Home News రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము ఎంపిక‌పై వ‌న‌వాసీ క‌ళ్యాణ ప‌రిష‌త్ హ‌ర్షం

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము ఎంపిక‌పై వ‌న‌వాసీ క‌ళ్యాణ ప‌రిష‌త్ హ‌ర్షం

0
SHARE

రాష్ట్రపతి అభ్యర్థిగా వ‌న‌వాసీ మ‌హిళ ద్రౌపది ముర్ము గారిని ఎన్డీఏ కూటమి ఎంపిక చేయడం స్వతంత్ర భారత చరిత్రలోనే అపురూపమైన విషయ‌మ‌ని వ‌న‌వాసీ క‌ళ్యాణ ప‌రిష‌త్ తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి దేవెంద‌ర్ రావు గారు అన్నారు. బుధ‌వారం భాగ్య‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన ప‌త్రికా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ముర్ము విషయ పరిజ్ఞానం ఉన్నవారు, చక్కని వక్త అని, ఒక వ‌న‌వాసీ మహిళను ఈ అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం హర్షణీయ‌మ‌ని పేర్కొన్నారు. ఈ నిర్ణయం చరిత్రాత్మక‌మ‌ని, భారతదేశమంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నద‌ని తెలిపారు. ముర్ముగారిని అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు బీజేపీ, ఎన్డీఏను, అందుకు స‌హ‌క‌రిస్తున్న ఇత‌ర పార్టీల‌కు వనవాసి కల్యాణ పరిషత్ త‌రుపున దేవెంద‌ర్ రావు గారు అభినంద‌న‌లు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ ఇలాంటి నిర్ణయం ఆధునిక భారతదేశ చరిత్రలోనే అద్భుతమైనదిగా చెప్పుకోవాల‌న్నారు.

ముర్ము గారు విద్యావంతురాలు, పాలనా అనుభవం కలిగినవారు. ఒడిశా రాష్ట్ర మంత్రి మండలిలో పనిచేసి, అలాగే జార్ఖండ్ రాష్ట్రానికి మొద‌టి మ‌హిళా గవర్నర్ గా 5ఏళ్లు పదవీ కాలం పూర్తి చేసి, వివాద రహితురాలిగా పేర్గాంచారని అన్నారు.

ఒడిషాలోని, మయూర్ భంజ్ జిల్లా బైదాపోసి గ్రామానికి చెందిన ముర్ము గారు ఆంగ్లేయుల మీద జరిగిన మహోన్నత వ‌న‌వాసీ పోరాటాలలో పాల్గొన్న సంధాల్ తెగకు చెందిన‌వారు. రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశార‌ని, శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ఆ తరువాత కొద్దికాలం నీటి సరఫరా శాఖలో పనిచేశారని దేవెంద‌ర్ రావు గారు తెలిపారు.

ముర్ము గారు 1997లో భారతీయ జనతా పార్టీలో చేరి రాయ్ రంగపూర్ నగర పంచాయతికి మొదట కౌన్సిలర్ గాను తరువాత చైర్‌ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలి స్థాయికి చేరారు. ఒడిషాలో బీజేపీ, బిజూ జనతా సంకీర్ణ ప్ర‌భుత్వంలో ఆమె మంత్రిగా పనిచేశారు. వాణిజ్య రవాణా శాఖ మంత్రిగా ఆమె స్వతంత్ర చార్జితో పనిచేశారు. అద‌నంగా మత్స్య, పశు సంవర్ధక శాఖలు నిర్వహించారు.

గవర్నర్ గా ఆమె తీసుకున్న నిర్ణయాలలో ఒకటి ఎంతో ప్రసిద్ధిగాంచింది. చోటానాగపూర్ టెనన్సీ చట్టం, సంథాల్ పరగణా టెనెన్సీ చట్టాలలో సవరణకు జార్ఖండ్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ఆమోదించలేదు. ఈ చట్టాలకు సవరణ చేయడం వల్ల గిరిజన భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే వెసులుబాటు వస్తుంది. ఇదే అంశంతో ముర్ము గారు విభేదించారు. త‌ద్వారా ప్రజా ప్రయోజనాల పట్ల ఆమె స్థిరాభిప్రాయం కలిగి ఉన్న విషయం స్పష్టమ‌వుతుంద‌ని దేవెంద‌ర్ రావు గారు తెలిపారు.

ఈ ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించి, రాష్ట్రపతి భవన్లో ప్రవేశించి, భారతీయ వ‌న‌వాసీల‌ ప్రతిభా సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పుతార‌నే ఆశాభావాన్ని వ‌న‌వాసీ క‌ళ్యాణ ప‌రిష‌త్ తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ్య‌క్తం చేశారు. అలాగే భారతదేశంలో నెలకొంటున్న సామాజిక సమరసతా దృక్పథం కూడా ఈ పరిణామంతో ప్రపంచ దేశాలకు వెల్లడవ్వాలని వారు ఆకాంక్షించారు.