భారతదేశంలో నూతన ఆర్థిక శకం ప్రారంభమవుతున్నది. ‘ఒకే దేశం- ఒకే పన్ను- ఒకే విపణి’ (One nation-One Tax- One Market) విధానం భారత్‌లో 2017 జులై 1 నుంచి అమలులోకి వస్తుంది. వస్తు సేవా పన్ను (Good and Services Tax) బిల్లు 6 ఏప్రిల్ 2017న రాజ్యసభ ఆమోదం పొందడంతో దేశ ఆర్థిక ప్రగతికి తలుపులు తెరుచుకున్నాయి. పన్నుల సంస్కరణల కోసం ఇప్పటివరకూ చేపట్టిన అన్ని చర్యల కంటే ఇది విప్లవాత్మకం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కీలకమైన చర్య. ఒక వస్తువు ఉత్పత్తిస్థాయి నుంచి వినియోగదారుడికి చేరేలోగా అనేక ‘పన్నుల ద్వారాల’ గుండా ప్రయాణం చేసి అధిక భారంతో బయటపడుతున్నది. ఇందులో కొన్ని కేంద్రం విధించే పన్నులైతే మరికొన్ని రాష్ట్రాలు విధించేవి. జిఎస్‌టి విధానం ద్వారా వీటన్నింటినీ తొలగించి ఒకే పన్నును విధించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఒక వస్తువుపై వివిధ స్థాయిల్లో వివిధ రకాల పన్నులు తొలగిపోతాయి. జాతీయ స్థాయిలో ఒకే ‘విపణి సంస్కృతి’కి అవకాశం కలుగుతుంది. వినియోగదారుడికి 25 నుంచి 30 శాతం పన్నుల భారం తగ్గుతుంది. ఫలితంగా భారతీయ వస్తువుల ఉత్పత్తి అంతర్జాతీయ వస్తువుల నాణ్యతకు దీటుగా జరిగి విశ్వవిపణిలో మన ప్రాతినిధ్యం పెరుగుతుంది. పన్ను విధింపు, చెల్లింపులలో పారదర్శకత పెరిగి వసూళ్ళు పెరుగుతాయి. అన్నింటికీ మించి పన్నులను ఎగవేసి నల్లధనం సృష్టించే చర్యలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుత పరోక్ష పన్ను విధానం కారణంగా వ్యాపారాభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. వస్తువుల ఉత్పత్తి, సరఫరా, సేవల రంగంలో పోటీ పెరిగి నాణ్యత పెరుగుతుంది. వివిధ రకాల పన్నుల దాడి నుండి తప్పించుకోవడానికి వ్యాపారస్తులు దొంగదారులు వెతుక్కోవడం మానేస్తారు. వస్తువులు, సేవలపై కనపడని వడ్డింపులు తగ్గుతాయి. పన్నుల భారం తగ్గడంతో స్థానికంగా ఉత్పత్తిఅయ్యే వస్తువుల పరిమాణం పెరుగుతుంది. నాణ్యత కలిగిన వస్తువులు తక్కువ ధరలకే స్థానికంగా లభించడంవల్ల విదేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి. చైనా వస్తువుల తాకిడిని తట్టుకుని నిలబడగల సామర్థ్యం పెరుగుతుంది.
జిఎస్‌టిని అమలుచేయడం ప్రభుత్వాలకు కూడా సులువవుతుంది. సకాలంలో పన్నులు చెల్లించేవారికి పారితోషికాలు, ప్రోత్సాహకాలు ప్రకటించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఏర్పడుతుంది. పన్నుల వసూళ్ళకు ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చులు తగ్గుతాయి. ఈ కారణంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. పన్నుల వ్యవస్థను స్థిరీకరించడానికి, లొసుగులను తొలగించడానికి, పారదర్శకత పెంచడానికి జిఎస్‌టి ఉపయోగపడుతుంది. ఒకే వస్తువుపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, అదనపుకస్టమ్స్ డ్యూటీ, ప్రత్యేక అదనపు కస్టమ్స్ డ్యూటీ లాంటి పన్నులను విధిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యూ యాడెడ్ టాక్స్, సేల్స్ టాక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్, ఆక్ట్రాయ్, ఎంట్రీ టాక్స్, కొనుగోలు పన్ను, లగ్జరీ టాక్స్, లాటరీలు, జూదపు ఆటలపై పన్నులు విధిస్తున్నాయి. వినోదపుపన్ను విషయంలో స్థానిక సంస్థలు విధించే పన్నులకు అదనంగా రాష్ట్రం విధించే పన్నులు ఉంటాయి. కేంద్రం విధించే సెంట్రల్ సేల్స్‌టాక్స్‌ను రాష్ట్రాలు వసూలుచేస్తాయి. జిఎస్‌టి కారణంగా ఈ పన్నులన్నీ మాయమై ఒక దశలో ఒక పన్ను మాత్రమే విధిస్తారు. ఫలితంగా పన్ను చెల్లింపుదారులకు, వస్తువుల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు, పన్నులు వసూలుచేసేవారికి ఎంతో సౌలభ్యం కలుగుతుంది.
