Home News హిందువులు నిజంగా మతతత్వవాదులేనా?

హిందువులు నిజంగా మతతత్వవాదులేనా?

0
SHARE

‘నేను దేన్నైనా సాధించగలను. ఎందులోనైనా నేనే విజయం సాధిస్తాను. నేను చేయలేని పని ఈ ప్రపంచంలో ఏదీ లేదు’ అన్నాడు భర్త తన భార్యతో! ఈ డైలాగులు దూరం నుండి వింటున్న ఐదేళ్ల కొడుకు చింటూ గభాలున పరుగెత్తుకుంటూ వచ్చి ‘నాన్నా! నేను చెప్పింది చేయగలవా?’ అన్నాడు. ‘ఏంట్రా?’ అన్నట్టు మొహం పెట్టాడు తండ్రి. పరుగెత్తుకొంటూ వెళ్లిన చింటూ క్షణాల్లో ఇంట్లో ఉన్న కోల్గేట్ పేస్ట్ తీసుకొచ్చి, తండ్రి చేతికి ఇచ్చాడు. ‘నాన్నా! ఇందులో ఉన్న పేస్ట్‌ను బయటకు తీసి మళ్లీ లోపలికి పంపించు’ అన్నాడు. తండ్రి బిక్కమొహం వేశాడు.

ఈ రోజు దేశంలోని కుహనా మేధావులంతా ఇలా విర్రవీగినవారే. ఏం చేసైనా హిందూ జాతీయతను దెబ్బతీద్దామంటే ఆ దెబ్బ నుండే ఓ పరిష్కారం పుట్టుకొస్తుంది. స్వాతంత్య్ర పోరాట కాలం నుండి సంతుష్టీకరణకు అలవాటు పడిన వర్గాలు 1990 తర్వాత జాగృతమైన హిందూ జాతీయతను అడ్డుకోలేక పోతున్నారు. గతంలో హిందూ ధర్మం అంటే ఆధ్యాత్మికతకే పరిమితమయ్యేది. ఇప్పుడు అదో రాజకీయ ఉద్యమంగా మారడం చూసి గగ్గోలు పెడుతున్నారు. దీనికి కారణం ఎవరు?

‘భారతీయ సమాజమే నా పవిత్ర స్వర్గం. వారణాసే నా వృద్ధాప్యం’ అన్న వివేకానందుని మాటలు భారతీయ నేలను తమ అత్యున్నత స్వర్గంగా భావించే వారెవరు? వివేకానందుడు స్పష్టంగా ‘మేం హిందూ జాతి’ అని గర్వంగా చెప్పగా, జిన్నా పాకిస్తాన్‌ను గర్వంగా ‘ముస్లిం జాతి’ అన్నాడు. ఇపుడు జాతిపరంగా మనం హిందుస్థానీలం అనకుండా ఇన్ని స్పర్థలు తలెత్తుతున్నా ఇప్పుడు కూడా సత్యాన్ని గుర్తించకుండా హిందుత్వ వర్సెస్ సెక్యులరిజం పేరుతో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది నిజంగా ఎవరు? ఈ దేశంలో హిందువులు నిజంగా మతోన్మాదులైతే ఇన్ని కులాలు ఇంత స్వేచ్ఛగా మనగలుగుతాయా?! భారతదేశంలోని 3 కోట్ల పైచిలుకు క్రైస్తవ జనాభాను నియంత్రించడానికి 1,22,000 మంది ఫాదర్లు, నన్స్ ఉన్నారు. సుమారు 15 కోట్లపైనున్న ముస్లింలను మత అభిమానంగల వ్యక్తులుగా మార్చడానికి 70,000 మంది ముల్లాలు, వౌల్వీలు ఉన్నారు. సుమారు 70 లక్షల మంది సాధు సంతులు హిందూ మతంలో ఉన్నా, వారు తమను తాము నియంత్రించుకొంటారు తప్ప, 85 కోట్ల మంది హిందువులను మత అభినివేశం గలవాళ్లుగా మార్చే పనిని తలకు ఎత్తుకోలేదు.

