“హిందూ సమాజం ఎప్పుడైతే తన ప్రాచీన, అద్భుత గతాన్ని మరచిపోయిందో అప్పుడు బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. పిడికెడు మంది విదేశాస్తులు ఈ దేశాన్ని ఆక్రమించగలిగారు. హిందువులు కులపరంగా, ప్రాంతాల వారిగా విడిపోయి ఉండడం వల్లనే నేడు అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం లేదు. అలాగే శబరిమల ఆలయాన్ని అపవిత్రం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందూ సమాజాన్ని సమైక్యపరచి అజేయం చేయడానికే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖ పద్దతిని ప్రారంభించింది. చాల సరళమైన, సులభమైన ఈ పద్దతి ద్వారా హిందూ సంఘటన మహా కార్యం నెరవేరుతుంది” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. జనవరి 5, 2019 చెన్నైలో జరిగిన మహానగర బస్తి సంగమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
శాఖా కార్యక్రమానికి ఎలాంటి సాధన సంపత్తితో పని లేదని, కేవలం కొద్దిమంది కలిసి శారీరిక, బౌద్ధిక అంశాలు నిర్వహించుకోవచ్చని డా. మోహన్ భాగవత్ అన్నారు. డాక్టర్ జీ సమయంలో సంఘ కార్యాన్ని వేరువేరు ప్రాంతాలకు తీసుకువెళ్ళడం గురించి ప్రయత్నం జరిగిందని, ఇప్పుడు ప్రతి బస్తీలో సంఘ శాఖ ప్రారంభం చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.
ధర్మ సాధనకు సత్యం, సంవేదన, స్వచ్చత, తపస్సు అవసరమని, తపస్సు ద్వారా స్వచ్చత వస్తుందని శాఖ పని ఒక తపస్సు వంటిదని డా. మోహన్ భాగవత్ అన్నారు. శాఖ ద్వారా మనకి పై మూడు గుణాలు లభిస్తాయని అన్నారు. హనుమంతుడు తన సకల గుణాలు, శక్తిని రామకార్యానికే ఉపయోగించాడని, అలాగే స్వయంసేవకులు తమ శక్తిసామర్ధ్యాలను దేశం కోసం ఉపయోగించాలని ఆయన అన్నారు. హనుమంతుడు లంకకు వెళ్ళేటప్పుడు ఎదుర్కొన్న సురస, సింహిక, లంకిణి అనే రాక్షసులు సాత్విక, తామసిక, రాజసిక శక్తులకు ప్రతీకలని, స్వయంసేవకులు కూడా తమ పనిలో అలాంటి శక్తులను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన వివరించారు. భారతదేశం తిరిగి విశ్వగురు స్థానాన్ని పొందకుండా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేడని డా. మోహన్ భాగవత్ తన ఉపన్యాసాన్ని ముగించారు.
చెన్నై మహానగరం లోని మొత్తం 880 బస్తిలలో 825 బస్తీల నుంచి 2913 మంది స్వయంసేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘ సహా సర్ కార్యవాహగా పనిచేసిన మాననీయ భావురావ్ దేవరస్ జీవిత విశేషాలను వివరించే పుస్తకాన్ని డా. మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. మొదటి కాపీని చిన్మయ మిషన్ కు చెందిన పూజ్య స్వామి మిత్రానంద అందుకున్నారు.
Source: Organiser