Home News జాతీయోద్యమానికి అల్లూరి నాయకత్వం: డా. గోపరాజు నారాయణరావు

జాతీయోద్యమానికి అల్లూరి నాయకత్వం: డా. గోపరాజు నారాయణరావు

0
SHARE

మైదాన ప్రాంత ఉద్యమానికి, గిరిజనుల పితూరీని అనుసంధానించడమే అల్లూరి సీతారామరాజు సాగించిన స్వాతంత్ర్యోద్యమం తాలూకు విశిష్టతగా జాగృతి సంపాదకులు డా. గోపరాజు నారాయణరావు గారు అన్నారు.

అల్లూరి సీతారామ‌రాజు 125వ‌ జ‌యంతి కార్య‌క్ర‌మం నవయుగభారతి, జాగృతి వారపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని జాగృతి భవనంలో జులై 4న ఘ‌నంగా జ‌రిగింది. శ్రీ చేంబోలు శ్రీ రామశాస్త్రి అధ్యక్షత వహించిన ఈ సభలో కేశవ స్మారక విద్యాసంస్థల కార్యదర్శి డా. అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా, జాగృతి సంపాదకులు డా. గోపరాజు నారాయణరావు గారు ప్రధానవక్తగా పాల్గొన్నారు.

చరిత్రను అవగాహన చేసుకోవడం పట్ల దృష్టి పెట్టని కారణంగా చరిత్ర వక్రీకరణకు నోచుకుందని ఈ సందర్భంగా శ్రీ చేంబోలు శ్రీ రామశాస్త్రి అన్నారు. విద్యాలయాల్లో వాస్తవమైన చరిత్రను బోధించ‌డం లేద‌ని, విద్యావంతులు ఈ అంశంపై దృష్టిసారించాలని వారు అన్నారు.

అనంత‌రం డా. గోపరాజు నారాయణ రావు గారు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం అల్లూరి శత జయంతి సందర్భంగా “విప్లవాగ్ని అల్లూరి” గ్రంథరచన కై మన్యంలోని వివిధ గ్రామాలను తాను సందర్శించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా చిటికెల భాస్కర నాయుడు, చిటికెల దాలినాయడు తదితరుల నుంచి సమాచార సేకరణలో పొందిన అనుభవాలను ఆయన వివరించారు. కేవలం స్థానిక సమస్యలపై జరిగిన తిరుగుబాట్లను పితూరీ అంటారని, అల్లూరి నాయకత్వంలో జరిగినది జాతీయోద్యమమే తప్ప పితూరీ కాదని డా. గోపరాజు నారాయణరావు గారు తెలిపారు.

‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి ఖండ కావ్యముల సంపుటి ‘ఉదయశ్రీ’ లో మన్యం వీరునిపై పద్యాలను డా. వడ్డి విజయసారథి సభికులకు పాడి వినిపించారు.

కార్యక్రమ ప్రధాన వక్త, ‘ఆకుపచ్చ సూర్యోదయం’ గ్రంథ రచయిత డా. గోపరాజు నారాయణరావుగారికి కార్యక్రమ నిర్వాహకులు చిరుసత్కారం చేశారు.

ప్రముఖ పాత్రికేయులు శ్రీయుతులు జి. వల్లీశ్వర్, వేదులనరసింహం, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ, కుర్రా దుర్గారెడ్డి, సంఘ ప్రచారకులు గొట్టుముక్కల భాస్కర్, ఆకుతోట రామారావు, సంఘ ప్రముఖులు డా. అమరనాథరెడ్డి, ఆయుష్ జీ, బి.నరసింహమూర్తి, భారతీయ మజ్దుర్ సంఘ్ నాయకులు కె.లక్ష్మారెడ్డి, సుంకరనరసింహం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.