అలాగే ఇతర మత నియంతృత్వ రాజ్యాల మాదిరిగా, ప్రజాస్వామ్యం, ఆధునికత పేరు చెప్పే దేశాల్లాగా రెండు నాల్కల ధోరణి భారతదేశానికి ఉండకపోవడానికి ఇక్కడి మెజార్టీ ప్రజలు కారణం కాదా? ఆధునిక ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా తనకు తాను చెప్పుకొనే అమెరికాలో ప్రతి నాణెం పైన ’In God we trust’ – భగవంతుని యందే మా విశ్వాసం -అని ముద్రిస్తారు. అలాగే ఇంగ్లండ్ వారి జాతీయ గీతం ’God save the King’ – భగవంతుడు రాజుగారిని కాపాడుగాక -అని ఉంటుంది. మరి వేల యేళ్ల ఆధ్యాత్మిక సంస్కృతి, నిరంతరం ఎన్నో నమ్మకాలతో జీవించే కోట్లాది ప్రజలున్న భారతదేశంలో మనం మాత్రం ’We the people of India’ భారత ప్రజలమైన మేము -అంటాం.

ఎన్నో విశ్వాసాలున్న భారతీయులు ‘భౌతికవాదుల్లా’ ప్రమాణం చేయడం మనలోని సంస్కరణ దృక్పథాన్ని తెలియజేస్తుంది.

కానీ ఈ దేశంలోని విదేశీ మానసపుత్రులు చైనా, క్యూబా, కొరియాలను ఆరాధిస్తారు. ఇక్కడి ప్రజలను తమ పడికట్టు పదాల సృష్టితో మభ్యపెట్టి, మెజార్టీ ప్రజల మనోభావాలను గాయపరుస్తారు.

నిజంగా ఇక్కడి మెజార్టీ ప్రజలు మతతత్వవాదులేనా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. ఎందరో వీరులు తమ ప్రాణాన్ని స్వాతంత్య్రం కోసం బలిపెట్టే త్యాగాన్ని అందించిన వందేమాతరం గానం చేద్దాం అంటారు. ఇది మతతత్వం కాక ఇంకేమిటి? మానవ జాతి స్వేచ్ఛ కోసమై తన ఆర్తిని వినిపించి, నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ టాగూర్ రచించిన ‘జనగణమన..’ జాతీయ గీతాన్ని పాడాలి అని కోరుకొనే మెజార్టీ ప్రజలు మతతత్వవాదులే కదా! చైనాకు, ఉత్తర కొరియాకు పర్యటనలకు వెళ్లిన సూడో సెక్యులర్ నాయకులు అక్కడి జాతీయ గీతాన్ని విని, తన్మయత్వం చెంది వస్తారు. ఇక్కడికి వచ్చి జాతీయ గీతాలాపనను మతతత్వానికి ముడిపెడతారు. ఆఖరుకు తాలిబన్ జెండాలను, కాశ్మీర్‌లో నిత్యం రెపరెపలాడే పాకిస్తాన్ పతాకాలను కూడా గౌరవిస్తారు. కానీ ఇక్కడి జాతీయ జెండాను హిందూ జాతీయతతో ముడిపెట్టి కన్హయ్యకుమార్ లాంటి వాళ్లు ‘ఆజాదీ’ అని అరుస్తారు. ఇదేమంటే మెజార్టీ దౌర్జన్యం అని అరుస్తారు!

హిందూ అంశాలన్నింటిని, భారతీయ అంశాలన్నింటిని తిరస్కరించడమే మైనార్టీ వాదంగా నూరిపోస్తున్న స్వయం ప్రకటిత మేధావులు, భారత మెజార్టీ ప్రజలు తమ స్వంత గడ్డపై ప్రాథమిక హక్కులు అవిభాజ్యంగా కలిగి ఉన్నారని గుర్తించాలి.