దేశ ఆర్థికప్రగతికి దోహదపడే జిఎస్‌టి బిల్లు 13 ఏళ్ల కాలయాపనతో కష్టాల మార్గం ద్వారా ప్రయాణించింది. ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదల, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిరంతర శ్రమ కారణంగా జిఎస్‌టి చట్టసభల ఆమోదం పొందింది. జిఎస్‌టి విధానం గురించి మొట్టమొదటగా పరోక్ష పన్నుల విధానంపై కేల్కర్ టాస్క్ఫోర్స్ ఇచ్చిన నివేదికలో ప్రస్తావించారు. విలువ ఆధారిత పన్ను (Value Added Tax) సిద్ధాంతం ఆధారంగా సమగ్రమైన వస్తుసేవా పన్ను (జిఎస్‌టి)ని అమలు చేయాలని పరోక్ష పన్నుల విధానంపై కేల్కర్ టాస్క్ఫోర్స్ 2003లో సూచించింది. 2010 ఏప్రిల్ 1 నుంచి జాతీయ స్థాయిలో జిఎస్‌టిని అమలు చేయాలని 2006-2007 బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్థికమంత్రి పి.చిదంబరం ప్రస్తావించారు. పరోక్ష పన్నుల విధానం సంస్కరణలో కేంద్రం పన్నులతోపాటు రాష్ట్రాలు విధించే పన్నులు కూడా ఉండడంతో సమగ్రమైన భవిష్యత్ ప్రణాళికను రూపొందించే బాధ్యతను రాష్ట్రాల అర్థిక మంత్రులతో కూడిన ఎంపవర్‌డ్ కమిటీకి అప్పచెప్పారు. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన నివేదికలు, సమాచారం ఆధారంగా జిఎస్‌టిపై మొదటి చర్చా పత్రాన్ని ఎంపవర్‌డ్ కమిటీ 2009లో విడుదల చేసింది. జిఎస్‌టిని వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కేంద్ర, రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను సెప్టెంబర్ 2009లో ఏర్పాటుచేశారు.
జిఎస్‌టి అమలుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నది. ఈ ది శగా మొదటి ప్రయత్నం 2011 మార్చిలో జరిగింది. ఈమేరకు 115వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ పద్ధతుల ప్రకారం ఈ బిల్లును పరిశీలన కోసం ఆర్థికశాఖ స్టాండింగ్ కమిటీకి పంపారు. 8 నవంబర్ 2012న కేంద్ర ఆర్థికమంత్రి, ఎంపవర్‌డ్ కమిటీ సభ్యులతో జరిగిన చర్చల ఫలితంగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు ఎంపవర్‌డ్ కమిటీ సభ్యులతో కలిపి ‘జిఎస్‌టి రూపకల్పన కమిటీ’ని ఏర్పాటుచేశారు. తగిన సూచనలు, సలహాలు, సవరింపులతో ఈ కమిటీ జనవరి 2013లో భువనేశ్వర్‌లో జరిగిన సమావేశంలో ఒక నివేదికను సమర్పించింది. ఆ తరువాత 2013 ఆగస్టులో లోక్‌సభ స్టాండింగ్ కమిటీ కూడా తన నివేదికను సమర్పించింది. ఎంపవర్‌డ్ కమిటీ, స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సులు, సవరణలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఆర్థికశాఖ జిఎస్‌టికి తుది రూపం ఇచ్చింది. ఆయా కమిటీలు చేసిన సవరణలు, సిఫార్సులను చాలావాటిని ఇందులో పొందుపరిచారు. సెప్టెంబర్ 2013 నాటికి ఒక స్వరూపం తీసుకువచ్చారు. నవంబర్ 2013లో షిల్లాంగ్‌లో జరిగిన ఇంకొక సమావేశంలో ఎంపవర్‌డ్ కమిటీ మరిన్ని సూచనలు చేసింది. ఇలా అనేక దశలు దాటిన తరువాత ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లును 2014 జూన్‌లో ఆమోదం కోసం ఎంపవర్‌డ్ కమిటీకి పంపారు. 17 డిసెంబర్ 2014న కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లును ఆమోదించి 19 డిసెంబర్ 2014న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చల అనంతరం 6 మే 2015న లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లును రాజ్యసభ సెలక్ట్ కమిటీకి పంపారు. 22 జులై 2015న సెలక్ట్ కమిటీ నివేదిక అనంతరం 6 ఏప్రిల్ 2017న ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది.
