Home News మతమార్పిడి నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ

మతమార్పిడి నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ

0
SHARE

రాష్ట్రంలో బలవంతపు మతమార్పిళ్లను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురానుంది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం నాడు ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్టీలకు అతీతంగా హిమాచల్ అసెంబ్లీ సభ్యులందరూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. సీపీఐ ఎమ్మెల్యే రాకేష్ సింఘా మాత్రమే ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అక్రమ మతమార్పిళ్లు అరికట్టడం ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం. ఈ చట్టం అమలులోకి వస్తే.. అక్రమ మతమార్పిళ్లకు పాల్పడినవారికి కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లు రూపొందించారు. ఎస్సీ వర్గానికి చెందిన వారిని, మహిళలను, మైనర్ బాలబాలికలను మతమార్పిళ్లకు గురిచేస్తే నిందితులకు 2 ఏళ్ల నుండి గరిష్టంగా ఏడేళ్లు కారాగార శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. 

అంతే కాకుండా.. మతమార్పిడి లక్ష్యంగా చేసుకునే వివాహాలు ఈ బిల్లులోని సెక్షన్ 5 ప్రకారం చెల్లుబాటు కావు. బిల్లులోని సెక్షన్ 7 ప్రకారం ఎవరైనా స్వచందంగా మతం మారాలి అనుకున్నవారు 30 రోజులు ముందుగానే దీనికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ కి రాతపూర్వక ప్రమాణపత్రం అందజేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే మాతృధర్మంలోకి పునరాగమనం చేయాలనుకుంటారు వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు. 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2006లో ఇదే తరహా చట్టం అమలులోకి వచ్చినప్పటికీ మతమార్పిళ్లను అడ్డుకోవడంలో అది అంతగా ప్రభావం చూపలేదని, ఇప్పటి వరకు ఆ చట్టం కింద ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఇప్పుడు రూపొందించిన చట్టం కఠినమైనది ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వెల్లడించారు. ఇంతకుముందు చట్టంలో 10 రకాల సవరణలు చేయాల్సి ఉన్నందున ఈ కొత్త చట్టాన్ని రూపొందించినట్టు ఆయన తెలియజేసారు.