పాకిస్తాన్, సిరియా, లెబనాన్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్, ఇరాక్‌లు రోజూ రక్తపు మడుగులో కొట్టుకొంటున్నా, అలాంటి దేశాలను, అక్కడి హింసకు కారణమైన భావజాలాన్ని మన దేశంలోని సూడో సెక్యులర్ గ్యాంగు మాట మాత్రానికైనా ప్రస్తావించరు. కానీ భారతదేశంలో జరిగే ప్రతి వ్యక్తిగత తగాదాలకు, హత్యలకు మతం రంగు పులిమి ఇక్కడి మెజార్టీ ప్రజలను వీలైనంత రచ్చకు ఈడుస్తారు. సి.ఐ.ఏ వారి నివేదిక ప్రకారం పైన పేర్కొన్న మత నియంతృత్వ రాజ్యాలు తమ స్థూల ఉత్పాదనలో 10% నుండి 15% మధ్య రక్షణ కొనుగోళ్లకు వ్యయం చేస్తున్నాయి. అమెరికా రక్షణ పరిశ్రమను బ్రతికిస్తున్నది ఈ మత రాజ్యాలు కావా? డబ్ల్యుటీవో మీద దాడి చేసినప్పటి నుండి విపరీతమైన అమెరికా వ్యతిరేకతను జీర్ణించుకొన్నవాళ్లు, ఇవాళ తమ పెంపుడు కుక్కలకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టుకొంటున్నారు. అదే విధంగా ఈ దేశంలోని సూడో సెక్యులర్ వాదులు తమ పిల్లల్ని అమెరికాలో చదివిస్తూ, ఉద్యోగాలు చేయిస్తూ ఆ దేశ డాలర్లకు, అవార్డులకు నోరు తెరుచుక్కూచుంటున్నారు. కానీ అమెరికాను, దాని విధానాలను గుడ్డిగా వ్యతిరేకిస్తారు. ఇదెక్కడి ప్రజాస్వామ్య విధానం? వీరు అంతటితో ఆగకుండా ఇక్కడి మెజార్టీ ప్రజల విధానాలతో అమెరికాతో అంటకాగినట్లు నిందిస్తారు. లాడెను, బుష్‌ను, ముల్లా ఒమర్‌ను, బిల్‌క్లింటన్‌ను, హఫీజ్ సరుూద్‌ను, డొనాల్డ్ ట్రంప్‌ను పోల్చి చూస్తే ఎవరు ప్రమాదకారులు అన్నది వీళ్లకు పట్టదు. ఈ అన్ని విషయాల్లో భారత మెజార్టీ ప్రజల విధానం ఎలా ఉండాలి? అమెరికాపైన వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న మైనార్టీ మత నాయకుల్లోని కొందరు, అదే మతానికి చెందిన దేశాలు అమెరికా రక్షణ సామాగ్రి కొనుగోళ్లను ఎందుకు ప్రశ్నించరు? అంటే ఇక్కడ కేవలం భారతదేశంలోని మెజార్టీ ప్రజలను, వారి ఆలోచనలను లక్ష్యంగా చేసుకోవడమే ముఖ్యం.

మైనార్టీలను వేరుచేయడం వల్లనే కాశ్మీర్ సమస్య ఉత్పన్నం అయ్యిందనే ఈ మేధావులు అక్కడి లక్షలాది పండిట్లను ఎందుకు, ఎవరు తరిమికొట్టారో చెప్పగలరా? మెజార్టీ – మైనార్టీలు కలిసి భారతీయులుగా జీవించాలని సెక్యులర్‌వాదులు ఎందుకు చెప్పరు? అసలు కాశ్మీర్‌లో తమ సొంత గడ్డను విడిచిపెట్టిన పండిట్లు మెజార్టీలా? వాళ్ల గురించి కాశ్మీరేతర ప్రాంత ప్రజలు మాట్లాడినంత మాత్రాన పుట్టకొకరు, చెట్టుకొకరు ఉన్న పండిట్లు మెజార్టీ ప్రజలై పోతారా? కాశ్మీర్‌ను ఆక్రమించి రోజుకో చోట రాళ్లవర్షం కురిపిస్తూ, తీవ్రవాదులకు సహాయం చేసే వారు శాంతికాముకులా? ఇపుడీ సంఘటనలను ప్రశ్నించిన హిందువులు మతతత్త్వవాదులా?