సమాఖ్య స్ఫూర్తి (Federal Structure)కి ఉదాహరణగా జిఎస్‌టి రూపొందించబడింది. దేశ పన్నుల విధానం రూపొందించడంలో రాష్ట్రాల హక్కులు, ఆదాయాలకు ఎటువంటి భంగం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వస్తు ఉత్పాదకతలో ప్రముఖ స్థానంలో ఉన్న తమిళనాడు, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని కొన్ని సంవత్సరాలపాటు పూడ్చడానికి కేంద్రం అంగీకరించింది. జిఎస్‌టిని ప్రధానంగా రెండు భాగాలుగా రూపొందించారు. ఒకటి సెంట్రల్ జిఎస్‌టి, రెండవది స్టేట్ జిఎస్‌టి. ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు, సేవలపై జిఎస్‌టిని అమలుచేస్తారు. కేంద్రం అజమాయిషీలో ఉండే వాటిపై కేంద్ర జిఎస్‌టి, రాష్ట్రాలకు సంబంధించి స్టేట్ జిఎస్‌టి వసూలుచేస్తారు.
సాంస్కృతికంగా మనది ఒక దేశం. భౌగోళికంగా, రాజకీయంగా ఒక దేశం. ఇప్పుడు అమలులోకి వస్తున్న నూతన పన్ను విధానం ద్వారా ఉత్పాదక, వాణిజ్య రంగాలలో ఒకే సంప్రదాయం నెలకొంటుంది. ‘ఒకే దేశం- ఒకే పన్ను విధానం’ కారణంగా వాణిజ్య రంగంలో అరమరికలు తొలగిపోతాయి. రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య వాణిజ్య సంబంధాలు పెరుగుతాయి. దేశానికి ఇదొక నూతన విధానం. ఇప్పటివరకూ అధికారులు, చట్టాల మధ్య నలిగిపోతున్న వ్యాపారస్తులకు జిఎస్‌టి ఎంతో ఊరట కలిగిస్తుంది. రాష్ట్రానికి సరిహద్దుల వెంట పన్నులు చెల్లించేందుకు గంటలు, రోజుల తరబడి వేచి ఉండడాలు తగ్గిపోతాయి. అధికారుల నుంచి లంచాల బెడద తగ్గుతుంది. అవసరం ఉన్న ప్రాంతాలవారికి కావల్సిన వస్తువులు చవకగా దొరుకుతాయి. ప్రధానమంత్రి మోదీ కలలుగంటున్న ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి జిఎస్‌టి ఒక కీలకమైన సోపానం. జిఎస్‌టి అమలుకు రాష్ట్రాలను మెప్పించడంలో మోదీ విశేషంగా ప్రయత్నించారు. ఆయా రాష్ట్రాలకున్న అపోహలు, భయాలు, నష్టాలను తొలగించడంలో ఆయన విశ్వసనీయత బాగా పనిచేసింది.
దేశ ఆర్థికప్రగతికి ఆలంబనగా నిలిచే జిఎస్‌టి బిల్లు విభేదాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసింది. ఉభయ సభల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదం రాజకీయంగా కూడా దేశానికి విలువైన సందేశాన్ని పంపించింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో మోదీ సారథ్యంలో బిజెపి నేతృత్వంలో ఎన్‌డిఎ ఘన విజయం సాధించగా కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ నీరుగారిపోయింది. దీంతో ఈ రెండు కూటముల మధ్య రాజకీయ పోరు భీకరమయింది. హేతువు, తర్కం, కారణాలు, ప్రయోజనాలతో సంబంధం లేకుండా మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యనూ అడ్డుకోవడమే ప్రాధాన్యతగా యుపిఎ పార్లమెంట్‌లో పనిచేస్తూ వచ్చింది. అవకాశాలు కల్పించుకుని పార్లమెంట్ సమావేశాలను వారాల తరబడి స్తంభింపచేస్తూ వచ్చింది. రాజ్యసభలో యుపిఎకు ఉన్న సంఖ్యాబలం ఇందుకు దోహదం చేసింది. అయితే జిఎస్‌టి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం- ‘రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా దేశ ప్రయోజనాలు ముఖ్యం’- అన్న విలువైన సందేశం ప్రజలకు అందింది. ఇది స్వాగతించదగ్గ పరిణామం. ‘న్యూ ఇండియా’ ఆవిర్భావానికి జిఎస్‌టి స్వాగత తోరణంగా నిలుస్తుంది.
-కామర్సు బాలసుబ్రమణ్యం
(ఆంధ్రభూమి సౌజన్యం తో)