధానమంత్రి పదవికి జరిగిన పోటీలో వెనుకబడ్డారు. ఫలితంగా మొరార్జీ దేశాయ్ ప్రధాని కాగా, బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధాని పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత, చౌదరి చరణ్ సింగ్‌తో మరోసారి ప్రధాని పదవి కోసం పోటీ పడాల్సి వచ్చింది. ఈసారి కూడా జగ్జీవన్ రామ్‌కు ప్రధాని పదవి దక్కలేదు. చౌదరి చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు.

జగ్జీవన్ 1914 జనవరిలో ప్రాథమిక విద్య స్థానిక పాఠశాలలో అభ్యసించాడు. అతని తండ్రి మరణం తరువాత, జగ్జీవన్, అతని తల్లి వాసంతి దేవికి తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది. ఆయన 1920లో అర్రాలోని అగర్వాల్ మిడిల్ స్కూల్లోను, 1922లో అర్రా టౌన్ స్కూల్లోను చేరారు. ఇక్కడ ఆయన మొదటిసారి కుల వివక్షను ఎదుర్కొన్నారు. ఈ పాఠశాలలో రెండు నీటి కుండలు, ఒకటి హిందువులకు, మరొకటి ముస్లింలకు దాహం తీర్చుకోవడానికి పెట్టేవారు. జగ్జీవన్ హిందువుల కుండ నుండి నీరు తాగడంతో ఆయన అతను అంటరాని తరగతికి చెందినవారు కాబట్టి, ప్రిన్సిపాల్‌ అంటరానివారి కోసం మూడవ కుండను ఉంచాడు. జగ్జీవన్ ఆ కుండను రెండుసార్లు పగలగొట్టి నిరసన తెలిపారు. ఆ సంఘటనలు జగ్జీవన్ జీవితాన్ని మలుపు తిప్పాయి.

జగ్జీవన్ రామ్ తన మెట్రిక్యులేషన్ మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించి, 1927లో బనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు. ఇక్కడ ఉన్నప్పుడు సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థులను సమైక్యపరిచారు. స్థానిక సెలూన్లలో జుట్టు కత్తిరింపులు, వసతి గృహాలలో భోజనం దగ్గర చూపే వివక్షను వ్యతిరేకించారు. 1935లో అఖిల భారత అణగారిన వర్గాల కూటమి స్థాపనకు సహకరించారు. అది అంటరానివారికి సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ. అదే సంవత్సరంలో హిందూ మహాసభ సెషన్‌లో దళితులకు దేవాలయాల్లోకి, తాగునీటి బావుల వద్దకు ప్రవేశం కల్పించాలని తీర్మానం ప్రతిపాదించారు. అదే సమయంలో రాజకీయాలలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్న జగ్జీవన్ రామ్ కాంగ్రెస్‌లో చేరి, బీహార్ కౌన్సిల్‌కు నామినేట్ అయ్యారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికైయ్యారు. అయితే, నీటిపారుదల సుంకం సమస్యపై తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. 1940వ దశకం ప్రారంభంలో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించారు. యూరోపియన్ దేశాల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడాన్ని బహిరంగంగా ఖండించిన ప్రధాన నాయకులలో జగ్జీవన్ రాం ఒకరు. భారత రాజ్యాంగ పరిషత్‌లో దళితుల హక్కుల కోసం వాదించిన సంస్కరణవాది ఈయన.

18 ఫిబ్రవరి 1936న ‘ఆల్ ఇండియా రవిదాస్ సమ్మేళన్ ఇంకా 24న జరిగిన దళిత వర్గ సమ్మేళన్‌లో ఈ మత మార్పిడులపై జగ్జీవన్ రామ్ విరుచుకుపడ్డారు. హిందూ సమాజానికి ‘ఐక్యత, సమీకరణ, పోరాటం’ అని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి చివరన అఖిల భారత చమార్ల సమ్మేళనంలో మతం మారడం తెలివి తక్కువ పని అని, అది హరిజనుల సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం తోడ్పడదని, కాబట్టి హిందూమతం నుండి హరిజనులు విడిపోకూడదనే తీర్మానం చేసుకున్నారు. ఈ సందేశాన్ని ప్రతి గడప గడపకూ తిరిగి ప్రచారం చేసారు జగ్జీవన్ రామ్.