ఒకే దేశంలో నివసించే ప్రజలు ఒకే జీవన విధానంలో ఉండాలని కోరేవాళ్లంతా, ఈ రోజు మతతత్వవాదులేనని ముద్ర వేస్తున్నారు. గోవాలో షరియత్ చట్టాలుగాని, హిందూ కోడ్‌గాని వర్తించదు. అక్కడ అమలు చేసిన పోర్చుగీసు కామన్ సివిల్ కోడ్ భారతదేశం మొత్తానికి వర్తించాలి అనే వాళ్లను మతతత్వ వాదులని చెప్పే సూడో సెక్యులరిస్టులు త్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష్యాలు చెప్తున్నారు.

భారతదేశంలో 82% మంది హిందూ మెజార్టీ ప్రజలున్నా మనం ప్రజాస్వామ్య యుతంగా ఏర్పరచుకొన్న రాజ్యాంగం ప్రకారం నడుచుకొంటున్నాం. అలాగే అమెరికాలో 84% మంది క్రైస్తవ జనాభా ఉన్నా ఆ దేశం అందరినీ సమానంగానే చూస్తూ ఉంది. అలాగే ఫ్రాన్సు జనాభాలో 24% ముస్లిం జనాభా ఉన్నా అక్కడ ప్రత్యేక మతపరమైన సివిల్ చట్టాలకు అవకాశం లేదు. కానీ మన దేశంలోని మెజార్టీ ప్రజలు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నా విదేశాల్లో, అంతర్జాతీయ సంస్థల్లో, ప్రపంచ ప్రసార ప్రచార సాధనాల్లో మన దేశంలో మైనార్టీలకు భద్రత లేదని గగ్గోలు పెట్టడంలోని కుట్రను అర్థం చేసుకోవాలి. ‘అమెరికా దక్షిణ పక్ష నవ్య సంప్రదాయవాదులు క్రైస్తవ భారతమనే భావనకు మద్దతిస్తే, వామపక్షానికి ఇస్లాం పట్ల సహానుభూతి ఉంది. ఈ రెంటికీ హిందుమతమన్నా, ప్రాచీన భారత నాగరికత అన్నా ఉమ్మడి శత్రువు’ – అన్న ‘బ్రేకింగ్ ఇండియా’ గ్రంథకర్త రాజీవ్ మల్హోత్రా మాటలు అక్షర సత్యాలు. అలాంటి రాజనీతినే మన దేశంలో ‘బుజ్జగింపు రాజకీయాలకు’ ప్రాతిపదిక చేసుకున్నారు. ఇలాంటి సంతుష్టీకరణ రాజకీయ పార్టీలు వదిలిపెడితే బాబర్, ఔరంగజేబు స్థానంలో దారాషికో, వౌలానా అబుల్ కలాం ఆజాద్, డా.ఏ.పి.జె. కలాం లాంటి వారు వస్తారు. అప్పుడు మత సామరస్యం పరిఢవిల్లి నిజమైన సెక్యులరిజం జయం పొందుతుంది. ‘సంస్కృతిపరంగా హిందువును, మతపరంగా ముస్లింను’ అన్న ‘మహ్మద్ కరీం భాయ్ చాగ్లా’ అనే నెహ్రూ సమకాలికుని మాటలు ఈ దేశ మత సామరస్యానికి పునాది పడుతుంది.

-డా. పి భాస్కరయోగి [email protected]

(ఆంధ్రభూమి సౌజన్యంతో)